e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జనగాం ఘన చరితకు.. దృశ్యరూపం

ఘన చరితకు.. దృశ్యరూపం

  • కాకతీయుల కీర్తిని కళ్లకుకట్టేలా ‘సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షో’
  • పర్యాటకులను కట్టిపడేసే యుద్ధ సన్నివేశాలు
  • శ్రావ్యంగా వినిపించే చరిత్ర వ్యాఖ్యానం
  • ఓరుగల్లు కోట కీర్తితోరణాల మధ్య ప్రదర్శనలు

కాకతీయుల చరిత్ర ఓ అద్భుతం. వారి పాలనా కాలం స్వర్ణయుగం. వీరి ఏలుబడిలో రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుత కళాఖండాలు ఇప్పటికీ మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. నాటి చరిత్రను నేటి తరాలకు తెలిసేలా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఓ దృశ్య రూపమిచ్చింది. ఇందుకోసం ఓరుగల్లు కోట కీర్తి తోరణాల మధ్య ‘సౌండ్‌ అండ్‌ లైట్స్‌’ షో ద్వారా నాటి యుద్ధ సన్నివేశాలు, వీరోచిత పోరాటాలు, అద్భుత ఘట్టాలు మన కళ్లముందు కదలాడేలా ఏర్పాటుచేసింది.

శతాబ్దాల కాలం దేదీప్యమానంగా వెలుగొందిన కాకతీయుల చరిత్ర ఓ అపూర్వ ఘట్టం. వారి పాలనాకాలంలో రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండాలు.. కట్టడాలు.. జనరంజక పరిపాలన నేటి తరాలకు ఆదర్శమని ఫెర్గ్యూసన్‌ పండితుడు, ఇటలీ దేశానికి చెందిన మార్కోపోలోతోపాటు మరెందరో విదేశీ యాత్రికులు తమ వ్యక్తిగత గ్రంథాల్లో శ్లాఘించారు. అంతటి మహోన్నత చారిత్రక నేపథ్యమున్న కాకతీయుల చరిత్రను నేటి తరాలకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఓరుగల్లు కోటలో ‘సౌండ్‌ అండ్‌ లైట్స్‌’ షోను రూపొందించింది. కీర్తి తోరణాలు (ద్వార తోరణాలు), అద్భుత శిల్పకళా సౌందర్యాల మధ్య రంగు రంగుల విద్యుత్‌ దీపాలు, నాటి యుద్ధ సన్నాహాలు, వీరోచిత పోరాటాలు.. ఆటలు.. పాటలు.. విజయోత్సవ సంబురాలతోపాటు మరెన్నో ఘట్టాలు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఇక్కడ మరో అద్భుతం సౌండ్‌. భీకర పోరాటంలో రణగొణ ధ్వనుల శబ్ధం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఎటు వైపు నుంచి ఏమస్తుందో తెలిసేలా శబ్ధాలు చెవులకు గింగిర్లు పుట్టిస్తాయి. యుద్ధ రంగంలో గుర్రాల సకిలింపులు.. ఏనుగుల అరుపులు.. యుద్ధ శంఖారావాలు.. ముష్కరుల దాడిలో ధ్వంసమవుతున్న ఆలయాలు..ఆర్తనాదాలు.. ఇలా ఎన్నో ప్రదర్శనలో పర్యాటకులను కట్టిపడేస్తాయి.

- Advertisement -

ప్రదర్శనలో చారిత్రక కట్టడాలు..
కాకతీయుల ఏలుబడిలోని రామప్ప ఆలయం విశిష్టత, మట్టి, రాతికోట ప్రవేశ ప్రధాన ద్వారాలు, ఏకశిలగుట్ట వంటి చారిత్రక కట్టడాలను కీర్తి తోరణాల మధ్యలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ (తెర)పై చూడచ్చు. అదేవిధంగా హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వేయిస్తంభాల ఆలయం), కల్యాణ మండపం, కోనేరు నిర్మాణ శైలి ప్రతి ఒక్కరి మనసును చరిత్ర వైపు మళ్లిస్తుంది.

ఒళ్లు గగుర్పొడిచేలా పాటలు
సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోలో వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటి చారిత్రక అంశాలపై రూపొందించిన పాటలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఒక్కో పాట కాకతీయ చక్రవర్తుల పౌరుషం, పరిపాలన దక్షత, రణరంగంలో రుద్రమదేవి అనుసరించిన వ్యూహాన్ని గుర్తు చేస్తుంది. చీకటి అలుముకున్న కోట మధ్యలో భీకర ధ్వనులకు అనుగుణంగా విద్యుత్‌ దీపాలు పర్యాటకులను మరో లోకానికి తీసుకెళ్తాయి. ఎటు చూసినా యుద్ధ సన్నివేశాలు.. శ్రావ్యంగా వినిపించే వ్యాఖ్యానం ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నది.

యుద్ధంలో రుద్రమదేవి
దేవగిరి యాదవ రాజు మహాదేవుడితో జరిగిన యుద్ధంలో రాణి రుద్రమదేవికి ఎదురు నిలువలేక ప్రత్యర్థులు పారిపోతారు. ఈ క్రమంలో మహాదేవుడు యుద్ధ నీతిని మరిచి రుద్రమదేవిని వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె వేసిన కేకలు, పౌరుషంతో మా ట్లాడిన మాటలు వీక్షకులను కదిలిస్తాయి. రుద్రమదేవి నేలకొరిగిన తీరు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. అనంతరం ప్రతాపరుద్రుడి పరిపాలన దక్షత, సుల్తాన్‌లకు లొంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం వంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ‘షో’ ముగిసిన తర్వాత రామప్ప నిర్మాణంలో వాడిన నీటిపై తేలియాడే ఇటుకను చూస్తూ మురిసిపోవడం పర్యాటకుల వంతు.

హిందీ, ఇంగ్లిషులో కూడా షో..
ప్రతి ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు మొదటి ప్రదర్శన రాత్రి 7 నుంచి 7.50 గంటల వరకు, రెండో ప్రదర్శన రాత్రి 8 నుంచి 8.50 గంటల వరకు ఉంటుంది. అలాగే సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మొదటి ప్రదర్శన సాయంత్రం 6.30 నుంచి 7.20 గంటల వరకు, రెండో ప్రదర్శన రాత్రి 7.30 నుంచి 8.20 గంటల వరకు ఉంటుంది. ఏ కాలమైనా మూడో ఆట మాత్రం పర్యాటకుల డిమాండ్‌ను బట్టి ఉంటుంది. మొదటి షో తెలుగులో, రెండో షో హిందీ లేదా ఇంగ్లిషు భాషలో పర్యాటకుల అభీష్టం మేరకు ఉంటుంది. వివరాల కోసం 7780668228 నంబర్‌లో సంప్రదించవచ్చు. టికెట్‌ ధరలు పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20. పాఠశాలల విద్యార్థులు సమూహంగా వస్తే టికెట్‌పై పది శాతం రాయితీ ఉంటుంది.

  • గట్టికొప్పుల అజయ్‌, సౌండ్‌ లైట్స్‌ షో ఖిలా వరంగల్‌ ఇన్‌చార్జి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana