శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 29, 2020 , 00:54:45

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు

  • గ్రామసభల్లో అధికారులు
  • పల్లెప్రగతి పనులపై సమీక్ష

స్టేషన్‌ ఘన్‌పూర్‌, డిసెంబర్‌ 28 : అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ప్రజా సమస్యలను పట్టించుకోకున్నా చర్యలు తప్పవని మండల ప్రత్యేకాధికారి భిక్షపతి అన్నారు. మండలంలోని సముద్రాలలో సర్పంచ్‌ గుండె విమల అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. పారిశుధ్యంతోపాటు తాగునీటి సమస్య నెలకొందన్నారు. దీనిపై స్పందించిన ప్రత్యేకాధికారి భిక్షపతి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మహబూబ్‌ అలీ, పీఆర్‌ ఏఈ జుమ్కిలాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రజిత, వెలుగు ఏపీఎం కవిత తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

తరిగొప్పుల(నర్మెట) : గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి అన్నారు. తరిగొప్పుల మండల కేంద్రంలో సోమవారం సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. శ్రీపతి మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, సెగ్రిగేషన్‌ షెడ్ల పనులు పూర్తయిన వరకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో మల్లయ్య, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్‌రెడ్డి, ఎంపీవో మల్లయ్య, ఏపీవో లింగయ్య, పీఆర్‌ ఏఈ ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శి రామరావు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే సర్కారు ధ్యేయం

నర్మెట : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నదని ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం సర్పంచ్‌ ఆమెడపు కమలాకర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే పల్లె ప్రకృతివనం, శ్మశానవాటికలు, రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారని గోవర్ధన్‌ వివరించారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, ప్రత్యేకాధికారి దామోదర్‌రావు, ఎంపీడీవో ఖాజా నయిమొద్దీన్‌, ఈజీఎస్‌ ఏపీవో రమాదేవి, ఎంపీవో గఫూర్‌, ఉపసర్పంచ్‌ గోపగోని శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి 

బచ్చన్నపేట : పేదలకు సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. సోమవారం మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏఈలు శ్రీనివాస్‌, అరుణారెడ్డి, ఏపీఎం జ్యోతి, ఈసీ మోహన్‌, టీఏ కరుణాకర్‌తో కూడిన బృందం గ్రామంలో పర్యటించింది. శ్మశానవాటిక, సెగ్రిగేషన్‌ షెడ్‌, నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని సందర్శించిన అనంతరం సర్పంచ్‌ గంగం సతీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎంపీడీవో మాట్లాడారు. గ్రామంలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, డ్రైనేజీ, లైటింగ్‌, తాగునీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌, కారోబార్‌ కనకయ్య, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్‌ ప్రేమలక్ష్మి పాల్గొన్నారు.

పల్లెప్రగతి పనులపై సమీక్ష

దేవరుప్పుల : మండలంలోని కామారెడ్డిగూడెంలో చేపట్టిన పల్లెప్రగతి పనులపై మండల ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ ఏపీడీ కొండల్‌రెడ్డి సమీక్షించారు. సర్పంచ్‌ బిళ్ల అంజమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్‌ షెడ్డు, శ్మశాన వాటిక, నర్సరీలపై చర్చించి పనులను పరిశీలించారు. పూర్తయిన పనులకు అందుబాటులో ఉన్న నిధులు విడుదల చేయాలని కొండల్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జాకీర్‌, ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, ఏఈ మానస, పంచాయతీ కార్యదర్శి విజయ, పాండు తదితరులు పాల్గొన్నారు.

పల్లెప్రగతిలో భ్రాగస్వాములు కావాలి

పాలకుర్తి రూరల్‌ : పల్లె ప్రగతి పనులతో పాటు గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని విష్ణుపురి లో పెండింగ్‌ పనుల బిల్లుల విడుదల కోసం ఏర్పాటు చేసిన గ్రామసభ సర్పంచ్‌ బుర్క కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులు పనుల నివేదికలను సమర్పించాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, కల్లాలు, మేకలు, గేడెల షెడ్లకు ఈజీఎస్‌ ద్వారా నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ ఎండీ నూరొద్దీన్‌, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ పాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రశాంతి, ఎంపీవో దయాకర్‌, ఏపీవో అంబాల మంజుల, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, ఉప సర్పంచ్‌ వల్లపు రవి, అల్లమనేని యాకారావు,. దుంప మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి సదానందం, ఈరెంటి నరేశ్‌, ముత్యాలు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

జనగామ రూరల్‌ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బిరుదు హిమబిందు కోరారు. సోమవారం మండలంలోని పెంబర్తిలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ గతంలో పూర్తయిన పనులకు బిల్లులు రాకుంటే వెంటనే విడుదల చేస్తామన్నారు. ఉపాధిహామీ కూలీలకు పనులు అడిగిన వెంటనే కల్పించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆమె సూచించారు. పరిసరాలను సరిశుభ్రంగా ఉంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్‌రావు, ఎంపీవో ఉప్పుగల్లు సంపత్‌ కుమార్‌, సర్పంచ్‌ అంబాల ఆంజనేయులుగౌడ్‌, ఎంపీటీసీ మూల రవిగౌడ్‌, ఉప సర్పంచ్‌ చినబోయిన రేఖరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్‌రెడ్డి, ఈసీ మాధవరెడ్డి పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

జఫర్‌గఢ్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను అన్ని గ్రామాల్లో వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీపీ రడపాక సుదర్శన్‌ అన్నారు. మండలంలోని తమ్మడపల్లి(ఐ) లో సోమవారం నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ గాదెపాక అనిత అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు నిధులు సైతం విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో, మండల స్పెషలాఫీసర్‌ రమాదేవి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జఫర్‌గఢ్‌ జీపీ పరిధి హద్దులు ఏర్పాటు చేయాలి..

మేజర్‌ గ్రామ పంచాయతీ జఫర్‌గఢ్‌ పరిధిని పెంచి, హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సర్పంచ్‌ బల్లెపు వెంకట నర్సింగరావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో లక్ష్మీ నర్సింహ మినీ రైస్‌ మిల్లు, లక్ష్మీ బాలాజీ గ్యాస్‌ ఏజెన్సీ, మోడల్‌ పాఠశాల, కస్తూర్భా పాఠశాల, వికాలాంగుల కాలనీ తదితర ప్రదేశాలు జీపీ పరిధిలోకి రావాలన్నారు. రేగడితండా సాటిలైట్‌ మ్యాప్‌లోని సర్వే నంబర్లు జీపీ రెవెన్యూలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వీరస్వామికి తీర్మాన పత్రాలను అందించి ఆమోదించాలని సర్పంచ్‌ కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నంచర్ల లత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 


VIDEOS

logo