భూమి భద్రం.. గుండె నిబ్బరం

మూడేళ్ల కష్టం తీరింది..
జనగామ జిల్లా లింగాల ఘనపురం వడిచర్లకు చెందిన అంబాల రాజు మూడేళ్ల సమస్యను ధరణి తీర్చింది. అంబాల కొమురయ్యకు నలుగురు కొడుకులు. వంశపారంపర్యంగా ఈ భూమి ఆయనకు వచ్చింది. ముగ్గురు కొడుకులకు, వారి వారసులకు వంతులవారీగా భూమిని పంచి ఇచ్చాడు. మరో కొడుకు సత్తయ్యకు చెందిన భూమి వివాదంలో ఉంది. దీని గురించి రాజు ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ధరణితో భూ సమస్యలు సులువుగా పరిష్కారమవు వుతున్నాయని తెలిసి బుధవారం నెల్లుట్ల మీసేవలో స్లాట్ బుక్ చేశాడు. గురువారం ఆఫీస్‌కు వెళ్లగా పత్రాలను తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించి అతడి పేర గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రాజు ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయి.
జనగామ, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన ధరణి పోర్టల్ సేవలు, దీపావళికి ముందే రై తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. తహసీల్దార్ కా ర్యాలయాలకు వచ్చిన కొద్దిసేపట్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ఆనందంగా ఇంటిదారి పడుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏ తహసీల్దార్ కార్యాలయంలో చూసినా పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు చుట్టూ రోజుల తరబడి..
వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. దూరభారంతోపాటు వ్యయ ప్రయాసలుండేవి. ఎక్కువ మండలాలతోపాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు, ఇండ్లు, ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్లు అన్నీ ఒకేచోట చేయాల్సి రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎప్పుడూ రద్దీగా కనిపించేవి. స్లాట్ బుకింగ్ చేశాక.. వెంటనే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండకపోయేది. ఒక్కోసారి వారం, పదిరోజులు, నెలలు కూడా పట్టేది. ఇక ధ్రువీకరణ పత్రాల్లో అక్ష ర దోషాలు, తప్పులు ఉంటే మరిన్ని రోజులు పట్టే ది. పత్రాలు సరిచేసుకొని వచ్చినా.. ఒకటి, రెండు రోజులు తిరిగితే గానీ రిజిస్ట్రేషన్ కాకపోయేది. డాక్యుమెంట్ రైటర్ మొదలు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది దాకా చేతి తడపనిదే ఫైలు ముట్టకపోయేవా రు. దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు డబ్బు ఖర్చు కావడంతోపాటు ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు. బస్సులు, వాహన చార్జీలు, రాత్రికి దావత్ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. డాక్యుమెంట్లు కూడా నాలుగైదు రోజుల నుంచి వారం గడిస్తే గానీ చేతికి రాకపోయేవి. ఇక మీసేవలో దరఖాస్తు చేశాక డాక్యుమెంట్లు ఇచ్చి పైసలు ముట్టజెపితే తప్ప నెల, రెండు నెలల తర్వాత మ్యుటేషన్ అయ్యేది. తర్వాత మరో నెలరోజులకు పాస్ పుస్తకం వచ్చేది.
అరగంటలోపే వారసత్వ హక్కు పత్రాలు..
జనగామ మండలం చౌడారానికి చెందిన మునిగె మల్లయ్య పేరిట 14సీ, 15సీ, 6డీ సర్వేనంబర్‌లో ఎకరా 37 గుంటల భూమి పిత్రార్జితంగా ఉన్నది. అతడి పేరిట రైతుబంధు పట్టాదారు పాస్ పుస్తకం జారీ అయింది. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్న మల్లయ్య, తన పోషణ కోసం 20 గుంటలు ఉంచుకొని మిగిలిన భూమి తన కొడుకు, ఇద్దరు మనుమల పేరిట బదలాయించాలని భావించాడు. కొన్ని నెలల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకొని ఆఫీసు చుట్టూ తిరిగాడు. పట్టా మార్పిడి, భూ బదలాయింపు కోసం సవాలక్ష కొర్రీలు పెట్టి పైసలు ఆశిస్తున్నట్లు పసిగట్టిన ఆయన, చేసేదేంలేక ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ సేవలను అమల్లోకి తేవడంతో ఈ నెల 4న మీ సేవలో స్లాట్ బుక్ చేశాడు. రిజిస్ట్రేషన్ తదితర ఫీజులన్నీ అక్కడే చెల్లించాడు. గురువారం తన కొడుకు మునిగె యాకయ్య, మనుమలు మునిగె కరుణాకర్, మునిగె యాకస్వామి, ఇద్దరు సాక్షులతో జనగామ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి కేవలం 25 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేసుకున్నాడు. కొడుకు యాకయ్య పేరిట 15 గుంటలు, ఇద్దరు మనుమలు కరుణాకర్, యాకస్వామి పేరిట చేరి 21గుంటల చొప్పున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయగా వారసులకు పట్టా చేసిన భూమికి అప్పటికప్పుడే హక్కు పత్రాలు అందాయి. పాత పాస్ పుస్తకం నుంచి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మినహాయించి మిగిలిన 20 గుంటలను ఆన్లైన్లో నమోదు చేసి పాస్ బుక్కు రెండో పేజీలో ప్రింటవుట్ తీసి తహసీల్దార్ రవీందర్ నేరుగా మల్లయ్య సహా ముగ్గురు వారసులకు హక్కు పత్రాలు అందించారు. వయోభారంతో ఉన్న మల్లయ్యను కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు, టీ అందించి కార్యాలయ సిబ్బంది సపర్యలు చేశారు.
మొన్నటిదాకా కాళ్లరిగేలా తిరిగినా..
తాతముత్తాతల నుంచి సాగులో ఉండి, కంటిముందు కనిపించే తన భూమికి హక్కు పత్రాల కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకున్న నాథుడు లేడు. విసిగివేసారి చేయి తడిపితే తప్ప ఫైలు కదపని దుస్థితి ఉండేది. మళ్లీ హక్కు పత్రం కోసం కొర్రీలతో అధికారులు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే వారు. భూమి హక్కులపై సవాలక్ష సమస్యలను సాకుగా చూపి లేనిపోని భయాలు కల్పించి రైతుల నుంచి లంచాలు వసూలు చేసేవారు. మ్యుటేషన్ చేయాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలన్నా రైతుకు అధికారులకు మధ్య దళారులు ఎకరానికి ఇంత అని వేలల్లో బేరం మాట్లాడి పనిచేసేవారు. ఇక విలువైన భూములకు మాత్రం లక్షల్లో చేతులు మారిన వ్యవహారాలు ఎన్నో వెలుగుచూశాయి.
అవినీతికి అడ్డుకట్ట..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమైన ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా, వేగంగా పూర్తవుతుండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులకు తావులేకుండా అవినీతికి అడ్డుకట్ట వేస్తూ పూర్తి పారదర్శక విధానంలో కార్యాలయానికి వచ్చిన కేవలం అరగంట వ్యవధిలోనే పట్టా కాగితం చేతికి అందుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి కుటుంబ సభ్యులు, సాక్షులతో వచ్చిన 20 నిమిషాల్లోనే ఫొటోలు, వేలిముద్రలు, సంతకాలు తీసుకొని గంట వ్యవధిలోనే పాస్ పుస్తకంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్, కొనుగోలు చేసిన వారి పేరిట వివరాలు నమోదవుతున్నాయి. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు త్వరగా జరగడం సహా గంటలోగా ప్రక్రియ పూర్తవుతుండడంతో మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోతున్నదని రైతులు ఆనందపడుతున్నారు.
రూ.200తో స్లాట్ బుకింగ్..
ఐటీశాఖ ఉత్తర్వుల మేరకు ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం కేవలం రూ.200 యూజర్ చార్జీలు చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చెల్లించి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యూజర్ చార్జీ కింద రూ.200 చెల్లించడం సహా స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం 10పేజీల ప్రింట్లకు ఇదే ధర వర్తిస్తుంది. 10పేజీలు దాటితే ప్రతి పేజీకి రూ.5 అదనంగా చెల్లించాలి.
ఎకరానికి రూ.2,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత పోస్టల్ లేదా కొరియర్ ద్వారా పాసుబుక్ నేరుగా కొనుగోలు చేసిన వారి ఇంటికే వచ్చేందుకు రూ.300 చెల్లించాలి. రైతుల కష్టాలు దూరం చేసేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం కనిపిస్తుండడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మీ సేవ కేంద్రాల్లో రైతుల నుంచి అధిక ఫీజు వసూలు చేయకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం సహా స్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ రసీదులు ఇస్తున్నారు.
రైతులకు భరోసా..
భూముల అమ్మకాలు, కొనుగోలు, ఆస్తుల బదలాయింపు, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రజల స్థిరాస్తులకు మరింత భద్రత కల్పించడం సహా జవాబుదారీతనాన్ని పెంచేలా ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ రైతుల్లో భరోసా నింపింది. ముందురోజు స్లాట్ బుక్ చేసుకుని తర్వాతి రోజు వస్తున్న రైతులు, వారి కుటుంబ సభ్యులతో తహసీల్దార్ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బదలాయింపు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర(కమర్షియల్) భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవుతుండడంతో ప్రక్రియ చాలా సులభమైంది. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల తర్వాత మ్యుటేషన్(ఆస్తుల బదలాయింపు) అధికారాన్ని ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించడంతో ఇక తమకు తిరుగుడు తిప్పలు తప్పినట్లేనని రైతులు సంబురపడుతున్నారు. క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చిన్న తప్పిదం దొర్లినా దొరికిపోయేలా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
చేతిలో పట్టాతో.. గంటలో ఇంటికి..
సమయం 1.25 గంటలు..జనగామ తహసీల్దార్ కార్యాలయం. తహసీల్దార్ సహా కంప్యూటర్ ఆపరేటర్, మరో సిబ్బంది ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అప్పుడే జనగామ మండలం గోపరాజుపల్లికి చెందిన లింగాల నారాయణరెడ్డి ఆయన ఇద్దరు కొడుకులు రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి లోపలికి వచ్చారు. అప్పటికే ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండడంతో సమయం వచ్చే దాకా వేచి ఉండాలని కార్యాలయ ఉద్యోగులు కూర్చీలు చూపించారు. కొద్ది నిమిషాల తర్వాత సిబ్బంది అమ్మకం, కొనుగోలుదారుల ఆధార్, పాన్‌కార్డులు, పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను తీసుకొని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లో నమోదు చేసిన వివరాలను తహసీల్దార్ రవీందర్ మరోసారి సరిచేసి భూమి అమ్మకం, కొనుగోలు (గిఫ్ట్‌డీడ్) విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి వివాదాలు గానీ, బెదిరింపులు గానీ ఉన్నాయా? ఇద్దరికీ ఇష్టముండే లావాదేవీలు చేస్తున్నారా? అని అడిగారు. దీంతో వారు ‘మా ఇష్ట ప్రకారమే చేస్తున్నాం’ అని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి నారాయణరెడ్డి పేరిట ఉన్న 4.17ఎకరాల భూమిలో 17గుంటలు తన పేరిట ఉంచుకొని మిగిలిన భూమిని ఇద్దరు కొడుకుల పేరిట సమానంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు బుధవారం మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.45 గంటల వరకు కొనుగోలు, అమ్మకందారుతో పాటు సాక్షుల ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలు పరిశీలించారు. ఒకరి వెంట ఒకరివి ఐరిష్, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. సరిగ్గా 1.55 గంటలకే రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ పూర్తయింది. 2గంటలకు తండ్రీ, ఇద్దరు కొడుకులకు తహసీల్దార్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాపీలు అందించారు. వచ్చిన అరగంట వ్యవధిలోనే లింగాల నారాయణరెడ్డి, ఇద్దరు కొడుకులు కార్యాలయం నుంచి సంతోషంగా బయటకు వచ్చి గంటలోనే ఇంటికి చేరారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..