శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 23, 2021 , 02:33:27

ఖైదీల పునరావాసానికి చర్యలు

ఖైదీల పునరావాసానికి చర్యలు

  • రాష్ట్ర జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌రాజీవ్‌ త్రివేది
  • జనగామలో జైళ్లశాఖ నిర్వహణలో పెట్రోల్‌ పంపు ప్రారంభోత్సవం

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీల పునరావాసానికి చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో మార్పు తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేది తెలిపారు. సోమవారం జనగామ జిల్లా యశ్వంతపూర్‌ శివారులో హన్మకొండ హైవేపై జైళ్ల శాఖ నిర్వహణలో ఏర్పాటు చేసిన మై నేషన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ (ఐవోసీ పెట్రోల్‌ పంపు)ను జైళ్ల శాఖ ఐజీ సైదయ్య, కలెక్టర్‌ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలిసీ తెలియక క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్షా కాలాన్ని అనుభవిస్తున్న వారితోపాటు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు తమ శాఖ ఉపాధి మార్గాలు చూపిస్తున్నదని తెలిపారు. ఖైదీలు విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు చేయకుండా వారికి ఉపాధి కల్పించి నెలకు రూ.15వేల వేతనాన్ని ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 ఫిల్లింగ్‌ స్టేషన్లు ప్రారంభించి, ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.  జైళ్ల శాఖ ద్వారా ఏడాదికి రూ.600కోట్ల టర్నోవర్‌తో ఫర్నిచర్‌, సబ్బులు తదితర పరిశ్రమలు, పెట్రోల్‌ పంపులు నిర్వహిస్తున్నామని, ఇందులో రూ.550కోట్ల టర్నోవర్‌ పెట్రోల్‌ పంపుల ద్వారానే వస్తుందన్నారు. కలెక్టర్‌ కే నిఖిల మాట్లాడుతూ జైళ్లశాఖ ద్వారా నిర్వహిస్తున్న పెట్రోల్‌ పంపులతో విడుదలైన ఖైదీలకు ఉపాధితోపాటు వారిలో మార్పుకు మంచి అవకాశం కలుగుతుందన్నారు. జనగామ ఫిల్లింగ్‌ స్టేషన్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిదాదలని కోరారు. ఈ కార్యమ్రంలో జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ బీ సైదయ్య, జైళ్లశాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వై రాజేశ్‌, ఐవోసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రావు, జీవీ ఆటను మండల్‌, జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, వరంగల్‌ కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ ఎన్‌ మురళీబాబు, జనగామ జైలు సూపరిం టెండెంట్‌ ఉపేందర్‌రావు పాల్గొన్నారు. 

VIDEOS

logo