సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 27, 2020 , 01:18:25

చిట్‌ఫండ్‌ కార్యాలయం ముందు బాధితుల ఆందోళన

చిట్‌ఫండ్‌ కార్యాలయం ముందు బాధితుల ఆందోళన

జనగామ క్రైం, నవంబర్‌ 26 : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న ఓ ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కార్యాలయం ముందు గురువారం పెట్రోల్‌ సీసాతో బాధితులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రమీల, యశోద జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అంబాల నర్సింహకు ప్రతి నెల చిలుముల శ్రీహరి అనే వ్యక్తి ద్వారా చిట్టి డబ్బులు చెల్లిస్తున్నారు. చిట్టి విలువ రూ.10 లక్షలు కాగా లాక్‌డౌన్‌ సమయంలోనూ మార్కెటింగ్‌ మేనేజర్‌ నర్సింహకు చెల్లించారు. ఈ నేపథ్యంలో చిట్టి డబ్బుల కోసం జనగామ బ్రాంచికి రావడంతో తమ పేరిట చిట్టి డబ్బులు ప్రతినెలా జమ కాలేదు. దీనిపై విచారించగా డబ్బులను నర్సింహ సొంతానికి వాడుకోవడంతో ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించినట్లు చిట్‌ఫండ్‌ మేనేజర్‌ మల్లేశ్‌ చెప్పారని బాధితులు వాపోయారు. దిక్కుతోచని స్థితిలో తాము గురువారం చిట్‌ఫండ్‌ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ సీసాతో ఆందోళనకు దిగినట్లు బాధితులు పేర్కొన్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు చిట్‌ఫండ్‌ కార్యాలయానికి చేరుకొని బాధితులతోపాటు చిట్‌ఫండ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌తో మాట్లాడారు. రెండు రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై బ్రాంచ్‌ మేనేజర్‌ మల్లేశ్‌ను వివరణ కోరగా తమ చిట్‌ఫండ్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేసే అంబాల నర్సింహ తన సొంతానికి బాధితుల చిట్టి డబ్బులు వాడుకున్నట్లు తెలిపారు. దీనిపై ఎవరూ ప్రశ్నించకుండా ఓ అడ్వకేట్‌ ద్వారా ఇటీవల ఐపీ పెట్టుకున్నట్లుగా సమాచారం ఉందని మేనేజర్‌ పేర్కొన్నారు.

VIDEOS

logo