ఆఫీసుల వెంట పొద్దంతా తిరిగి అలిసిపోయిన ఓ ఉద్యోగార్థి బస్టాప్‌లో నిల్చున్నాడు. ఆకలితో కడుపు నకనకలాడుతున్నది. జేబులో చిల్లిగవ్వ లేదు. ఎవర్నయినా సాయం అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డొస్తున్నది. ఆ యువకుడి పరిస్థితి గమనించిన పక్కనున్న ఓ దుకాణ యజమానికి సాయం చేద్దామనిపించింది. అయితే, అడగకుండానే సాయం చేస్తే, ఆ యువకుడు ఎలా స్పందిస్తాడోనన్న మీమాంస. దీంతో ఆ వ్యాపారి నోరు మెదపలేకపోయాడు. ఆత్మాభిమానం-సాయగుణం మధ్య ఏర్పడిన ఓ సన్నని అడ్డుపొర.. యువకుడి ఆకలిని తీర్చలేకపోయింది. వ్యాపారి సాయగుణాన్ని సంతృప్తి పర్చలేకపోయింది. మానవ భావోద్వేగాల మధ్య అగాధాన్ని రేపుతున్న ఇలాంటి సున్నిత గీతలను మలేషియాలో జరుగుతున్న ఓ ఉద్యమం చెరిపేస్తున్నది. అదే ‘ఫ్లాగ్ మూమెంట్’ (జెండా ఉద్యమం).
ఏమిటీ ఉద్యమం?
కరోనా లాక్డౌన్ కారణంగా మలేషియాలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. దీనికి ప్రభుత్వ అసమర్థత కూడా కారణమని భావించిన ప్రజలు జెండా ఉద్యమానికి తెరలేపారు. ఒకవైపు, ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తూనే.. మరోవైపు, ఆత్మాభిమానం చంపుకోకుండా తమ అవసరాలను వినూత్న పద్ధతిలో తీర్చుకుంటున్నారు. జెండా లేదా వస్త్రం సాయంతో తమ అవసరాన్ని, నిరసనను తెలియజేస్తున్నారు. తక్కువకాలంలోనే ఇది దేశమంతటా వ్యాపించింది.
సాయం అందేదెలా?
ఆహారం, వస్తువులు తదితర సాయం కావాల్సినవారు నోరు తెరిచి, చేయి చాచి అడగాల్సిన పనిలేదు. ఇంటి ముందు లేదా బాల్కనీలోని తీగపై తెల్లని జెండాను లేదా వస్ర్తాన్ని ప్రదర్శించాలి. ఆ జెండా లేదా వస్ర్తాన్ని చూసిన వారు.. వారికి అవసరమైన సాయాన్ని అందిస్తారు. లేదా.. వారి అవసరాన్ని తీర్చగలిగే ఎన్జీవోలకు సమాచారాన్ని చేరవేస్తారు. ప్రదర్శించే జెండా రంగులను (రంగుల వస్త్రం) బట్టి వారు సాయం అడుగుతున్నారో? నిరసన తెలియజేస్తున్నారోనన్న అంశం ఆధారపడి ఉంటుంది.
ఎలా మొదలైంది?
మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జెండా ఉద్యమం ప్రారంభమైనట్టు కొందరు చెప్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు కోల్పోయి ఆహారంలేక ఇబ్బందులు పడుతున్న ఎంతోమందిని స్థానికంగా ఉన్న మత్స్యకారులు గమనించారు. దీంతో వారికి సాయం చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆకలితో ఉన్న వాళ్లు ఇంటి తలుపుపై ఏదైనా సంజ్ఞను రాయాలని, ఆ ఇంటి గడపలో సాయంత్రం చేపలను ఉంచి వెళ్తామని ప్రచారం చేశారు. అయితే నిరక్షరాస్యత కారణంగా ఆ పేదలు ఇంటి తలుపు మీద రాయడానికి బదులు.. తెల్లని రుమాలును ఉంచడం మొదలెట్టారు. ఇలా జెండా ఉద్యమం తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండురాస్లో కూడా ఈ తరహా ఉద్యమాలు నడిచాయి.