శనివారం 06 మార్చి 2021
Jangaon - Jan 29, 2021 , 00:28:36

నడిరోడ్డుపై నరికేశారు

నడిరోడ్డుపై నరికేశారు

  • మాజీ కౌన్సిలర్‌ పులి స్వామి దారుణ హత్య
  • యశ్వంతపూర్‌ హైవేలో భూ వివాదమే కారణం
  • బైక్‌తో వెనుక నుంచి ఢీకొట్టి గొడ్డలితో తలపై నరికి చంపిన ఇద్దరు దుండగులు 
  • ఉలిక్కిపడ్డ జనగామ
  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

జనగామ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ పులి స్వామి గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ-హన్మకొండ హైవేపై ఆయన మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి ఢీకొట్టి గొడ్డలితో తలపై నరికి చంపారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. యశ్వంతపూర్‌ హైవే పక్కన ఉన్న సుమారు రూ.3కోట్ల విలువజేసే భూమికి సంబంధించిన వివాదమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించి, నిందితులను అరెస్టు చేశారు. 

జనగామ, జనవరి 28 (నమస్తే తెలంగాణ)  : జనగామ పట్టణంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ పులి స్వామి (53) గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ-హన్మకొండ హైవేపై మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి ఢీకొట్టి గొడ్డలితో నరికి చంపారు. పొద్దున్నే వాహనదారులు, వాకర్లు చూస్తుండగా నడిరోడ్డుపై జరిగిన హత్యతో జనగామ పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, హత్య జరిగిన రెండు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6గంటల సమయంలో హైవేపై జనగామ నుంచి యశ్వంతపూర్‌ ఎల్లమ్మగుడి వైపు వాకింగ్‌ చేస్తుండగా పల్సర్‌ బైక్‌ వచ్చిన గడ్డం నిఖిల్‌ (22), గడ్డం ప్రవీణ్‌ కుమార్‌ (19) పులి స్వామిని వెనుక నుంచి ఢీకొట్టగా కిందపడిపోయాడు. అనంతరం గొడ్డలితో మెడ వెనక భాగంలో పలుమార్లు నరకడంతో స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. గొడ్డలిని పక్కనే ఉన్న పొదల్లో పడేసి బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించగా అది మొరాయించడంతో ఘటనా స్థలంలోనే  నిందితులు వదిలేసి పరారయ్యారు. హన్మకొండ హైవేలో యశ్వంతపూర్‌ శివారులోని సర్వేనంబర్‌ 82/72లో 2 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి పట్టణంలోని భవానీనగర్‌కు చెందిన మృతుడు పులి స్వామి, ధర్మకంచకు చెందిన గడ్డం నరసింహ కుటుంబంతో 25 సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నది. భూ తగాదాలో ఇద్దరు సివిల్‌ కోర్టును ఆశ్రయించగా, కొద్ది సంవత్సరాల క్రితం నర్సింహ చనిపోయాడు. అతడి మనుమలు నిఖిల్‌ (22), గడ్డం ప్రవీణ్‌కుమార్‌ (19) ఇతర కుటుంబ సభ్యులతో వివాదం కొనసాగుతున్నది. గతంలో ఇద్దరు నిందితులు గతంలో పలుమార్లు స్వామిని చంపుతామంటూ బెదిరించారు. కాగా, భూ వివాదానికి సంబంధించి ఈనెల 27న జనగామ సివిల్‌ కోర్టులో తీర్పు పులి స్వామికి అనుకూలంగా రావడంతో నిందితులు మరింత కక్ష పెంచుకున్నారు. ఈక్రమంలో పథకం ప్రకారం స్వామి హత్య చేశారు. నిందితులు వాడిన బైక్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారిని అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గడ్డం కవిత, గడ్డం అబ్బు రాములు, గడ్డం దాసయ్య, నిఖిల్‌, ప్రవీణ్‌ ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ వినోద్‌కుమార్‌ సందర్శించి ఆధారాలను సేకరించారు. జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. మృతుడు పులి స్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ప్రాణాలు తీస్తున్న భూ వివాదాలు..

జనగామ జిల్లాలో భూ వివాదాలు నిండు ప్రాణాలను తీస్తున్నాయి. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత నలువైపులా హైవేల విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కొత్త కాలనీల ఏర్పాటుతో పట్టణం సహా చుట్టూ 15 కిలోమీటర్ల దూరం వరకు భూముల విలువ అమాంతం పెరిగింది. తెల్ల కాగితాల (సాదాబైనామాలు)పై జరిగిన లావాదేవీల్లో సగానికి పైగా వారి వారసులు, కుటుంబీకులు పూర్వీకుల పేరిట ఉన్న భూ రికార్డులను తమ పేరిట రికార్డుల్లో మార్పించుకున్నారు. ఫలితంగా గొడవలు, ఘర్షణలు జరిగి హత్యలకు దారితీస్తునాయి. ప్రెస్టన్‌ భూముల వివాదంలో ఇప్పటికే ఐదుగురు హత్యకు గురయ్యారు. భూ తగాదాల వల్ల 1994 సంవత్సరంలో లక్ష్మణ్‌, విజయపాల్‌, ప్రెస్టన్‌ భూ వివాదంలో 1999లో పట్టణానికి చెందిన ఇబ్రహీం, మాజీ నక్సలైట్‌ కల్లెం పుల్లారెడ్డి హైదరాబాద్‌లో హత్యకు గురికాగా, 2018లో ప్రెస్టన్‌ ఇనిస్టిట్యూట్‌ కరస్పాండెంట్‌ దైద క్రిష్టోఫర్‌ను ఎల్లంల సమీపంలో దారుణంగా హత్య చేశారు. 2001లో వీరమల్ల రాజేశ్వర్‌ను చీటకోడూరు సమీపంలో నరికిచంపగా, 2004లో పెంబర్తి శివారులో గుడ్ల వెంకట్‌, 2005లో నెల్లుట్ల భూ వివాదంలో తండ్రీకొడుకులు బండి శ్రీశైలం, బండి రాజు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా భూవివాదాల కారణంగా మాజీ కౌన్సిలర్‌ హతమయ్యాడు.

VIDEOS

logo