కరీమాబాద్, సెప్టెంబర్ 18: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 500 విగ్రహాలు నిమజ్జనం జరిగే ఉర్సు చెరువు, 150 విగ్రహాలు నిమజ్జనం జరిగే బెస్తం చెరువు వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి శనివారం పనులను పర్యవేక్షించారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉర్సు బైపాస్‌రోడ్డు నుంచి ఉర్సు చెరువు వరకూ విద్యుత్ లైట్లు అమర్చారు. నిమజ్జనం చేసేందుకు తెప్పలు, క్రేన్లను సిద్ధం చేశారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలో ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉర్సు చెరువు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉర్సు రంగసముద్రం వద్ద పూర్తిస్థాయిలో వసతులు కల్పించినట్లు కార్పొరేటర్ మరుపల్ల రవి తెలిపారు. గణపతి నిమజ్జనానికి బెస్తం చెరువు వద్దకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని మామునూరు సీఐ రమేశ్ కోరారు.
ఉర్సు చెరువును పరిశీలించిన సీపీ
కరీమాబాద్/గీసుగొండ: ఉర్సు చెరువును శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేటర్ మరుపల్ల రవి ఏర్పాట్లపై సీపీకి వివరించారు. ఖిలావరంగల్‌లోని మాల అగర్తా చెరువును ఖిలావరంగల్ తాసిల్దార్ మంజుల, కార్పొరేటర్ బైరబోయిన ఉమ పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కట్టమల్లన్న చెరువు వద్ద ఏర్పాట్లను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి పరిశీలించారు. డీజేలు, మైక్ సెట్లను వాడొద్దన్నారు. ఆమె వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై దేవేందర్ ఉన్నారు.
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
పోచమ్మమైదాన్: గణనాథుల నిమజ్జనానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువు, ఆటోనగర్ సమీపంలోని కోట చెరువు వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద బారికేడ్లు, నాలుగు క్రేన్లు, నాలుగు తెప్పలు, పది మంది గజ ఈతగాళ్లతోపాటు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 50 మందిని సిద్ధంగా ఉంచినట్లు నోడల్ అధికారి రాజారావు తెలిపారు. కోట చెరువు వద్ద నాలుగు క్రేన్లు, మూడు తెప్పలు, పది మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
ప్రశాంతంగా జరిగేలా చూడాలి
వర్ధన్నపేట/రాయపర్తి/చెన్నారావుపేట/నల్లబెల్లి: గణపతి నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలకేంద్రంలోని కోనారెడ్డి చెరువును పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అలాగే, రాయపర్తిలోని మంచినీళ్ల చెరువును సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి హరిసింగ్ పరిశీలించారు. చెన్నారావుపేట మండలంలో గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తాసిల్దార్ ఫూల్సింగ్చౌహాన్ తెలిపారు. అన్ని గ్రామాల్లోని చెరువుల వద్ద కార్యదర్శులు, వీఆర్ఏల పర్యవేక్షణలో నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. చెన్నారావుపేట మండలంలో భక్తులు గణేశ్ నిమజ్జనోత్సవాన్ని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని ఎస్సై శీలం రవి కోరారు. నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువు వద్ద ఏర్పాట్లను ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎస్సై బండారు వెంకటేశ్వర్లు పరిశీలించారు. మండలవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశామని వారు తెలిపారు. వారి వెంట ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్ ఎన్ రాజారాం, కార్యదర్శులు ధర్మేందర్, క్రాంతి ఉన్నారు.
ఎల్గూర్‌చెరువు వద్ద ఏర్పాట్ల పరిశీలన
సంగెం/నర్సంపేట రూరల్: సంగెం మండలంలోని ఎల్గూర్‌చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను శనివారం పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, సంగెం ఎస్సై భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ఎల్గూర్‌రంగంపేట, మొండ్రాయి, ముమ్మిడివరం, పల్లార్గూడ, నార్లవాయి, నల్లబెల్లిలో ఏటా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు. నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల్లో ఈ దఫా 630 పైగా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేశారు. క్రేన్లు, తెప్పలను అందుబాటులో ఉంచారు.
నిమజ్జనానికి వేళాయే..
వరంగల్: విగ్రహాల నిమజ్జనానికి నగరంలో 13 చెరువులను ఎంపిక చేశారు. పద్మాక్ష్మి, చిన్నవడ్డేపల్లి, బంధం, ఉర్సు, కోటి చెరువు వద్దకు భారీ విగ్రహలు తరలిరానున్నాయి. గ్రేటర్లో 24 క్రేన్లను వినియోగిస్తున్నారు. 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెప్పలు, బోట్లను సిద్ధం చేశారు. చెరువుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు చెరువు, ఆగర్తాల చెరువు, పద్మాక్షి గుండం, బంధం చెరువు, గుండ్ల సింగారం, భీమారం, హసన్‌పర్తి పెద్ద చెరువు, మడికొండ చల్లా చెరువు, బెస్తం చెరువు, మామునూరు పెద్ద చెరువు, కట్టమల్లన్న చెరువులు విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయి.