సోమవారం 08 మార్చి 2021
Jangaon - Feb 02, 2021 , 00:24:33

మోగిన బడి గంట..

మోగిన బడి గంట..

  •  ప్రారంభమైన విద్యాసంస్థలు
  •  9వ తరగతి నుంచి
  •  ఆ పైన షురూ..
  • పరిశీలించిన అధికారులు

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 1 : సర్కారు ఆదేశాలకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో గత ఏడాది మార్చి 17 నుంచి అన్ని విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. వైరస్‌ తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో గత ఆగస్టు 27న పాఠశాలలను పునఃప్రారంభించి కేవలం రోజువారీగా 50 శాతం మంది ఉపాధ్యాయులు బడికి వచ్చేలా టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధన కొనసాగించారు. కొవిడ్‌-19 కారణంగా 321 రోజులపాటు మూత పడిన పాఠశాలలు, కళాశాలలు సుదీర్ఘకాలం తర్వాత సోమవారం తెరుచుకోవడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. జిల్లాలో కరోనా తీవ్రత తగ్గడంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీతో 9, 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లారు. మరోవైపు పలు పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వసతులు, కొవిడ్‌ నిబంధనల అమలును పరిశీలించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ (టీఆర్‌ఈఐ), ఎయిడెడ్‌, సోషల్‌, ట్రైబల్‌, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు మొత్తం 197 ఉన్నాయి. వీటిలో 9, ఆపై తరగతులు చదువుకునే విద్యార్థుల సంఖ్య 34,450 మంది ఉండగా, కరోనా తర్వాత తల్లిదండ్రులు అంగీకరించిన 7,074 మంది విద్యార్థులు మొదటిరోజు విద్యాసంస్థలకు వచ్చారు. 29 బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో 905 మంది, 42 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుకునే 9,477 మంది విద్యార్థులను హాస్టళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. ఒక్కో తరగతి గదిలో 20 మంది విద్యార్థులు కూర్చునేలా బెంచీలు ఏర్పాటు చేశారు. తరగతి గదులు, వరండా, బెంచీలను శానిటైజ్‌ చేసి విద్యార్థులను అనుమతించారు. విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి శానిటైజ్‌తో చేతులను శుభ్రం చేసుకున్నాక అనుమతించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచనలు చేశారు.

తెరుచుకున్న పాఠశాలలు

నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతించారు. వెల్దండలో సర్పంచ్‌ నర్ర వెంకటరమణారెడ్డి పాఠశాలను సందర్శించారు. దేవరుప్పుల మండలంలో 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు 77 శాతం మంది పాఠశాలలకు హాజరయ్యారని మండల విద్యాశాఖాధికారి అపిపడి చంద్రారెడ్డి తెలిపారు. మండలంలో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా పాఠశాల, మూడు ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మొత్తం 950 మంది విద్యార్థులున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు బెలూన్లతో స్వాగతం పలికారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని పాఠశాలలను ఎంఈవో జయసాగర్‌ పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థి అనూష మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. పాలకుర్తి, చెన్నూరు, ఈరవెన్ను పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు గంట రవీందర్‌ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేసి కరోనాపై సూచనలు చేశారు.

పాఠశాలలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌

లింగాలఘనపురం/జనగామ రూరల్‌, ఫిబ్రవరి 1 : లింగాలఘనపురంలోని కస్తూర్బా ఫాఠశాల, ప్రభు త్వ ఉన్నత పాఠశాలతోపాటు జనగామ మండలం పెంబర్తిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలను విద్యాశాఖ కమిషనర్‌ అల్లమరాజు దేవసేన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకున్నారు. దేవసేన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. జనగామ జిల్లా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో గతంలో మూడో స్థానంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఆమె వెంట ఆర్జేడీ లింగయ్య, డీఈవో యాదయ్య, కేజీబీ పాఠశాలల సెక్టోరియల్‌  ఆఫీసర్‌ సంయుక్తారాణి, ఎంఈవో అప్పిడి చంద్రారెడ్డి, కేజీబీ, మోడల్‌స్కూల్‌ ప్రత్యేకాధికారులు అన్నపూర్ణ, పుష్పకుమారి, సర్పంచ్‌ కాటం విజయకుమారస్వామి ఉన్నారు. మరోవైపు పెంబర్తి సర్పంచ్‌ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ చినబోయిన రేఖారాజు పాఠశాల సమస్యలను దేవసేనకు వివరించారు. పాఠశాల రైల్వే పట్టాలకు సమీపంలో ఉన్నందున ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాద య్య, ప్రధానోపాధ్యాయుడు అర్జున్‌ కుమార్‌, ఉపాధ్యాయులు రామరాజు, వార్డు సభ్యులు కూరోజు రాజు, మల్యాల వేదాంతాచారి, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo