శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 17, 2021 , 01:16:15

కరోనా అంతానికి సర్కారు కృషి

కరోనా అంతానికి సర్కారు కృషి

  • వ్యాక్సిన్‌ కేంద్రంగా హైదరాబాద్‌  మండలిలో చీఫ్‌ విప్‌ బోడకుంటి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 16 : ప్రపం చాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమేసే టీకా రానున్న రెండు, మూడు నెలల్లో అందరికీ అందుతుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నిఖిలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వారు ప్రారం భిం చారు. తొలి మూడు టీకాలను దవాఖాన పారిశుధ్య సిబ్బంది నర్సింహ, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, డాక్టర్‌ విద్యావతికి వేయగా మొదటి రోజు మొత్తం 30 మంది వైద్యులు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేశారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా అంతానికి తొలి అడుగు పడిందని, ఇది దేశానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు శుభపరిణామమన్నారు. వ్యాక్సిన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ మారిందని, మన రాష్ర్టానికి, దేశానికే కాకుండా ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్‌ సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కొవిడ్‌ రోగులకు సేవలందించిన వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది సహా పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తొలి టీకాను వేయించి అరుదైన గౌరవం ఇచ్చిందన్నారు. జిల్లాలో రిజిస్టర్‌ చేసుకున్న మొత్తం 3700 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది, కరోనా వారియర్లకు టీకాలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన చెప్పారు. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకాలు వేస్తారని, ఆ తర్వాత దశల వారీగా రోజుకు 50 మంది నుంచి 100 మందికి టీకా వేసే కేంద్రాలు, వేయించుకునే వారి సంఖ్యను పెం చేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇప్పటికే జిల్లాలోని కోల్డ్‌చైన్‌ పాయింట్లకు వ్యాక్సిన్‌ చేరుకోగా, 830 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే సామర్థ్యం కలిగిన 83 వాయిల్స్‌ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముం దుచూపుతో పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు చేపట్టి పారిశుధ్య చర్యలు చేపట్టిన ఫలితంగా కరోనా వ్యాప్తి తగ్గిందన్నారు. జడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు కృషి చేశారన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముం దస్తు కార్యక్రమాలతో రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ జిల్లా ప్రధాన దవాఖాన, పాలకుర్తి హాస్పిటల్‌లో 30 మంది చొప్పున మొదటిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈనెల 18 నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖాన, ఎంసీహెచ్‌లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందన్నారు. మొదటి దశలో వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి, రెండోదశలో పారిశుధ్య, రక్షణ సిబ్బందికి, మూడో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, వ్యాధి సోకే అవకాశం ఉన్న వారికి, ఆ తర్వాత మిగిలిన ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌అబ్దుల్‌ హమీద్‌, ఏసీపీ వినోద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo