బుధవారం 03 మార్చి 2021
Jangaon - Nov 03, 2020 , 02:12:36

పల్లెపల్లెనా ‘ధరణి’ సందడి

పల్లెపల్లెనా ‘ధరణి’ సందడి

జనగామ, నవంబర్‌ 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం 12 మండలాల్లో మొత్తం 15 మంది రైతులు తమ భూములకు సంబంధించి ధరణి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోగా ఒకటి రెండు మండలాల్లో సర్వర్‌, స్కానర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా అధికారులు సరిచేసి కొంత ఆలస్యంగా తొలిరోజు మొత్తం 15 దరఖాస్తులకు సంబంధించిన ఆస్తులకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో-1, జఫర్‌గడ్‌లో-1, పాలకుర్తిలో-3, చిల్పూర్‌లో-2, కొడకండ్లలో-2, జనగామలో-1, తరిగొప్పులలో -1, బచ్చన్నపేటలో-1, లింగాలఘనపురంలో-1, రఘునాథపల్లిలో-1, దేవరుప్పులలో-1 రిజిస్ట్రేషన్‌ జరిగింది. కాగా, నర్మెటలో మాత్రం ఒక్కరు కూడా ధరణి కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోలేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

రైతులకు భరోసా..

భూముల అమ్మకాలు, కొనుగోలు, ఆస్తుల బదలాయింపు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రజల స్థిరాస్తులకు మరింత భద్రత కల్పించడంతో పాటు జవాబుదారీ తనాన్ని పెంచేలా ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్‌ రైతుల్లో భరోసా నింపింది. ముందురోజు స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులు వారి కుటుం బాలతో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాలకు రావడంతో సందడిగా మారాయి. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బదలాయింపు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి  వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిర్వహించేవారు. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూముల  క్రయ, విక్రయాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత తహసీల్దార్‌ కార్యాలయాల్లో,  వ్యవసాయేతర (కమర్షియల్‌) భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగేలా మార్పులు చేసిం ది. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల అనంతరం మ్యుటేషన్‌ (ఆస్తుల బదలాయింపు) అధికారాన్ని ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించడంతో ఇక తిరుగుడు తిప్పలు తప్పినట్లేనని రైతులు సంబురపడుతున్నారు. క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో చిన్న తప్పిదం దొర్లినా దొరికిపోయేలా అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

VIDEOS

logo