మరణంలోనూ వీడని బంధం

- భర్త మృతిని తట్టుకోలేక నాలుగు గంటల వ్యవధిలోనే భార్య మృతి
- అంత్యక్రియలు చేసిన అన్నదమ్ముల కొడుకులు
జఫర్గఢ్, జనవరి 5 :ఐదు దశాబ్దాల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు మరణంలోనూ వీడలేదు. భర్త మృతి చెందిన కొద్ది గంటల్లోనే భార్య చనిపోయిన ఘటన జఫర్గఢ్ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచోసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రొడ్డ మల్ల య్య(70), రొడ్డ ఎల్లమ్మ(65) దంపతులకు ఐదు దశాబ్దాల కింద వివాహమైంది. వీరికి సంతానం లేక పోవడంతో అన్నదమ్ముల పిల్లలనే తమ పిల్లలుగా భావిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మల్లయ్య మృతి చెందాడు. భర్త మరణంతో దిక్కుతోచని ఎల్లమ్మ ఏడుస్తూ మంగళవా రం తెల్లవారుజామున మల్లయ్య మృతదేహం పక్కనే కుప్పకూలింది. బంధువులు పరిశీలించిగా అప్పటికే మృతి చెందింది. నాలుగు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. సంతానం లేని మల్లయ్య, ఎల్లమ్మకు అన్నదమ్ముల కుమారులు అంత్యక్రియలు చేశారు.