e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం ఓరుగల్లు కవులు సాహితీ సామ్రాట్లు..

ఓరుగల్లు కవులు సాహితీ సామ్రాట్లు..

స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షరయోధుడు కాళోజీ
కవితలనే బాణాలుగా ఎక్కుపెట్టిన వారెందరో..
కవుల ఖిల్లా ఉమ్మడి జిల్లా.. నేడు ప్రపంచ కవితా దినోత్సవం
ఖిలావరంగల్‌, మార్చి 20 : కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ఎందరో కవులు.. విశ్వసాహితీ సామ్రాట్లుగా ఎదిగారు. సుతిమెత్తని కవితలతో ఉత్సాహం నింపిన వారు కొందరైతే.. అన్యాయాలను ఎదిరించేందుకు అక్షరమే ఆయుధంగా మలిచి చైతన్యం రగిలించిన వారు మరికొందరు. ప్రజాకవి కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు వంటి దిగ్గజాలతో పాటు ఎంతోమంది కవులకు ఖిల్లా మన ఉమ్మడి వరంగల్‌ జిల్లా. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మహా సాహితీవేత్తలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.

కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ఎందరెందరో కవులు తమ సాహిత్యంతో ప్రజలను చైతన్యవంతంగా తీర్చిదిద్దారు. అందులో కొంతమంది వరంగల్‌ ఉమ్మడి జిల్లా కవుల గురించి సంక్షిప్తంగా.. వరంగల్‌ జీడికల్లు గ్రామానికి చెందిన గంగుల శాయిరెడ్డి, బక్కయ్య శాస్త్రి, ఆయన నలుగురు కుమారులు వేంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులతో పాటు వరదాచార్యులు, వరంగల్‌ జిల్లా మహేశ్వరానికి చెందిన సుకరనేని ఫణికుండలుడు, మడికొండకు చెందిన మోత్కూరి పండరీనాథరావు, అనుముల కృష్ణమూర్తి, ఖిలాషాపురానికి చెందిన రంగరాజు కేశవరావు, తూము రామదాసు, సాహితీవేత్త పొట్లపల్లి రామారావు, బిరుదురాజు రామరాజు, పాములపర్తి సదాశివరావు, బండారు సదాశివరావు, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు, చేతనావర్తం కవుల్లో ఒకరు వేనరెడ్డి..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సాహితీ సామ్రాట్లు ఈ నేలపై తమ అక్షరాలతో ప్రజలను చైతన్యపరిచారు. వీరి స్ఫూర్తితో ఇంకా ఎందరో తమ కవిత్వంతో సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. పురాతన సాహిత్యరూపమైన కవిత్వాన్ని గౌరవించడం మన దేశంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇతర దేశాల్లో ఇది 18వ శతాబ్దం తర్వాతే మొదలైంది. ఐరోపాలో రోమన్‌ కవి విర్రీన పేరున అక్టోబర్‌ నెలలో కవితా దినోత్సవం జరుపుకున్నారు. 1999లో పారిస్‌లో యునెస్కో సమావేశంలో ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరుపాలని నిర్ణయించారు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా కవితా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

- Advertisement -

దేవులపల్లి రామానుజరావు
జన్మస్థలం : దేశాయిపేట, వరంగల్‌ జిల్లా
తెలంగాణ విముక్తి కోసం అక్షరమే ఆయుధంగా అలుపెరుగని పోరాటం చేసిన సాహితీకారుడు దేవులపల్లి. 1950 నుంచి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్‌, సిండికేట్‌ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలో అనుబంధాలేర్పచుకొని తెలుగు భాష, రచనల పరివ్యాప్తికి కృషిచేశారు. గోల్కొండ పత్రికకు ఉపసంపాదకులు, శోభ పత్రికను స్థాపించారు. హైదరాబాద్‌ సం స్థానం విమోచన నేపథ్యంలో పాల్గొన్న ఉద్యమకారుడు, గ్రంథాలయాలకు పాలకమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యుడు.
రచనలు : సారస్వత నవనీతం, తెలుగు సీమలో సాంస్కృ తిక పునరుజ్జీవనం, వేగుచుక్కలు, తెలుగు దేశము, తలపుల దుమారము, మన దేశం-తెలుగు సీమ, గౌతమ బుద్ధుడు, కావ్యమాల.

కాళోజీ నారాయణరావు
జన్మస్థలం: బీజపూర్‌, కర్నాటక. కాళోజీ జననం తర్వాత ఆయన కుటుంబం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మడికొండకు వలస వచ్చింది.
కాలం : 1914-2002
తెలంగాణ ధిక్కార స్వరం.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది.. జయప్రకాశ్‌ నారాయణ గురించి కాళోజీ అన్న మాటలు ఆయనకు కూడా సరిగ్గా వర్తిస్తాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన కవితలతో ప్రశ్నించి కోట్లాది మందిలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షరయోధుడు. అన్యాయాన్నెదిరిస్తేనే ‘నా గొడవ’కు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించారు కాళోజీ. ఆయన సాహితీ సేవను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పుట్టినరోజు నాడు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుతోంది.
రచనలు: నా గొడవ, అణాకథలు, నా భారతదేశ యాత్ర, కాళోజీ కథలు, తుది విజయం.. మనది నిజం, ఇది నా గొడవ(ఆత్మకథ), బాపు.. బాపు.. బాపు!, తెలంగాణ ఉద్యమ కవితలు.

వానమామలై వరదాచార్యులు
జన్మస్థలం : మడికొండ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా
కాలం: 1912-1984
13 ఏళ్లకే పద్యరచన చేసి ‘అభినవ పోతన’గా గుర్తింపు పొందిన సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు. కళలకు కాణాచి, కాకతీయుల రాజధానిలో కొలువుదీరిన సాహిత్య దిగ్గజాల్లో ఈయన ఒకరు. ఓరుగల్లు సమీపంలోని బమ్మెర గ్రామం పోతన్న జన్మస్థలమైతే అదే ప్రాంతానికి చెంది మడికొండ గ్రామం మన వరదన్న జన్మస్థలం కావడం యాదృచ్చికం. పోతనకు సిద్ధుడు తారకమంత్రోపదేశం చేసి వాణి నీ జిహ్వాగ్ర మందుండునని దీవిస్తే. వరదన్న వాగీశ్వరీ మంత్రోపాసన చేసి వరసిద్ధి పొందాడు. పోతన్నకు రామచంద్ర విభుడు స్వప్నంలో సాక్షాత్కరిస్తే వరదన్నకు రామతారక మంత్రోపదేశం లభించింది.
రచనలు : పోతన చరిత్రము, మణిమాల, ఆహ్వానం, జయధ్వజం, విప్రలబ్ధి, వైశాలిని, దాగుడుమూతలు, మాతృప్రేమ, రైతు బిడ్డతో పా టు పండితులను మెప్పించే కావ్యరచన, పామరుల మదిని నిత్యం పులకించే హరికథ, బుర్రకథలు, నాటిక, కీర్తనలు, మంగళహారతులు అందించి భక్తి భావనతో పరవశింపజేశారు.

దాశరథి కృష్ణమాచార్యులు
జన్మ స్థలం: చిన్నగూడూరు, మహబూబాబాద్‌ జిల్లా
కాలం :1925-1987
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అం టూ నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన అభ్యదయ కవి. ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. కళాప్రపూర్ణ, తిమిరంతో సమరం కావ్యరచనకు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఏపీ ఆస్థాన కవిగా బాసిల్లారు.
రచనలు : రుద్రవీణ, నా తీర్పు, ఆలోచనాలోచనాలు, తిమిరంలో సమరం, నవమి, అగ్నిధార, మహాంధ్రోదయం మొదలైనవి.
ఆచార్య పేర్వారం జగన్నాథం
జన్మస్థలం : ఖిలాషాపురం, జనగామ జిల్లా, కాలం : 1934-2008
ఉన్నది ఉన్నట్టుగా, వ్యంగ్యంగా చెప్పిన కవి పేర్వారం జగన్నాథం. విమర్శకుడు, ఉత్తమ అధ్యాపకుడు, పరిపాలనాదక్షుడు. సాగర సంగీ తం, వృషభపురాణం, గరుడ పురాణం వంటి కవితా సంకలనాలే గాక, రెండు చేతనవర్త కవితా సంకలనాలు వెలువరించారు. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, సాహితీ సౌరభంవంటి విమర్శ గ్రంథాలతో ఆరె జానపద సాహిత్యం-తెలుగు ప్రభావం అంశంపై పరిశోధనకు గాను పీహెచ్‌డీ పట్టా పొందిన గొప్ప విమర్శకులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement