e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జనగాం ఆరంభం అదరహో..

ఆరంభం అదరహో..

  • జేఎన్‌ఎస్‌లో అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు షురూ
  • సింథటిక్‌ ట్రాక్‌పై చిరుతల్లా క్రీడాకారుల పరుగులు
  • కోలాహలంగా మైదానం
  • క్రీడాపండుగను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి

హనుమకొండ చౌరస్తా/సుబేదారి, : మెరికల్లాంటి క్రీడాకారులు చిరుతల్లా పరుగు తీశారు. సింథటిక్‌ ట్రాక్‌పై కొందరు మెరుపు వేగంతో దూసుకెళ్తే.. మరికొందరు ఉరిమే ఉత్సాహంతో లాంగ్‌జంప్‌, హైజంప్‌, షార్ట్‌పుట్‌ ఈవెంట్లలో పాల్గొని దుమ్ములేపారు. ఇలా హనుమకొండ జేఎన్‌ఎస్‌లో నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మార్నింగ్‌, ఈవెనింగ్‌ సెషన్లలో 5వేల మీటర్ల పరుగుపందెం పోటీల్లో మెన్‌ కేటగిరీలో అభిషేక్‌పాల్‌, ఉమెన్‌ కేటగిరీలో పారుల్‌ చౌదరి విజేతలుగా నిలువగా.. డెకాథ్లాన్‌ (పురుషుల)లో ఐదు ఈవెంట్లు పోటాపోటీగా సాగాయి. ఈ క్రీడా పండుగను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించగా, తిలకిం చేందుకు వచ్చిన క్రీడాభిమానులు, వారి కేరింతలతో మైదానమంతా కోలాహ లంగా మారింది.

హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో 60వ నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతో తొలిరోజు ఈవెంట్లు ఉత్సాహభరితంగా సాగాయి. ఉదయం 6గంటలకే అథ్లెట్లు మైదానానికి చేరుకోగా ఏఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పకడ్బందీగా పోటీలు నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, నగర కమిషనర్‌ ప్రావీణ్య పోటీలను పరిశీలించారు.

- Advertisement -

తొలిరోజు పోటీలు..
మొదటిరోజు 5000 మీటర్ల పరుగు పందేలు(మెన్‌, ఉమెన్‌) నిర్వహించారు. ఇందులో వివిధ రాష్ర్టాల అథ్లెట్లు పాల్గొని ప్రతిభ చాటారు. పురుషుల విభాగంలో డెకాథ్లాన్‌ 100, 400 మీటర్లు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌, హైజంప్‌ నిర్వహించారు.

5వేల మీటర్లు (పురుషుల విభాగం) : మార్నింగ్‌ సెషన్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ పాల్‌(రైల్వేస్‌, 14.16) విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో ధర్మేందర్‌(సర్వీసెస్‌), అజయ్‌కుమార్‌(సర్వీసెస్‌), కార్తీక్‌కుమార్‌(సర్వీసెస్‌), రాకేశ్‌ మండల్‌(ఉత్తరాఖండ్‌), నరేంద్ర ప్రతాప్‌సింగ్‌(రైల్వేస్‌), అరుణ్‌కుమార్‌(రైల్వేస్‌), సతీశ్‌కుమార్‌(తమిళనాడు) పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిషేక్‌పాల్‌(14.16) అందరికంటే ముందువరుసలో నిలిచారు. ధర్మేందర్‌(14.17), అజయ్‌కుమార్‌(14.20) ఈ ముగ్గురు ఏషియన్‌గేమ్స్‌, ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్రం నుంచి 15 మంది అథ్లెట్లు..
నలుగురు రంగారెడ్డి, ముగ్గురు హైదరాబాద్‌ నుంచి..
పోటీల్లో రాష్ట్రం నుంచి 17మందిని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక చేయగా 15మంది పాల్గొంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల సీహెచ్‌.నవీన్‌(ఖమ్మం), డి.భాగ్యలక్ష్మి(నాగర్‌కర్నూల్‌) పాల్గొనడం లేదని కోచ్‌ నాగమణి తెలిపారు. నలుగురు రంగారెడ్డి, ముగ్గురు హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి ఒకరు ఉన్నారు. వీరికి కోచ్‌లుగా ఎండీ.గౌస్‌, బాసా నాగమణి, మేనేజర్లుగా ఎండీ.షరీఫ్‌ అహమ్మద్‌, కొర్ర లక్ష్మణ్‌ వ్యవహరిస్తున్నారు.

కోలాహలం..
అథ్లెటిక్స్‌ పోటీల ప్రారంభంతో జేఎన్‌ఎస్‌కు కొత్తకళ వచ్చింది. తొలిరోజు ఓ వైపు క్రీడాకారులు పోటీపడుతుండగా, మరోవైపు గ్యాలరీల్లో కూర్చున్న వందలాది మంది క్రీడాకారులు, అభిమానులు ఈలలు, చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మైదానం కోలాహలంగా మారింది. పోటీలను తిలకించేందుకు పలు మండలాల్లోని పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు తరలిరావడంతో స్టేడియం మొత్తం నిండిపోయింది.

ఉమెన్‌ కేటగిరీలో పారుల్‌ చౌదరి విజేత
5వేల మీటర్ల మహిళా విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్‌ చౌదరి(రైల్వేస్‌) విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో మొత్తం ఏడుగురు మహిళలు పాల్గొన్నారు. కాగా పారుల్‌ చౌదరి(15.59) టార్గెట్‌ చేరుకుంది. ఈవెంట్‌లో అంతర్జాతీయ రికార్డు 15.36 నిమిషాలు కాగా పారుల్‌ చౌదరి 15.59 సమయంలో లక్ష్యాన్ని చేరుకుంది. కోమల్‌ చంద్రకాంత జాగదాయి(మహారాష్ట్ర, 16.01), సంజీవని బాబురావు జాదవ్‌(మహారాష్ట్ర, 16.19) వివిధ పోటీలకు అర్హత సాధించారు.

ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్‌..
అథ్లెటిక్స్‌ పోటీలను క్రీడాకారులు, అభిమానులు వీక్షించేందుకు నిర్వాహకులు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తున్నారు. ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ప్రత్యేక నిపుణులతో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం పెద్ద పెద్ద భారీ కెమెరాను, డ్రోన్లతో చిత్రీకరిస్తూ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల సాయంతో క్రీడా విశేషాలు విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana