సోమవారం 01 మార్చి 2021
Jangaon - Dec 16, 2020 , 00:28:42

ప్రకృతిప్రసాదం నీరా

ప్రకృతిప్రసాదం నీరా

  • ప్రకృతిప్రసాదం నీరా

  • ఆరోగ్యానికి మేలు చేసే దివ్యౌషధం
  • అనేక వ్యాధులను మటుమాయం చేసే గుణం
  • పోషక విలువలు పుష్కలమని పరిశోధకులు
  • గ్రామాల్లో గీత కార్మికులకు ఉపాధి
  • ఇప్పటికే హైదరాబాద్‌లో అందుబాటులోకి నీరా స్టాల్‌
  • మండలానికొకటి ఏర్పాటుచేయాలని సర్కారుకు గౌడన్నల వినతి
తాటి, ఈత చెట్ల ప్రకృతి ప్రసాదితాలు.. వాటి నుంచి వచ్చే కల్లు, నీరా దివ్యౌషధాలు.. చెట్టు నుంచి దింపిన వెంటనే ఒక మోతాదులో తాగితే ఎన్నో రోగాలకు కొట్టుకుంటుందని పెద్దలు చెబుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ కూడా కల్లుపై అనేక పరిశోధనలు చేసింది. ఎన్నో పోషక విలువలున్నాయని తేల్చింది. దీంతోపాటు గౌడ కులస్తులకు కల్లు ఉపాధి వనరు. గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఎందరికో ఉపాధినిస్తూ, ఆరోగ్య సంరక్షణిగా గుర్తింపు పొందిన తాటి, ఈత కల్లుపై ప్రత్యేక కథనం.
- కొడకండ్ల 
తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా లభించే తాటి, ఈత కల్లుపై జాతీయ పోషకాహార సంస్థ ఎన్నో పరిశోధనలు చేసింది. అధిక పోషక విలువలున్నాయని వెల్లడించింది. తాటి కల్లులో ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయని, ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయి. కల్లులో ఉంటే మినరల్స్‌, విటమిన్స్‌ ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. తాటి, ఈత కల్లులో ఉండే ఫ్యాంటీ యాసిడ్స్‌ శరీరంలో కొవ్వు పెరుగకుండా నిరోధిస్తాయి. తాటి కల్లులో ఉండే ఫైబర్‌ షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్‌ ‘సీ’ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తాటి, ఈత కల్లుకు సంబంధించిన డాటా అంగా జాతీయ పోషకాహార సంస్థ కాంపోజిషన్‌ బుక్‌లో పొందుపరిచింది. తాటి, ఈత కల్లులో థయామిన్‌, రిబోప్లేవిన్‌, నియాసిన్‌, ఫ్యాంటాసిడ్‌ విటమిన్లతోపాటు కెరోటెనాయిడ్స్‌ కూడా పుష్కలంగా ఉన్నాయి అని పరిశోధకులు వెల్లడించారు. కల్లు అనేది మత్తు పదార్థమని అనేక దుష్ప్రచారాలు జరగడంతో ప్రజలు కొంతదూరమైనా, ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్‌ పెరుగుతున్నది. మార్కెట్‌లో లభించే ఇతర పానీయాలకన్నా కల్లు, నీరా ఎంతో మేలని అనేక పరిశోధనల్లో రుజువైంది. 
 కొడకండ్ల మండలంలోని చాలా గ్రామాల్లో కల్లు పుష్కలంగా లభిస్తున్నది. ఇక్కడి గౌడ కులస్తులకు గీత వృత్తే ఉపాధి. తాటి, ఈత చెట్లను వీరు దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు. పొద్దున్నే లేచి కుల దేవతకు మొక్కుకుని మోకు భుజాన వేసుకొని తాటి, ఈత వనాలకు బయలుదేరుతారు. ప్రతి రోజూ సూర్యాస్తమయం తర్వాత కొత్త కుండను తినే సున్నపుతేటతో శుభ్రంగా కడిగి అది ఆరిన తర్వాత సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు. సూర్యోదయం కన్నాముందే దింపి అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచి స్వచ్ఛమైన కల్లు ప్రజలకు అందిస్తున్నారు. నీరా కల్లు కొబ్బరి నీళ్లకంటే శ్రేష్ఠంగా, రుచికరంగా ఉంటుందని కల్లు ప్రియులు పేర్కొంటున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి నేరుగా సేకరించిన నీరాను ఎక్కువ రోజులు నిల్వచేసే అవకాశం ఉండదు. దీనిని శాస్త్రీయ పద్ధతిలో నిల్వచేయడానికి తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ గత రెండున్నర సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించింది. రాష్ట్రంలో తొలి నీరా కేఫ్‌ను హైదరాబాద్‌లోని నెక్ల్లెస్‌ రోడ్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని గౌడ కులస్తులు కోరుతున్నారు. 

స్వచ్ఛమైన కల్లు ఆరోగ్యానికి మంచిది

 కల్లు ప్రకృతి ప్రసాదితం. దివ్యౌషధం. మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయని డాక్టర్‌ చెప్పిన సలహా మేరకు సంవత్సరం నుంచి కల్లు తాగుతున్నాను. ఎలాంటి రోగానికైనా కల్లు కొట్టుకుంటదని డాక్టర్లు చెబుతున్నారు. కల్లు తాగినప్పటి నుంచి నా ఆరోగ్యం కూడా చాలా మంచిగున్నది. పొద్దుగాల తాగే స్వచ్ఛమైన కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. 
- కప్పల లింగయ్య, నర్సింగాపురం 


VIDEOS

logo