ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 13, 2020 , 04:45:33

ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టేలా..

ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టేలా..

  • సేద్యపు కుంటల్లో జిల్లా అగ్రగామి
  •  జిల్లాలో భూగర్భ జలాల పెంపుపై దృష్టి
  •  ఉపాధిహామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం, మొక్కల పెంపకం
  •  ఇక నీటి పరిరక్షణ పనులకు ప్రాధాన్యం

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌12: నేలపై రాలుతున్న ప్రతి వర్షపు నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఇన్నాళ్లూ సాగు సమరంలో నీటి కష్టాలను చవిచూసిన రైతన్నకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే చేపట్టిన సేద్యపు కుంటల నిర్మాణంలో జనగామ జిల్లా అగ్రగామిగా నిలిచింది. కరవుకాలంలో ఆదుకునేందుకు ఈ కుంటలు ఉపయోగపడనున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రైతుల పంటల పొలాల్లో నీటి కుంటల (ఫాంపాండ్‌) నిర్మాణ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.

రైతుల ఆసక్తిని బట్టి 2 మీటర్ల పొడువు, వెడల్పుతోపాటు 20 మీటర్ల పొడవు, వెడల్పు వరకు తవ్విస్తున్నారు. ఐదు రకాలుగా కుంటలను తవ్వుతున్నారు. గతేడాది జిల్లాలో ఫాంపాండ్‌ నిర్మాణ లక్ష్యం 2వేలు కాగా అంతకుమించి 2,900 కుంటలు పూర్తి చేయడంతో రాష్ట్రంలోనే జిల్లాకు అగ్రస్థానం దక్కింది. ఈఏడాది 3,750 సేద్యపు కుంటల నిర్మాణం పనులు చేపడితే వాటిపై చేస్తున్న ఖర్చులో కూడా జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో నిలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 55వేల 7 రన్నింగ్‌ మీటర్ల కాంటూరు కందకాలు మంజూరు కాగా 62,449 రన్నింగ్‌ మీటర్ల కందకాలు పూర్తిచేసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగామ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాకు 3,54,029 కందకాలు మంజూరు కాగా ఇప్పటికే 1,02,567 కందకాలు పూర్తి చేశారు. కందకాల వెంట హరితహారం మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా నీటి నిల్వలు పెంచేందుకు ప్రభుత్వం రూ.48.03 కోట్లు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 22,570 ఇంకుడు గుంతలు మంజూరు కాగా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో పదివేల ఇంకుడు గుంతలు నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

నీటి పరిరక్షణకు ప్రాధాన్యం..

దక్కన్‌ పీఠభూమిలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంగా ఉన్న జనగామలో వర్షాలు ఆలస్యంగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు పకడ్బందీగా అమలు కాలేదు. ప్రస్త్తుతం ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం జల సంరక్షణ చర్యలపై అవగాహనకు నడుంబిగించి సత్ఫలితాలు సాధిస్తున్నది. జిల్లాలో ‘జలనిధి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనులను వివరిస్తూ కూలీలు, ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకు అధికారుల బృందం గ్రామస్థాయికి వెళ్లింది. 

క్షేత్రస్థాయిలో ఇంకా నిర్లక్ష్యం..

జనగామ జిల్లాలో 5,66,376 మంది జనాభాతో 1,39,238 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 90శాతం వరకు కుటుంబాలకు ఇంకుడు గుంతలు నిర్మించుకునే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల్లో సేద్యపు నీటి కుంటలు నిర్మించుకోవచ్చు. జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరూ వీటిని నిర్మించుకునే వెసులుబాటు ఉపాధిహామీ పథకంలో ఉంది. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, సేద్యపు నీటికుంటల నిర్మాణాల్లో జిల్లా వెనకబడి ఉంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చేపట్టిన జలనిధి కార్యక్రమం ద్వారా అయినా ప్రజలు ఉద్యమంలా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి జలసంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

ప్రాధాన్యత అంశాలు ఇవే..

ఉపాధి కూలీలకు వందరోజుల పని కల్పించడంతోపాటు ప్రజలకు ప్రయోజనం కలిగించే పనులకు ఇందులో ప్రాధాన్యత ఇస్తారు. రైతుల వ్యవసాయ చేలల్లో, ప్రభుత్వ భూముల్లో, ఆటవీ ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. రైతులు నిర్మించాలనుకుంటే ఉపాధిహామీ సిబ్బందికి సమాచారం అందించాలి. నీటిగుంతలతోపాటు నీటి ఊటకుంటలను నిర్మించుకోవచ్చు. ఇది ఒక చిన్న చెరువులా, భూగర్భజలం పెరిగేందుకు దోహదపడుతుంది. ఇక ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు. ఇంటి వద్ద నిర్మించే వాటికి రూ.4200 చెల్లిస్తారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాలలు, కూడళ్ల వద్ద, చేతిపంపుల వద్ద సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు. చెరువులు లేని గ్రామాల్లో చిన్న చెరువులను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం రూ.20లక్షల వరకు ఉపాధి నిధులు కేటాయిస్తారు. పనులు కూలీలతో చేయించాల్సి ఉంటుంది.


VIDEOS

logo