మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 07, 2021 , 04:05:56

తొలి అమరుడి ఆశయ సాకారం

తొలి అమరుడి ఆశయ సాకారం

  • ఊరిబాగు కోసం తపించిన శ్రీకాంతాచారి
  • తెలంగాణ ఉద్యమంలో ఊపిరి పణం
  • స్వరాష్ట్రంలో నెరవేరిన కల 
  • స్వగ్రామం గొల్లపల్లిలో అభివృద్ధి ఫలాలు
  • సాగునీటి కోసం చెక్‌డ్యాం నిర్మాణం
  • ఇంటింటికీ భగీరథ జలాలు
  • గ్రామం నుంచి ఆగిన వలసలు
  • నేడు గొల్లపల్లిలో చారి విగ్రహావిష్కరణ
  • డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ప్రారంభోత్సవం
  • హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

‘మన ఊరు బాగుపడాలంటే తెలంగాణ రావాలె.. మన నీళ్లు మనకు కావాలె.. భూములు పచ్చబడాలె..వలసలు ఆగాలె..’నని ఆరాట పడ్డ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి ఆశయం స్వరాష్ట్రంలో నెరవేరింది.   

ఆత్మార్పణానికి వారం ముందు తన స్వగ్రామం గొల్లపల్లిలో నానమ్మ గోవిందమ్మతో ఆవేదనతో మాట్లాడిన మాటలు, ఇప్పుడు అదే ఊరి సాక్షిగా నిజమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో బలిదానం చేసుకున్న జనగామ జిల్లా బిడ్డ శ్రీకాంతాచారి కలలు ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. అతడి అమరత్వమే ‘ప్రత్యేక’ ఉద్యమానికి మరింత ఊతమివ్వగా నేడు స్వరాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ ఆధ్వర్యాన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పల్లెపల్లెకూ చేరుతున్నాయి. శ్రీకాంతాచారి స్వగ్రామం గొల్లపల్లిలో దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతుండగా, చెరువులు మత్తళ్లు పోస్తూ బీడు భూములు సస్యశ్యామలమై వలసలు ఆగిపోయాయి. అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తయి నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ జలాలు అందుతున్నాయి. గురువారం గ్రామంలో అమరుడి విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు అంకితం చేయనున్న సందర్భంగా 

-దేవరుప్పుల, జనవరి 6

దేవరుప్పుల, జనవరి 6 : పడావుపడ్డ భూములకు తెలంగాణ వస్తేనే పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. గొల్లపల్లికి ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్‌ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న ఈ వాగుపై తెలంగాణ స్వరాష్ట్రంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ చూపి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెప్పించి 4 చెక్‌ డ్యాం మంజూరీ చేయించి పూర్తి చేయగా అవినిండి ఆరు నెలలుగా వాగు నీటి ప్రవాహంతో పారుతూ జీవనదిని తలపిస్తోంది. ఇక ఏకంగా శ్రీకాంతాచారి కలలు నిజం చేసే దిశగా గొల్లపల్లి వాగుపైనే రూ.5 కోట్లతో మరో చెక్‌డ్యాం మంజూరైంది. గ్రామంలో ఇండ్లులేని వారందరికీ డబుల్‌బెడ్‌రూంలు అందించే దిశలో 25 డబుల్‌ బెడ్‌రూంలు నిర్మించగా శ్రీకాంతాచారి కాలనీ పేర ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గ్రామంలో అనునిత్యం ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరు వస్తుంది. దేవాదుల కాలువల ద్వారా నవాబుపేట, స్టేషన్‌ఘనపురం రిజర్వాయర్‌ల నుంచి మండలంలోని 95 శాతం చెరువులు గత మూడేళ్లుగా నిండుతుండగా గొల్లపల్లి గ్రామంలోని చెరువులకు నీరు చేరే పనులు చివరి దశలో ఉన్నాయి. 

నేడు మంత్రి చేతులమీదుగా..

గొల్లపల్లిలో చారి కన్న కలలు సాకారమయే దిశలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతులమీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడే వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత గ్రామంలో నిర్మించిన 25 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు అంకితం చేస్తారు. పల్లె ప్రగతిలో గ్రామ సుందరీకరణలో భాగంగా పల్లె ప్రకృతి వనం, తడిపొడి చెత్త వేరు చేసే కేంద్రం, శ్మశానవాటిక, వన నర్సరీలు పూర్తి కాగా మంత్రి పరిశీలించనున్నారు.

గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహం


శ్రీకాంతాచారిని కన్న గొల్లపల్లి నేడు మురిసిపోతోంది. చారి తమ గ్రామానికి చెందినవాడు కావడం గర్వకారణమని గ్రామస్థులు చెప్పుకుంటారు. అందుకే గ్రామానికి ఆనుకుని వెళ్తున్న జాతీయ రహదారి పక్కన అతడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సహకారంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయగా ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. 

VIDEOS

logo