శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 04, 2021 , 02:55:22

స్వయం ఉపాధికి సూపర్‌ మార్కెట్లు

స్వయం ఉపాధికి సూపర్‌ మార్కెట్లు

  • స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ సర్కారు ప్రణాళిక
  • జిల్లావ్యాప్తంగా 204 గ్రామాల్లో ఏర్పాటుకు ప్రత్యేక అధికారుల చర్యలు

జనగామ చౌరస్తా, జనవరి 3 : మహిళల ఆర్థికాభివృద్ధికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లా లో స్వయం సహాయక సంఘాలతో సూపర్‌ మా ర్కెట్లు నెలకొల్పడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ కే నిఖిల ప్రత్యేక చొరవతో వీటిని నెలకొల్పుతున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ప్రారంభానికి రెడీ అవుతున్నాయి. మహిళలచే, మహిళల కోసం, మహిళల ద్వారా నిర్వహించే ఈ సూపర్‌ మార్కెట్లను బైరిసన్స్‌ ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నాబార్డు సహకారంతో జిల్లాలో 204 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాలకుర్తి మండల కేంద్రంతోపాటు చెన్నూ రు, బచ్చన్నపేట మండలం కొడవటూరులో సూపర్‌మార్కెట్లు ప్రారంభించారు. మిగిలినవి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మండలాల్లో భారీ సంఖ్యలో ఏర్పాటు

జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ సంఖ్యలో సూపర్‌మార్కెట్లు ఏర్పాటు చే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మండలాల వారీగా వివరాలిలా ఉన్నా యి. జనగామ 15, కొడకండ్ల 12, దేవరుప్పుల 24, లింగాల ఘనపురం 11, పాలకుర్తి 24, రఘునాథపల్లి 28, బచ్చన్నపేట 19, జఫర్‌గఢ్‌ 14, చిల్పూర్‌ 14, తరిగొప్పుల 12, నర్మెట 15, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో 16 ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో 20 చొప్పున మొత్తం 60 ఎస్‌హెచ్‌జీ స్టోర్లు త్వరలో ప్రారంభించనున్నారు. వీటిలో కిరాణా సామగ్రి, శానిటరీ, పూజా సామగ్రి, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన కారం పొడి, పసుపు, అల్లం పేస్ట్‌, చింతపండు, పన్నీరు, చీపుర్లు, సర్ఫ్‌, పచ్చళ్లు, అరిసెలు, బోంది, పల్లిపట్టి ఇతర వస్తువులను విక్రయించనున్నారు. ఒక్కో ఎస్‌హెచ్‌జీ స్టోర్‌ను లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించనున్నారు. స్త్రీనిధి బ్యాంకు లింకేజీ వీవోల నుంచి నగదు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ నిఖిల పేర్కొన్నారు. ఇందులో రూ.50 వేలు స్టోర్‌లో వసతుల కోసం, మిగిలిన రూ.50 వేలు బైరిసన్స్‌ కంపెనీ వారికి మెటీరియల్‌ కోసం అడ్వాన్స్‌గా చెల్లించనున్నారు. బైరిసన్స్‌ కంపెనీ వారు లబ్ధిదారులకు రూ.లక్ష సామగ్రి అందజేయనున్నారు. స్టోర్ల నిర్వహణ, సరుకుల తయారీకి అవసరమైన యంత్ర సామాగ్రిని నా బార్డు ద్వారా కొనుగోలు చేస్తారు. రెండు సంవత్సరాల వరకు స్టోర్స్‌ లెక్కల నిర్వహణకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించి నాబార్డు నుంచి వేతనం చెల్లించనున్నారు. మరోవైపు సరుకుల విక్రయం కోసం ప్రతి 10 ఎస్‌హెచ్‌జీ స్టోర్లకు ఎస్‌హెచ్‌జీని నియమించనున్నారు. వీరికి రూ.8 వేలు వేతనంగా ఇస్తారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇంటింటికీ పరిచయం చే స్తూ అమ్మకాల కోసం వీరు ఆర్డర్లు తీసుకుంటారు. వీరికి వేతనం బైరిసన్స్‌ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వారు చెల్లిస్తారని అధికారులు తెలిపారు.

మహిళలకు ఆర్థికంగా భరోసా : జిల్లా కలెక్టర్‌ నిఖిల

మహిళలందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు స్వయం సహాయక సంఘాలతో మహిళా సూపర్‌ మార్కెట్లను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి బైరిసన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీతో పాటు నాబార్డు సంస్థ సహకారం అందిస్తున్నాయి. వీటి ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను నాణ్యతా ప్రమాణాలతో, తక్కువ ధరలో గ్రామీణ ప్రాంత ప్రజలకు లభిస్తాయి. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి లభించనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తి స్థ్థాయిలో ఉంది. ఈ మహిళా సూపర్‌ మార్కెట్లు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జనగామ జిల్లా ఆదర్శం కానుంది. 


VIDEOS

logo