శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 10, 2021 , 01:11:03

జనగామ మార్కెట్‌కు పోటెత్తిన కందులు

జనగామ మార్కెట్‌కు పోటెత్తిన కందులు

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 9 : ఓ వైపు వేరుశనగ, మరో వైపు కందులు జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వెల్లువలా వస్తున్నాయి. గత వానకాలంలో ఆలస్యంగా వర్షాలు కురవడంతో వరికి ప్రత్యామ్నాయంగా కంది, మొక్కజొన్న, వేరుశనగ పంటలను పెద్ద ఎత్తున రైతులు సాగు చేశారు. కనీస మద్దతు ధర కంటే కందులు, వేరుశనగకు ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కందులు క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.6 వేలు ఉండగా, జనగామ మార్కెట్‌ యార్డులో సోమవారం రూ.6859 పలికింది. ఒక్కరోజే 73 మంది రైతుల నుంచి 573 బస్తాలు అంటే 343.80 క్వింటాళ్లకు రూ.6859 నుంచి రూ.5279 వరకు కొనుగోలు చేశారు. వేరుశనగకు సైతం ప్రభుత్వ మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్నారు.

 మార్కెట్‌లో వేరుశనగ క్వింటాలుకు రూ.2751 నుంచి రూ.6122 వరకు ధర లభించింది. ఈ నెల 8న ఆరుగురు రైతుల నుంచి 39 బస్తాలు అంటే 11.70 క్వింటాళ్లను మద్దతు ధరకు మించి కొనుగోలు చేశారు. ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్‌లో కందులు, వేరుశనగకు అధిక ధరలు లభిస్తున్నాయి. అటు వేరుశనగ, ఇటు కందులను మార్కెటింగ్‌ జిల్లా అధికారి నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఈ-నామ్‌ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు అధిక ధరలు లభిస్తున్నాయి. 

VIDEOS

logo