సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 12, 2020 , 02:46:04

అరగంటలో విరాసత్‌

అరగంటలో విరాసత్‌

  •  మ్యుటేషన్‌ పత్రాలతో ఇంటికి
  •  పేదింట ‘ధరణి’హాసం 

జనగామ, నమస్తే తెలంగాణ : ఇన్నాళ్లూ భూ హక్కు పత్రాలు కావాలని రైతులు కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. లంచం ఇస్తే తప్ప పని చేయని అధికారుల తీరుపై రెవెన్యూ కార్యాలయాల ఎదుట గొడవలు, ఘర్షణలు, నిరసన ప్రదర్శనలకు లెక్కలేదు. కానీ ఇవన్నీ గతం. ఇప్పుడు ఏ తహసీల్‌ కార్యాలయం చూసినా రైతులు, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సాక్షులతో సందడిగా కనిపిస్తున్నది. పైరవీల పనిలేదు.. పైసా ఇచ్చేది లేదు.. దళారుల బాధలేదు.. ఒకరోజు ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకొని మరుసటి రోజు దర్జాగా తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్లిన అరగంటలోపే విరాసత్‌, అమ్మకం, కొనుగోలు, గిఫ్ట్‌డీడ్‌(కానుక) రిజిస్ట్రేషన్‌ సహా వెంటనే మ్యుటేషన్‌ చేసి పాత పాస్‌బుక్‌ రెండోపేజీలో కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను కొత్తగా నమోదు చేస్తున్నారు. మోసం లేదు.. దగా లేదు.. దాపరికం అసలే లేదు.. క్షణాల్లోనే పూర్తి పారదర్శకంగా రైతులకు భూ యాజమాన్య హక్కులు దక్కుతున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరంగా మారి రైతులు, ప్రజల్లో సంబురం కనిపిస్తున్నది.

పానం నిమ్మలమైంది..

ఇప్పుడు నా పానం నిమ్మలమైంది.. సీఎం కేసీఆర్‌ సారు చేసిన మంచి పనితోనే ఇంత జెప్పన పనైంది. తెలంగాణ సర్కారు ధరణి తెచ్చుడు వల్లే మా లాంటి పేదోళ్ల ఇబ్బందులు తప్పినయ్‌. నేను మంగళవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న. బుధవారం 12గంటలకు తాసిల్‌ ఆఫీసుకు పోయిన. తహసీల్దార్‌ పేపర్లు చూసి సరే అన్నడు. పదిహేను నిమిషాలల్లనే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చిన్రు. అమ్మా నీకు పాత పాస్‌ పుస్తకం ఉన్నది కద..అందులో నీ పెనిమిటి పేరు తీసేసి నీ పేరు నమోదు చేస్తున్నం అని చెప్పిన్రు. పట్టా పాస్‌బుక్కు.. బదలాయింపు పత్రాలు చేతిల పెట్టిన్రు.. ఇది కలా?..నిజమా? అనుకున్న. పేపర్లు సూడంగనే ఆరు నెలలు సంది పడ్డ అరిగోస యాదికచ్చింది.. జనగామ జిల్లా కాంగనే భూముల ఇలువ పెరిగింది. అందరి కన్ను మా జగమీద పడ్డది. జాగ నా పేరుమీద అయితదో కాదోనని రంది పడేదాన్ని. యాదికస్తె రాత్రిపూట నిద్ర పట్టకపోయేది. ‘మా బాలయ్య సచ్చిపోతె రైతుబీమా కింద సర్కారోళ్లు ఐదు లచ్చలిచ్చిన్రు. వాటితోని అప్పులు కట్టుకున్న. పట్నంల కూలినాలి చేసుకొని బతుకుతున్న.. ఇగ ఇప్పుడు మరోసారి కేసీఆర్‌ పుణ్యాన పదివేల ఖర్సుతోనే భూమి నా పేరుమీదికి ఎక్కింది. ముత్తెమంత సేపట్లనే విరాసత్‌ అయిపోయి పేపర్లిచ్చుడు చూసి బీరిపోయిన. సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం.

- శివరాత్రి బుర్గమ్మ, నెల్లుట్ల

20 నిమిషాల్లో గిఫ్ట్‌డీడ్‌

బుధవారం ఉదయం 10గంటలు..జనగామ తహసీల్దార్‌ కార్యాలయానికి అధికారులు చేరుకున్నారు. 11గంటలకు పెంబర్తికి చెందిన నిమ్మతి ప్రభాకర్‌రెడ్డి..తన కూతురు నిమ్మతి రమాదేవి వచ్చారు. ఊరిలో ఉన్న రెండెకరాల 12గుంటల భూమిలో ఎకరం 30గుంటలు తన కూతురుకు గిఫ్ట్‌డీడ్‌(బహుమతి)గా ఇవ్వాలని మంగళవారం మీ సేవ కేంద్రంలో  స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చి పత్రాలను తహసీల్దార్‌ రవీందర్‌కు ఇచ్చాడు. ఆయన వాటిని పరిశీలించి ధరణి ఆపరేటర్‌కు అందించాడు. అతడు వెంటనే ప్రభాకర్‌రెడ్డి, రమాదేవితోపాటు ఇద్దరు సాక్షుల వేలి ముద్రలను బయోమెట్రిక్‌ ద్వారా తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ కూడా పూర్తయిందని చెప్పి 20 నిమిషాల తర్వాత తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రాన్ని రమాదేవి చేతిలో పెట్టారు.

ధరణి రైతులకు వరం

గతంలో యేండ్లకేండ్లు తిరిగినా పట్టించునే వాళ్లు కాదు. రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు పోతే లైన్‌లోనే గంటలకొద్ది నిలబెట్టుకునే వాళ్లు. ఇప్పుడు దళారులకు చిల్లగవ్వ ఇవ్వకుండా స్లాట్‌లో ఇచ్చిన టైం ప్రకారం వెళితే అరగంటలోపే పట్టా అయ్యింది. సీఎం కేసీఆర్‌ సార్‌ ధరణి పోర్టల్‌ పెట్టిన్రని పేపర్లలో చదవినం.టీవీల్లో వార్తలు చూసినం. ప్రత్యేక్షంగా ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్‌ రైతులకు గొప్ప మేలు చేసిండని అర్థమైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం.  

- నిమ్మతి రమాదేవి, పెంబర్తి

అలా వచ్చి.. ఇలా వెళ్లాం..

బచ్చన్నపేట : నా పేరు దేశం స్రవంతి. మాది హైదరాబాద్‌లోని మల్కాజిగిరి. ప్రైవేట్‌ జాబ్‌ చేస్తా. రిజిస్ట్రేషన్‌ కోసం నిన్న ఇక్కడికి వచ్చాం. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో తెలిసిన వారి ద్వారా వేముల సౌభాగ్యవతి దగ్గర 30గుంటల భూమి కొన్నాం. భవిష్యత్తులో వ్యవసాయం చేయించాలన్నది మా ఆలోచన. పట్టా చేయించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ధరణితో తొందర అవుతున్నయని తెలిసి నేను మా వాళ్లు ఐదుగురం కలిసి కారులో వచ్చాం. మార్నింగ్‌ మల్కాజిగిరి నుంచి 7గంటలకు బయల్దేరితే 10గంటలకు బచ్చన్నపేట చేరుకున్నాం. 10గంటల 15 నిమిషాలకు ఆఫీస్‌ వెళ్లాం. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లును కలిసి డాక్యుమెంట్లు ఇవ్వడం, ఆయన చెక్‌ చేయడం, సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకొని 15నిమిషాల్లోనే పట్టా పాస్‌బుక్‌ డ్రాఫ్ట్‌ కాపీ తీసి చేతికిచ్చారు. స్లాట్‌బుక్‌ చేసినప్పుడు కట్టిన డబ్బులే తప్ప ఎక్కడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎవరూ తీసుకోలేదు. అసలు ఇంత ఈజీగా అవుతుందనుకోలేదు. తిరిగి మధ్యాహ్నం కల్లా మేము సిటీకి బయల్దేరాం. ఒకప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం రోజంతా ఎదురుచూడాల్సి వచ్చేది. డబ్బులు ఖర్చయినా పనులు చేసేవారు కాదు. ఇంత ఫాస్ట్‌ సర్వీస్‌ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు కేసీఆర్‌ సార్‌కు మెనీ మెనీ థ్యాంక్స్‌.

- స్రవంతిగౌడ్‌, మల్కాజిగిరి

పావుగంటలో రిజిస్ట్రేషన్‌..

రేగొండ : ఇదివరకు భూముల రిజిస్టేషన్లు, పట్టా కోసం వీఆర్వోలు, బ్రోకర్ల చుట్టూ తిరిగేది. నెలలు గడిచినా పని కాకపోయేది. ఇలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగడానికే సమయమంతా గడిచేది. దీని వల్ల అటు పని, పైసలు నష్టపోయేవాళ్లం. విసుగొచ్చి చాలామంది పట్టాలు చేసుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తీసుకురావడంతో పని సులువైంది. ఎవరితో పని లేకుండా నేరుగా మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 20 గుంటల భూమి రిజిస్టేషన్‌ కోసం రూ.5181 చెల్లించి ఇద్దరు సాక్షులతో ఆఫీస్‌ వెళ్లాను. పావుగంటలలో పని అయింది. పట్టాపత్రాలు కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌కు రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు.

- పున్నం చంద్రప్రకాశ్‌, రైతు, రంగయ్యపల్లె 

బ్రోకర్ల బాధ తప్పింది..

లింగాలఘనపురం : నేను లింగాలఘనపురానికి చెందిన ఎడ్ల రామచంద్రం దగ్గర సర్వే నంబర్‌ 127/ఏ/1/4లో 16 గుంటలు, 127/డీ/3లో 24గుంటల భూమి కొనుగోలు చేశాం. అప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే జనగామ వెళ్లాల్సి వచ్చేది. భూమి వాల్యుయేషన్‌ తెలుసుకోవడం, స్టాంప్‌ డ్యూటీ కట్టడం, డాక్యుమెంట్లు ఇవ్వడం, డాక్యుమెంట్‌ రైటర్‌తో రాయించడం పెద్ద సమస్యగా ఉండేది. బ్రోకర్లేమో అవన్నీ మాకు ఇవ్వండి మేం చూసుకుంటామని సతాయించేవాళ్లు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి వల్ల ఇప్పుడు లింగాలఘనపురంలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మంగళవారం మీసేవకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేశాను. వాళ్లు ఇచ్చిన టైమ్‌ ప్రకారం బుధవారం వెళ్తే 20 నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్‌ అయింది, పాస్‌బుక్‌ ప్రొసీడింగ్‌ కాపీ చేతికొచ్చింది.

- మొనగారి ప్రావీణ్య, లింగాలఘనపురం

VIDEOS

logo