‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామం.. ప్రభుత్వ నిధుల సద్వినియోగం
ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మాణం
ఆహ్లాదం పంచే అందమైన ప్రకృతి వనం
పారిశుధ్య నిర్వహణతో పరిశుభ్ర వాతావరణం
గతేడాది ఉత్తమ జీపీ అవార్డు సొంతం
నడికూడ, మార్చి 23 : ప్రభుత్వ ప్రోత్సాహం.. ప్రజాప్రతినిధుల చొరవకు, ప్రజల సహకారం కూడా తోడైతే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుంది. వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ‘పల్లె ప్రగతి’ని పక్కా ప్రణాళికతో అమలుచేయడంతో ఊరి ముఖచిత్రమే మారింది. ప్రతివీధికీ సీసీ రోడ్డు వచ్చింది. పక్కాగా పారిశుధ్య నిర్వహణతో చెత్త, మురుగు సమస్య తీరింది. ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రగతిలో గతేడాది ఈ గ్రామం ఉత్తమ అవార్డును సైతం సొంతం చేసుకున్నది.
వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపురం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకున్నది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ఇప్పటికే కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, సీసీ రోడ్లు, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. వీధుల్లోని చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహిస్తుండడంతో వీధులు, అంతర్గత రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. పల్లె ప్రకృతి వనం అందమైన పూల మొక్కలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డంపింగ్ యార్డు, వైకుంఠధామం పనులు పూర్తి చేశారు. అంతిమ యాత్ర కోసం స్వర్గరథం కూడా ఏర్పాటు చేశారు. గ్రామ పరిసరాలన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గ్రామ కూడలి వద్ద గుడికి వెళ్లేదారిలో నిర్మించిన ఆర్చి చూపరులను ఆకట్టుకుంటున్నది. ఇటీవల గ్రామస్తులు విరాళాలు వేసుకుని హనుమాన్ ఆలయాన్ని నిర్మించుకున్నారు. గ్రామ స్వరాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఇలాంటి గ్రామాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పలు గ్రామాలకు రోల్మాడల్గా మారుతున్నాయి. అంతేకాకుండా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత చేతుల మీదుగా జనవరి 26, 2020న ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును సర్పంచ్ పెండ్లి రాజు అందుకున్నారు.
గ్రామస్తుల సహకారం మరువలేనిది..
సర్కారు సూచనలు, ఆదేశానుసారం అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నం. గ్రామ పంచాయతీకి నిధులు వెంట వెంటనే మంజూరు కావడంతో పల్లె ప్రగతి కార్యక్రమాలను వేగంగా చేయగలిగాం. అందుకు తోడు గ్రామస్తుల సహకారం మరువలేనిది. గ్రామ పంచాయతీకి మా నాన్న వాహనాన్ని సమకూర్చారు. రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
-పెండ్లి రాజు, రామకృష్ణాపురం సర్పంచ్
అన్ని వీధుల్లో సీసీ రోడ్లు..
మా గ్రామానికి ఇప్పటికే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. దాదాపు అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేసిన్రు. రోడ్లెంబట మొక్కలు నాటిన్రు. ఎప్పటికప్పుడు నీళ్లు పోసి మంచిగ పెంచుతున్నరు. ఈ రెండు, మూడేళ్లలోనే ఊరు మంచిగ మారింది.