ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 16, 2020 , 00:56:52

శిథిలావస్థలో కాకతీయ కళాసంపద

శిథిలావస్థలో కాకతీయ కళాసంపద

  • త్రిలింగేశ్వరాలయం చుట్టూ పెరిగిన చెట్లు
  • పునరుద్ధరించాలంటున్న స్థానికులు

బచ్చన్నపేట, డిసెంబర్‌ 15: కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన త్రిలింగేశ్వరాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొన్నేళ్లుగా ఆలయం చుట్టూ చెట్లు పెరగడంతోపాటు ధూపదీప నైవేద్యాలు కొనసాగడంలేదు. మండలంలోని కొడవటూరు శ్రీ స్వయంభూ సిద్ధేశ్వరస్వామి ఆలయ సమీపంలో త్రిలింగేశ్వరాలయం కాకతీయుల కళాసంపదకు ఆలవాలంగా ఉంది. నాడు పెద్ద రాతిబండలపై మనోహరమైన శిల్పాలు చెక్కారు. భక్తి పారవశ్యం పెంపొందించేలా నిర్మించిన ఈ ఆలయంలో కొన్నాళ్లుగా పూజలు జరగడం లేదు. సిద్ధేశ్వరుడిని దర్శించుకన్న భక్తులు త్రిలింగేశ్వరాలయానికి వచ్చేవారు. ఎంతో ప్రాధాన్యమున్న ఆలయంలోని గర్భగుడిలో వెలిసిన శివ లింగాలు భక్తులను మైమరపింప చేస్తాయి. ఆలయం ఆలనా, పాలనా చూసుకునేవారు లేకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుకుంది. సిద్ధేశ్వరాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఈ ఆలయాన్ని గతంలో స్థానికులు, పోలీసుల సహకారంతో నిర్వహించారు. కొంతకాలంగా ఇక్కడ ధూపదీప నైవైద్యాలు కొనసాగకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. ఒకప్పుడు నిత్యం భక్తుల రాకతో ఆలయం కళకళలాడేదని స్థానికులు చెబుతున్నారు. త్రిలింగేశ్వరాలయం పక్కనే ఉన్న గణపతి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని పురావస్తు శాఖతోపాటు దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.   

ఆలయ పునరుద్ధరణకు కృషి

త్రిలింగేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు కృషి చేస్తాం. ఆలయం వద్దకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో గతంలో ఉపాధిహామీ పథకంలో రోడ్డు మం జూరు చేయించాం. కాని పట్టా భూములు ఉండడంతో పనులు మధ్యలోనే నిలిచాయి. ఈ విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ నిఖిలకు త్వరలోనే వివరిస్తాం. భక్తుల కోరిక మేరకు ఆలయాన్ని పునరుద్ధరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అందరి సహకారంతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం.

-గంగం సతీశ్‌రెడ్డి, సర్పంచ్‌, కొడవటూరు


VIDEOS

logo