శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 28, 2020 , 00:44:32

‘స్వచ్ఛ’త దిశగా పల్లెలు

‘స్వచ్ఛ’త దిశగా పల్లెలు

  • జోరుగా పల్లెప్రగతి పనులుతడి, పొడి చెత్త  సేకరణతో సేంద్రియ ఎరువుల తయారీ
  • పరిశుభ్రతకు గ్రామ పంచాయతీల ప్రాధాన్యం

బచ్చన్నపేట,డిసెంబర్‌ 27 : పల్లెలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడంతోపాటు పరిశుభ్రంగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా గ్రామపంచాయతీలు పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు పారిశుధ్య సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. చెత్తరహిత గ్రామాలుగా మార్చేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం స్ఫూ ర్తితో మండలంలోని 26 గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. చెత్తను తరలించేందుకు ప్రతి పంచాయతీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసింది. అందులో తడి, పొడి చెత్తను వేరు చేసి తరలిస్తున్నారు. మరోవైపు హరితహరంలో భాగంగా నాటిన మొక్కలకు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ ద్వారా నీటిని అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు.

డంపింగ్‌ యార్డులకు చెత్త తరలింపు

ఇంటింటా చెత్తను సేకరించిన పారిశుధ్య సిబ్బంది దానిని డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. అనంతరం అక్కడ తడి, పొడి చెత్త ఆధారంగా సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వీధుల్లో చెత్తా చెదారం వేస్తే జరిమానాలు విదిస్తామని గ్రామపంచాయతీ పాలకులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటి సరఫరా మెరుగుపర్చడంతోపాటు ట్యాంకుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి క్లోరినేషన్‌ చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో సైతం పంచాయతీల ఆధ్వర్యంలోనే పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వీధి దీపాల నిర్వహణను మెరుగు పరుస్తున్నారు. 

ప్రత్యేక యాప్‌ అమలు..

ప్రతి రోజూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక యాప్‌ ద్వారా గ్రామంలో చేపట్టే పనులను అందులో నమోదు చేస్తున్నారు. గ్రామంలో ఏఏ పనులు చేపట్టారు, రోడ్లపై చెత్త ఊడ్చడం, డ్రైనేజీల పరిశుభ్రం వంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పొందుపరుస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. 

నిరంతరం పర్యవేక్షణ..

పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిత్యం సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారు. హరితహారంలో భాగంగా వచ్చే జూన్‌ నుంచి మొక్కలు నాటించేందుకు నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. పల్లెప్రకృతి వనాల్లో పూలమొక్కలను నాటిస్తూ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటున్నారు. శ్మశానవాటిక నిర్మాణాల పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. ఇందుకు మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, డీపీవో, డీఎల్‌పీవో, డీఆర్‌డీవోలతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో పర్యవేక్షణ చేయిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు వీలుగా కలెక్టర్‌ నిఖిల ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేందుకు వీలుగా కలెక్టర్‌ ఆదేశాలివ్వడంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 ‘పల్లెప్రగతి’లో  రూ.2.13 కోట్లతో 104 పనులు

‘పల్లెప్రగతి’లో భాగంగా మండ లంలోని 26 గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డు లు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాల పనులు చేపట్టాం. దాదాపుగా అన్ని పూర్తికావొచ్చాయి. మూడు గ్రామా ల్లో మాత్రమే శ్మశానవాటిక పనులు ఆలస్యంగా ప్రారంభించారు. కలెక్టర్‌ నిఖిల ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రూ.2.13  104 పనులు చేపట్టగా ఇందులో 85 పనులు పూర్తయ్యాయి. సెగ్రిగేషన్‌ షెడ్లకు రూ. 52 లక్షలు, శ్మశానవాటికలకు రూ.52 లక్షలు, నర్సరీలకు రూ.20 లక్షలు, పల్లెప్రకృతి వనాలకు రూ.20 లక్షలు వెచ్చిం చాం. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

-రఘురామకృష్ణ, ఎంపీడీవో, బచ్చన్నపేట

VIDEOS

logo