శనివారం 05 డిసెంబర్ 2020
Jangaon - Nov 01, 2020 , 04:50:21

కాకతీయులను మించిన రాజు కేసీఆర్‌

కాకతీయులను మించిన రాజు కేసీఆర్‌

  • కరువు సీమను సస్యశ్యామలం చేసిండు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, నమస్తేతెలంగాణ : నాడు కాకతీయులు చెరువులు నిర్మిస్తే గత పాలకుల నిరక్ష్యానికి గురయ్యాయని, మిషన్‌ కాకతీయ ద్వారా వాటిని బాగు చేయించి ప్రతి ఎకరానికి గోదావరి జలాలను అందిస్తున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కొడకండ్లలో జరిగిన సీఎం కేసీఆర్‌ రైతు వేదిక సభకు మంత్రి అధ్యక్షత వహించి, మాట్లాడారు. సాగుకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌తోపాటు రెండు పంటలకు ఎకరానికి రూ.10వేల పెట్టుబడి ఇస్తూ రైతు బీమా కల్పిస్తున్న మహానుభావుడు కేసీఆర్‌ అన్నారు. ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడకండ్ల రైతు వేదికకు శ్రీకారం చుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కరువు ప్రాంతమైన జనగామను కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసినట్లు తెలిపారు.  బోర్లలో నీళ్లుంటే కరంటు ఉండేది కాదని, కరంటు వస్తే మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతులు అరిగోస పడేదన్నారు.

కాకతీయులను మరిచిపోయేలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న కేసీఆర్‌కు రైతులు అండగా నిలువాలన్నారు. కేంద్రం ఎన్ని దొంగబిల్లులు తెచ్చి నష్టం కలిగించినా కేసీఆర్‌ ప్రాణం ఉన్నంత వరకు రైతులపై ఈగ వాలనివ్వరని స్పష్టం చేశారు. ఇప్పటికే మక్కజొన్నలకు రూ.1800, ధాన్యానికి రూ.1800కు పైగా ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. ‘ప్రతి రైతు తమ గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి. కేసీఆర్‌ పాలన వచ్చిన తర్వాత రైతు తల రాత మారిందా? లేదా?’ అని ప్రశ్నించారు. రైతును రాజుగా చూడాలన్న ఏకైక సంకల్పంతో మూడేళ్లు, ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన దేవుడు మన కేసీఆర్‌ అన్నారు. ‘మీ దయవల్లే మంత్రిని అయ్యాను.. నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్నా.. మంత్రిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాను కూడా మీ ఆశీస్సులతో అభివృద్ధి చేసుకుంటా’ అని సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి  కృతజ్ఞతలు తెలిపారు.