షిప్టు పద్ధతిన నిరంతరం విధులు
ఫోర్వే జంక్షన్ల వద్ద పోలీసు పికెట్లు
మినహాయింపులు ఉన్నవారికి అనుమతి
లాక్డౌన్ సమయంలో ప్రయాణించే వారికి ఈ-పాసులు
అత్యవసర సరుకులు రవాణా చేసేవారికీ పాసుల జారీ
‘నమస్తేతెలంగాణ’తో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి
వరంగల్ రూరల్, మే 12(నమస్తేతెలంగాణ): ‘కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పోలీసులు నిరంతరం పని చేసేలా ప్రణాళిక రూపొందించాం. షిప్టు పద్ధతిన 24 గంటలూ విధులు నిర్వర్తిస్తారు’ అని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో పోలీసు శాఖ చేపట్టిన చర్యలపై బుధవారం వెంకటలక్ష్మి ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లో…
లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ఫోర్వే జంక్షన్లు, ప్రధాన కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశాం. పరకాల, నర్సంపేట, మామునూరులో పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సిరొంచ హైవేలో పరకాల చలివాగు, 163 జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలంలోని గూడప్పాడ్, వరంగల్-నర్సంపేట రోడ్డులో గీసుగొండ మండలంలోని జాన్‌పాక, ధర్మారం, దుగ్గొండి మండలంలోని గిరినబావి వద్ద, నర్సంపేట పట్టణంతో పాటు పలుచోట్ల పికెట్లు పని చేస్తున్నాయి. జంక్షన్లు, కూడళ్లలోని పికెట్ల వద్ద వాహనాలు ఆపి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నాం. షిప్టు పద్ధతిన నిరంతరం పనిచేస్తారు.
టెస్టులకు వెళ్లే వారిని ఆపం..
లాక్డౌన్ సమయంలో కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కోసం వెళ్లే వారిని ఆపడం లేదు. వ్యాక్సిన్ కోసం సెంటర్లకు వెళ్లే వారి వద్ద స్లాట్ బుకింగ్ చేసుకున్న ఎస్ఎంఎస్ ఉంటుంది. సెకండ్ డోస్ కోసం వెళ్లే వారి వద్ద మొదటి డోస్ వేసుకున్న సమయంలో వచ్చిన మెసేజ్ ఉంటుంది. అవి చూపెడితే సరిపోతుంది. ఇక కరోనా టెస్టుల కోసం వెళ్లే వారు టెస్టింగ్ కోసం పోతున్నామని చెపితే పంపిస్తాం. టెస్టులు, వ్యాక్సిన్ కోసం వెళ్లేది స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలకే అయినందున పెద్ద ఇబ్బంది ఉండదు. వ్యాక్సిన్, టెస్టు కోసం వెళ్లే వారికి తోడుగా ఒక అటెండెంట్‌కు అనుమతిస్తాం. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న వారందరినీ ఆపకుండా పంపిస్తున్నాం.
దరఖాస్తు చేసుకుంటే ఈ-పాస్‌లు
ఉదయం 10 గంటల తర్వాత ట్రావెట్ చేసే వారు దరఖాస్తు చేసుకుంటే ఈ-పాస్ జారీ చేస్తాం. ఇన్నాళ్లు ఇక్కడ ఉండి ఇతర ప్రాంతాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేవారు, ట్రీట్మెంట్ కోసం బయల్దేరిన వారు లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే ఈ-పాస్ లింక్ ద్వారా మాకు దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ నుంచి ఈ-పాస్ లింక్ ద్వారా మాకు అందే దరఖాస్తులను పరిశీలించి అదేరోజు లేదా మురునాడు ఈ-పాస్‌లను జారీ చేస్తాం.
గూడ్స్ అండ్ సర్వీసెస్ పాసులు
ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం గూడ్స్ అండ్ సర్వీసెస్ పాసులు కూడా జారీ చేస్తాం. వాహనదారులు వీటిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పొందే అవకాశం ఉంది. హెడ్‌క్వార్టర్‌లో ఒక అదనపు డీసీపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ పాసుల జారీకి సంబంధించి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. మెడికల్ వంటి అత్యవసర సరుకులను రవాణా చేసే ఆటోలు, వ్యాన్లు తదితర వాహనాల యజమానులు రోజూ పాసు తీసుకోవాల్సిన పనిలేకుండా పదిరోజుల కోసం ఒకేసారి గూడ్స్ అండ్ సర్వీసెస్ పాసు పొందవచ్చు. పర్సనల్ ఈ-పాసులను మాత్రం ఈ-పాస్ లింక్ ద్వార ఐప్లె చేసి తీసుకోవల్సిందే.