శనివారం 23 జనవరి 2021
Jangaon - Nov 29, 2020 , 03:18:13

పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌

పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌

  •  ‘పల్లె ప్రగతి’లో పారదర్శకత కోసం రూపకల్పన
  •  ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పురోగతి వివరాలు నమోదు
  •  కార్యదర్శులకు రోజు, అధికారులకు నెలవారీ కార్యాచరణ

జనగామ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేక యాప్‌ను అమలుచేస్తోంది. తద్వారా పనులు నాణ్యతతో పాటు పారదర్శకంగా జరుగనుండగా అభివృద్ధి, మౌలిక వసతుల వివరాలను ఇందులో నమోదు కానుంది.ఈమేరకు పంచాయతీ కార్యదర్శులతో పాటు ఎంపీవో, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులను ఈ యాప్‌లో భాగస్వాములను చేశారు. తద్వారా పల్లెల్లో చేపట్టిన ప్రతి పనిని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరూ ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం కల్పించింది.

యాప్‌లో అప్‌లోడ్‌

జీపీల్లో అధికారులు రోజువారీ ప్రణాళికతో ముందుకుసాగుతూ గ్రామాల్లో సమస్యలను గుర్తించి, ఆ సమస్యను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు వాటిని పరిష్కరించిన అనంతరం కూడా మరోసారి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. తద్వారా అభివృద్ధి పనుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతందనే ఆలోచనతో ప్రభుత్వం రూపొందించింది.

ప్రతి రోజు పరిశీలన

గ్రామపంచాయతీల్లో రోజువారీగా చేపట్టిన పనులను పంచాయతీ కార్యదర్శులు క్రమం తప్పకుండా అప్‌లోడ్‌ చేస్తారు. మండల స్థాయి తనిఖీ అధికారులు యాప్‌ను పరిశీలించి గ్రామాలను సందర్శించిన సమయంలో యాప్‌లో పొందుపర్చిన ఆంశాలను పరిశీలిస్తారు. మండల స్థాయిలో ఎంపీవో ప్రతి నెలా 16జీపీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 12గ్రామ పంచాయతీల పేర్లను పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ నుంచి సూచిస్తారు. మిగతా నాలుగు గ్రామ పంచాయతీలను ఎంపీవో స్వయంగా ఎంపిక చేసుకొని తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికను జిల్లా పంచాయతీ అధికారి ద్వారా జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు. 

పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు..

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ 5న పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మూడు సార్లు పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ కోఆప్షన్‌ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయడంతో ఆశించిన దానికంటే పరిసరాలు మెరుగుపడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేసింది. పారిశుధ్య కార్మికుల నియామకం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ప్రతి పల్లెలో నర్సరీలు ఏర్పాటు వంటి పనులు దాదాపు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. వీటి పనితీరులో పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిందుకు ప్రభుత్వం తెలంగాణ పల్లె ప్రగతి యాప్‌ను ఆచరణలోకి తీసుకువచ్చింది.

మరింత అభివృద్ధి కోసం..


గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి యాప్‌ను అమలుచేస్తోంది. చేపట్టే పనుల ఫొటోలను కార్యదర్శులు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దీని వల్ల పనుల్లో పారదర్శకత పెరుగుతుంది. పనులు ఎంతవరకు జరిగాయి?, నాణ్యత ఎలా ఉంది? మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఎలాంటి సూచనలు అవసరం.. వంటి అంశాలపై మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు స్పష్టత వస్తుంది. ఇలా చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి సాధించడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది.

- బిరుదు హిమబిందు, ఎంపీడీవో, జనగామ



logo