శనివారం 06 మార్చి 2021
Jangaon - Dec 17, 2020 , 00:21:00

అభివృద్ధిని ఓర్వలేకే ముత్తిరెడ్డిపై ఆరోపణలు

అభివృద్ధిని ఓర్వలేకే ముత్తిరెడ్డిపై ఆరోపణలు

  • దమ్ముంటే కొమ్మూరి బహిరంగ చర్చకు రావాలి
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సవాల్‌

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 16 : కాంగ్రెస్‌ పాలనలో వెనకబాటుకు గురైన జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల లింగయ్య, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌ అన్నారు. కొమ్మూరి ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. బుధవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ తాళ్ల సురేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు అరవింద్‌రెడ్డి, సుధా సుగుణాకర్‌రాజు, వాంకుడోతు అనిత, కర్రె శ్రీనివాస్‌, మోటె లక్ష్మి శ్రీశైలం, ఎండీ సమద్‌, గుర్రం భూలక్ష్మి నాగరాజు, ఉల్లెంగుల నవ్యశ్రీ నర్సింగ్‌, పేర్ని స్వరూప, పాక రమ, కోఆప్షన్‌ సభ్యులు మసి ఉర్‌ రెహమన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రణాళిక రహితంగా చేపట్టిన కొన్ని పనుల వల్ల జనగామ జిల్లా కేంద్రం వరద ముంపునకు గురై కాలనీల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. భవిష్యత్‌లో అలాంటి విపత్తులు రాకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా అండర్‌ డ్రైనేజీ ద్వారా యశ్వంతాపూర్‌ వాగులోకి నీటిని తరలించి చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల భూగర్భజలాల పెంపుతో ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధికి అర్ధం తెలియని కొమ్మూరి రాజకీయ స్వార్ధం కోసం యశ్వంతాపూర్‌ ప్రజలకు కాలుష్యం భూతం చూపి ఇటు పట్టణం, అటు పల్లెల ప్రగతి పనులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నాడని విమర్శించారు. కొందరు కాంగ్రెస్‌ నాయకులను వెంటేసుకొని అభివృద్ధి పనుల కోసం యశ్వంతాపూర్‌ వాగు వద్ద ముత్తిరెడ్డి చేసిన ప్రజా నిరసనపై తప్పుడు ప్రచారంతో దిగజారుడు రాజకీయాలకు తెరతీసే కొత్త దుకాణం తెరిచారని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో పట్టణం, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడితే కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే చెట్లు, పుట్టలు పట్టుకొని తిరిగి కాల్వలు లేకున్నా రిజర్వాయర్ల నుంచి గోదావరి జలాలను చెరువులు, కుంటలకు మళ్లించి కరువుగడ్డను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సస్యశ్యామలం చేశారని అన్నారు. తెలంగాణ పోరాటం, జిల్లా ఉద్యమం, వరదలు వంటి ఆపద సమయంలో కంటికి కనిపించని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని చైతన్యవంతులైన జనగామ ప్రజలు తిప్పకొడతారని స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి భూములు, ఆస్తులకు పక్కాగా లెక్కలు, లీగల్‌ డాక్యుమెంట్లు ఉన్నాయి తప్ప ప్రతాప్‌రెడ్డి ఆరోపించినట్లు సెంటు భూమిని కబ్జా చేయలేదన్నారు. కొమ్మూరికి దమ్ముంటే జనగామ చౌరస్తాకు బహిరంగ చర్చకు వస్తే తెరిచిన పుస్తకం వంటి ముత్తిరెడ్డి రాజకీయ జీవితాన్ని చూపిస్తామన్నారు. భూములు లాక్కున్న కొమ్మూరి చేర్యాలలో నిర్మిస్తున్న పెట్రోల్‌పంపు సహా ఇతర బాగోతాలన్నీ బయటపెడుతామని వారు స్పష్టం చేశారు. 

ముత్తిరెడ్డి జోలికి వస్తే ఊరుకోం : పీఏసీఎస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జోలికి వస్తే ఊరుకోసం..జాగ్రత్త బిడ్డ కొమ్మూరి’ అని పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బుషిగంపల ఆంజనేయులుగౌడ్‌ హెచ్చరించారు. భూకబ్జా చేసాడంటూ చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మాజీ మంత్రి పొన్నాలతో కలిసి చేసిన దందాలను,  బయటపెడు తామని వారు హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఆగిరెడ్డి, డైరెక్టర్లు యాకస్వామి, శంకర్‌, రాజు, మహేశ్‌ ఉన్నారు.

VIDEOS

logo