కార్యకర్తలకు టీఆర్ఎస్ అండ

- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
తరిగొప్పుల(నర్మెట)/జనగామ రూరల్, జనవరి 28: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లప్పుడూ టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యూత్ మండల నాయకుడు కర్ణకంటి ప్రసాద్ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం తరిగొప్పుల మండల కేంద్రంలో ప్రియ మిల్క్ పార్లర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బొత్తలపర్రె గ్రామ శివారు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మొక్కలను సంరక్షించాలని అన్నారు. పదిశాతం గ్రామ పంచాయతీ నిధులను మొక్కల సంరక్షణకు ఖర్చు చేయవచ్చని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ దామెర ప్రభుదాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్‌రెడ్డి, ముద్దసాని వెంకట్‌రెడ్డి, జొన్నగోని సుదర్శన్‌గౌడ్, సంజీవులు, రాజారాం ఉన్నారు. జనగామ మండలంలోని వడ్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కావడంతో సర్పంచ్ బొల్లం శారదను ఎమ్మెల్యే సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారికి ఇరువైపులా రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సర్వే చేయించి రహదారికి చెందిన భూమిలో మొక్కలు నాటిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు గ్రామాల్లో మొక్కల పెంపకం పూర్తి చేసిన సర్పంచ్‌లు, అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.