బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 07, 2020 , 04:53:31

అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి

అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి

  • ధరణి పోర్టల్‌తో సులభంగా  పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ
  • తెలంగాణ సర్కారు సరికొత్త  విధానంపై రైతుల హర్షం

తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన సరికొత్త విధానంతో భూ ముల రిజిస్ట్రేషన్‌ వేగవంతంగా జరుగుతోంది. ధరణి పోర్టల్‌ ఆధారంగా అరగంటలో భూములపై హక్కులున్న వారికి పాస్‌ బుక్స్‌ జారీ చేస్తున్నారు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ జరుగు తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జఫర్‌గఢ్‌, నవంబర్‌ 6 : సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది. శుక్రవారం స్థానిక తహసిల్‌ ఆఫీస్‌లో తహసిల్ధార్‌ వీరస్వామి  ఒకే రోజు ఐదు రిజిస్ట్రేషన్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 2 గంటల మధ్య రిజిస్ట్రేషన్‌ చేసి ఆయా గ్రామాలకు చెందిన ఐదుగురి పేర పట్టాదారు పాస్‌పుస్తకం కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వీరస్వామి మాట్లాడుతూ తమ భూముల రిజిస్ట్రేషన్‌ త్వరగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతులకు అందుబాటులోకి ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తి

దేవరుప్పుల : ఒక్కో రిజిస్ట్రేషన్‌ 15 నిమిషాల్లో పూర్తి చేసి సంబంధిత పత్రాలతో పాటు, మ్యుటేషన్‌, పట్టాదారు పాస్‌పుస్తకాలను భూములు పొందివారికి ఇస్తున్నామని తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ స్వప్న అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు 13 రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. ధరణి పోర్టల్‌తో త్వరగా రిజిస్ట్రేషన్‌ అవుతుండడంతో సంతృప్తిగా ఉన్నామని, నెలల తరబడి తిరిగినా కాని పని ఒక్క రోజులో పూర్తవుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆమె వివరించారు. 

లింగాలఘనపురంలో 5 రిజిస్ట్రేషన్లు

లింగాలఘనపురం : మండలంలోని తహసిల్‌ కార్యాలయంలో శుక్రవారం నాలుగు విక్రయ రిజిస్ట్రేషన్లు, ఒక గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నాగారానికి చెందిన సానికె సత్తమ్మ సర్వే నంబర్‌ 65లో విక్రయించగా, సౌందర్య కొనుగోలు చేశారు. మాణిక్యపురానికి చెందిన వరికొప్పుల రాములమ్మ సర్వే నంబర్లు 534, 535, 543లో 1.09 ఎకరాలు విక్రయించగా సయ్యద్‌ బషీర్‌ కొనుగోలు చేశారు. నెల్లుట్లకు చెందిన కొమ్మురాజుల వెంకటయ్య సర్వే నంబరు 40లో విక్రయించగా, కొమ్మురాజుల జయ కొనుగోలు చేశారు. నెల్లుట్లకు చెందిన కొమ్మురాజుల వెంకటయ్య సర్వే నంబరు 40లో విక్రయించగా పుష్ప కొనుగోలు చేశారు. సిరిపురానికి చెందిన సందెన భోజయ్య తన కుమారుడు రాంబాబుకు 0.19 గుంటల భూమిని గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాడు.

పాలకుర్తిలో 10 రిజిస్ట్రేషన్లు

పాలకుర్తి రూరల్‌ : మండలంలో శుక్రవారం 10 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్‌ ఎన్‌ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. గురువారం 10 స్లాట్‌ బుకింగ్‌లు కాగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌తో రైతులకు తక్కువ సమయంలో భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నదన్నారు. 

బచ్చన్నపేటలో 10 రిజిస్ట్రేషన్లు 

బచ్చన్నపేట : బచ్చన్నపేట తహసిల్‌ కార్యాలయంలో శుక్రవారం 10 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు పది మందికి చెందిన రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశామన్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే రైతులు డాక్యుమెంట్లు సరిగా తీసుకువస్తే చాలు మిగతా పని మేమే చూసుకుంటున్నామని అన్నారు.


VIDEOS

logo