మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Nov 03, 2020 , 02:12:34

మల్లన్నా..ఖబర్ధార్‌

మల్లన్నా..ఖబర్ధార్‌

జనగామ, నవంబర్‌ 2 : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడి సాధించిన కుటుంబం నుంచి వచ్చిన తెలంగాణ ఆడ బిడ్డ కల్వకుంట్ల కవితక్కను విమర్శించే స్థాయి, అర్హత తీన్మార్‌ మల్లన్నకు లేదని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకుంటే ఊరుకునేది లేదని, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పాదయాత్రలో భాగంగా జనగామలో కవితక్కపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాగృతి శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌ సభ్యురాలిగా తెలంగాణ సాధన కోసం తనవంతు పోరాటం చేసిన ఆడబిడ్డను గౌరవించాల్సింది పోయి తప్పుడు మాటలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రచారంలో భాగంగా మల్లన్న చేసిన  వ్యాఖ్య లు నిజామాబాద్‌ జిల్లా సహా తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీగా ఎన్నికవుతానని పగటి కలలు కంటున్న మల్లన్న కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేవని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాలే తప్ప తెలంగాణ ఆడబిడ్డపై తప్పుడు ప్రచారం చేసి గెలవాలని చూడటం అనైతిక చర్యగా ఆయన పేర్కొన్నారు. కవితక్క కోరుకుంటే నామినేట్‌ పదవి వచ్చేది, కానీ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏమిటో చూపాలని  ఎదురు చూశారన్నారు.   కవితక్కకు మంత్రి పదవి కోసం మరో మంత్రిని బలి చేయబోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లన్న  మాటలను జిల్లా ప్రజలు, మేధావులు, పట్టభద్రులు నమ్మరని అన్నారు. అద్దెకు తెచ్చుకున్న జనంతో జై కొట్టించుకుంటూ సొంత డప్పు వాయించుకుంటున్న మల్లన్నకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కదని జోస్యం చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడిన మల్లన్న కవితకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో జాగృతి శ్రేణులు, తెలంగాణ మహిళల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

VIDEOS

logo