ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష
జనగామ చౌరస్తా, డిసెంబర్ 4 : 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు వచ్చిన కొత్త ఓటరు నమోదు ఫారం 6, 7, 8, 8ఏతో పాటు ఓటరు జాబితాలో పేరు, ఫొటో లేకపోవడం వంటి సమస్యలపై వచ్చిన అర్జీలను స్థానికంగా విచారణ జరుపాలని కోరారు. తుది ఓటరు జాబితా ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గరుడ యాప్ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గరుడ యాప్ను ఎలా ఉపయోగించాలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) పూర్తి శిక్షణనివ్వాలని ఆయన సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో స్వీప్ యాక్టివిటీ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులుగా చేయాలన్నారు. 1 జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఆన్లైన్ ద్వారాగానీ, ఆఫ్లైన్లో ఫారం 6 ద్వారాగానీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన బిల్లులు పెండింగ్లో ఉంటే సత్వరమే బిల్లులు దాఖలు చేసి సరైన వివరాలు సమర్పించాలన్నారు. ఓటరు జాబితాను ఆన్లైన్ లేదా హార్డ్ కాపీ కాకుండా సీడీ, పెన్ డ్రైవ్ల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలతో క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా బీఎల్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో కలిసి గరుడా యాప్, స్వీప్ యాక్టివిటీస్పై తరచూ సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు, జనగామ ఆర్డీవో సీహెచ్ మధుమోహన్, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, ఎస్డీసీ మాలతి, ఎన్నికల పర్యవేక్షకులు ఎతేషాం అలీ, తహసీల్దార్లు, బీఎల్వోలు పాల్గొన్నారు.