ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 06, 2020 , 06:50:58

జీడికల్‌లో వైభవంగా శ్రీసీతారాముల రథోత్సవం

జీడికల్‌లో వైభవంగా శ్రీసీతారాముల రథోత్సవం

లింగాలఘనపురం, డిసెంబర్‌ 5 : మండలంలోని జీడికల్‌ శ్రీసీతారామ చంద్రస్వామి జాతరలో కీలక ఘట్టమైన స్వామివారి దివ్య విమాన రథోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యాహవనం, ద్వారతోరణపూజ, ఆరగింపు తీర్థగోష్టి, సాయంత్రం కొనసాగించారు. ఆలయ ప్రాంగణంలోగల దివ్యవిమాన రథాన్ని రంగురంగుల పూలతో, మామిడి తోరణాలతో, కొబ్బ రి మట్టలతో  సుందరంగా అలంకరించారు. రామ, లక్ష్మణ, సీత, హనుమంతుడి ఉత్సవ విగ్రహాలను గర్భగుడిలో నుంచి  పూజారులు మేళతాళాలతో తీసుకొచ్చి రథంపైకి చేర్చారు. ఈ సందర్భంగా అర్చకులు హోమం నిర్వహించారు. రథానికి అమర్చిన తాళ్లను భక్తులు పోటీ పడుతూ’జైబోలో రామచంద్ర మూర్త్తికీ..జై’ అని నినదిస్తూ లాగుతుండగా రథోత్సవ ఊరేగింపు మాడవీధుల గుండా అంగడి బజారుకు చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అదే దారి ఉంచి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ గర్భగుడిలోకి చేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 జీడికల్‌ ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీపీ

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మరో భద్రాదిగా గుర్తింపున్న జీడికల్‌ ఆలయ అభివృద్ధికి స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  సహకారంతో కృషి చేస్తున్నామని ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌ రెడ్డి అన్నారు. జీడికల్‌లో జరిగిన దివ్యవిమాన రథోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో అవసరమున్న చోట సీసీ రోడ్లు వేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి దయతో మండలంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో  జీవించాలని స్వామివారిని వేడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొండబోయిన కిరణ్‌కుమార్‌, సర్పంచ్‌ రాజు, ఈవో శేషుభారతి, పూజారులు గట్టు యాదగిరిస్వామి, మురళీధరాచార్యులు, వెంకటాచార్యులు, సిబ్బంది కేకే రాములు,  భరత్‌కుమార్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo