మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించి వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తున్నది. ఈమేరకు వారికి స్వయంఉపాధి కల్పించేందుకు స్త్రీశక్తి మార్టులు నెలకొల్పింది. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులైన పసుపు, కారం, అల్లంపేస్ట్, పప్పులు, నూనె, దనియాలను స్థానికంగానే ప్రాసెసింగ్ చేసి విక్రయించే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జనగామ జిల్లాలో 60 స్టోర్లు ఏర్పాటుకాగా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విక్రయాలు ఊపందుకున్నాయి. ఫలితంగా వినియోగదారులకు కల్తీ లేని నాణ్యమైన వస్తువులు అందడమే గాక మార్కెట్ కంటే తక్కువ ధరకే రానున్నాయి.
దేవరుప్పుల, సెప్టెంబర్ 22 : మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ఊతమిస్తున్న రాష్ట్ర సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు ఉపాధి మార్గాలు చూపిన ప్రభుత్వం తాజాగా వారు వ్యాపారరంగంలో రాణించేందుకు స్త్రీశక్తి మార్టులను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలతో గ్రామాల్లో కిరాణా దుకాణం పెట్టించి, అందులో నాణ్యమైన, పోషక విలువలతో కూడిన సరుకులు అందించి తద్వారా ఉపాధితో పాటు పేదలకు కల్తీలేని ఉత్పత్తులు అందించాలని నిర్ణయించింది. దీని కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నేరుగా నాణ్యమైన పంటలు కొని, ప్రాసెస్‌తో పాటు ప్యాకింగ్ చేసి ఎస్‌హెచ్‌జీ సంఘాలు ఏర్పాటుచేసిన దుకాణాలకు చేర్చుతారు. దీంతో గ్రామాల్లో ఇతర వ్యాపారులు పెట్టిన దుకాణాలతో పోల్చితే, నాణ్యమైన సరుకులు ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఏర్పాటు చేసిన స్త్రీశక్తి మార్టుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
పేదల ఆరోగ్యం.. మహిళల స్వయం ఉపాధే లక్ష్యం
ప్రస్తుతం పప్పులు, నూనెలు, పసుపు, కారం, అల్లం పేస్ట్ ఇలా ఎక్కువ శాతం కల్తీ అవుతుండడంతో అవి కొన్న పేదలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతూ వైద్యానికి ఉన్నతంతా ఖర్చు చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు పేదరిక నిర్మూలన సంస్థ మహిళలతో కిరాణా దుకాణాలు పెట్టించి, వారికి నాణ్యమైన సరుకులు సరఫరా అందిస్తోంది. గ్రామాల్లో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా మహిళా సంఘాలే కొని ప్రాసెస్, ప్యాకింగ్ చేసిన స్త్రీశక్తి మార్టుల పేర స్టిక్కరింగ్తో వ్యాపారులు అమ్ముతున్న ధరల కన్నా తక్కువ ఉండేలా రేటు నిర్ణయించి స్త్రీశక్తి మార్టుల్లో అమ్ముతారు.
ముఖ్యమంత్రి ఆరా..
జనగామ జిల్లాలో నడుస్తున్న స్త్రీశక్తి మార్టుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే మంచిదని, వెంటనే జనగామ తరహాలో మార్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తే సరుకులను నేరుగా స్త్రీశక్తి మార్టులకు అందిస్తే ఉత్తమంగా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నారు.
ప్రప్రథమంగా జనగామ జల్లాలోనే..
ఈ దుకాణాలు ప్రప్రథమంగా జనగామ జిల్లాలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు బైరిసన్ సంస్థ మహిళా సంఘాలకు చేయూతనిస్తూ నాణ్యమైన సరుకులు, అందమైన ప్యాకింగ్లలో సరఫరా చేస్తోంది. దీంతో గ్రామాల్లో బైరిసన్ ఎస్‌హెచ్‌జీ స్టోర్లు వెలిశాయి. ఈ క్రమంలో జనగామ జిల్లా ఉన్నతాధికారులు బైరిసన్ ప్రమేయం లేకుండా మహిళలే రైతుల నుంచి నేరుగా ఆహార ఉత్పత్తులు కొని ప్రాసెస్ చేసి ప్యాకింగ్లతో అమ్మితే ఇంకా తక్కువ ధరలకు సామాన్యులకు నిత్యావసరాలు అందుతాయని భావించారు. అదే సమయంలో స్త్రీశక్తిమార్టులు లాభాల బాటలో నడుస్తాయనే నిర్ణయానికి రాగా, బైరిసన్ స్థానంలో జనగామ జిల్లాలో ప్రప్రథమంగా తెలంగాణ స్త్రీశక్తి మార్టులు ఏర్పాటు చేశారు.
మహిళలు తయారు చేసినవే అధికం
జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలు ప్రాసెస్ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు పసుపు, కారం, అల్లంపేస్ట్, పప్పులు, నూనె, దనియాలు ప్యాకింగ్ చేసి సరసమైన ధరలకు ఈ స్త్రీశక్తి మార్టులకు సరఫరా చేస్తున్నారు. ఇక సబ్బులు, పేస్ట్‌లు, స్థ్ధానికంగా దొరకని ప్యాకింగ్ వస్తువులను బ్రాండెడ్ కంపెనీల నుంచి హోల్‌సేల్‌గా కొని తెచ్చేకునే కార్యాచరణ రూపొందించారు. ఎట్టకేలకు జిల్లాలో 60 స్త్రీశక్తి మార్టులు వెలియగా, ఈ షాపులు గ్రామాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి
లాభాపేక్షతో పాటు పేదలకు నాణ్యమైన సరుకులు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యంగా ఉంటున్నాయి. ఇవన్నీ కల్తీలేని సరుకులు. ప్రభుత్వం మరింత ఆలోచించి డీమార్ట్, రిలయన్స్‌లకు అందే రేటులో సరుకులు తమ స్త్రీశక్తి మార్టులకు చేరవేసేలా చేస్తే ఉభయతారకంగా ఉంటుంది. స్త్రీశక్తి మార్టుతో పాటు, గాజులు, చీరలు అమ్ముతున్నా. ప్రస్తుతం మార్టు బాగానే నడుస్తోంది.
మరిన్ని ఉత్పత్తులు ఇవ్వాలి..
కిరాణా దుకాణంలో దొరికే ప్రతి వస్తువు మహిళా సంఘాల నుంచి సరఫరా చేస్తే వ్యాపారుల మీద ఆధారపడే అవసరం ఉండదు. అప్పుడు స్టోర్ కూడా లాభాల బాటలో నడుస్తోంది. స్త్రీశక్తి మార్టుతో పాటు టైలరింగ్, మినీ బ్యాంకింగ్, బట్టల వ్యాపారం చేస్తున్నా. మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులను కూడా ప్రభుత్వం మాకు హోల్‌సేల్ రేట్లకు ఇస్తే బాగుంటుంది.