ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Oct 29, 2020 , 02:03:26

కర్కోటకుడికి ఉరి

కర్కోటకుడికి ఉరి

  • తీర్పు వెలువరించిన వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు
  • 9 మందిని పొట్టనబెట్టుకున్న సంజయ్‌  
  • గొర్రెకుంట బావిలో జలసమాధి
  • పోలీసుల పక్కా దర్యాప్తు
  • లాక్‌డౌన్‌లోనూ వేగంగా విచారణ
  • ఐదు నెలల్లోనే తీర్పు వెల్లడి
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం   

ఆయుధం లేకుండా.. నెత్తురు చిందకుండా.. నిద్రమత్తులో ఉన్న తొమ్మిది మందిని జలసమాధి చేసిన కర్కోటకుడికి ఉరిశిక్ష పడింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలో మే 21న వెలుగుచూసిన హత్యాకాండపై విచారణ పూర్తి చేసిన వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు, బుధవారం తీర్పు వెలువరించింది. 67మంది సాక్షులను విచారించి బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ హంతకుడని తేల్చి శిక్ష విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘోర కలిపై ఐదునెలల్లోనే విచారణ పూర్తయి నరరూప రాక్షసుడికి శిక్ష పడడంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తమవుతున్నది.

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/గీసుగొండ:  వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలో 9మంది హత్య కేసులో విచారణ పూర్తి చేసిన అనంతరం వరంగల్‌ మొదటి అదనపు జిల్లాకోర్టు, బుధవారం తీర్పు వెలువరించింది. 67 మంది సాక్షులను విచారించి బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ హంతకుడని తేల్చి ఉరిశిక్ష విధించింది. వరంగల్‌ జిల్లా జడ్జి కే జయకుమార్‌ నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించారు. మే 21న వెలుగుచూసిన ఈ హత్యాకాండపై న్యాయస్థానం 67 మంది సాక్షులను విచారించింది. 

ఐదు నెలల్లోనే దర్యాప్తు పూర్తయి తీర్పు వెలువడింది. కరోనా లాక్‌డౌన్‌లోనూ వేగంగా తీర్పు వచ్చిన అరుదైన కేసుగా ఇది నిలిచింది. నిందితుడు నేరం చేశాడని తగిన సాక్ష్యాధారాలతో కోర్టుకు వివరించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌ రాష్ర్టానికి చెంది న నిందితుడు సంజయ్‌ కుమార్‌ ఉపాధి కోసం ఆరేళ్ల కిత్రం వరంగల్‌ వచ్చాడు. గొర్రెకుంటలోని గోనె సంచుల తయారీ కేంద్రంలో పనికి కుదిరాడు. పెళ్లికాని అతడు, అదే కేంద్రంలో పనిచేసే పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సూద్‌ అలం కుటుంబంతో పరిచయం పెంచుకున్నా డు. మక్సూ ద్‌ అలం మరదలు రఫిక భర్త చనిపోవడంతో పిల్లలతో ఇక్కడే ఉండేది. ఆమె కుమార్తెపై సంజయ్‌ కన్ను పడింది. ఇదే తొమ్మిదిమంది హత్యకు దారితీసింది. రఫికతో సంజయ్‌ సహజీవనం చేశాడు. తన కూతురి(15)తోనూ సన్నిహితంగా ఉండడాన్ని గ్రహించిన రఫిక అతడిని మందలించింది. 


ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో సంజయ్‌ ఆమె హత్య కు కుట్ర పన్నాడు. రఫికను అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి విషయం చర్చిద్దామని నమ్మించి పశ్చిమబెంగాల్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో రఫికను రైలులోనే హత్యచేసి నిడదవోలు దగ్గర శవాన్ని బయట వేశాడు. రాజమండ్రిలో రైలు దిగి తిరిగి వరంగల్‌ వచ్చా డు. రఫిక పశ్చిమబెంగాల్‌లోనే ఉందని నమ్మించాడు. ఆమె కూతురిని లొంగదీసుకున్నాడు. ఎన్నిరోజులైనా రఫిక తిరిగిరాకపోవడం, ఫోన్‌లోనూ మాట్లాడకపోవడంతో రఫిక సోదరి నిషా ఆలం సంజయ్‌ని నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో రఫికను చంపిన విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో మక్సూద్‌ కుటుంబాన్ని అంతం చేయాలని కుట్ర పన్నా డు. 

60 నిద్రమాత్రలు కొన్నాడు. మక్సూద్‌ కొడుకు పుట్టి న రోజున కుట్రను అమలు చేశాడు. మక్సూద్‌ కుటుంబంతో సన్నహితంగా ఉండి మాటల్లో దించి ఎవరూ చూడకుండా పప్పుకూరలో నిద్రమాత్రలు కలిపాడు. విషయం బయటపడకూదనే ఉద్దేశంతో మక్సూద్‌కు టుంబం పక్కనే నివాసముండే బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంకు కూడా నిద్రమాత్రలు కలిపిన కూరను వడ్డించాడు. అందరు నిద్రమత్తులో ఉన్నప్పుడు ఒక్కొక్కరినీ సంచిలో మూటకట్టి నీళ్లతో ఉన్న బావిలో పడవేశాడు. ఇలా తొమ్మి ది మందిని జలసమాధి చేసి పారిపోయాడు. అత్యంత సంచలనంగా మారిన ఈ కేసును గీసుగొండ పోలీసులు పకడ్బందీగా ఛేదించారు. గీసుగొండ సీఐ జూపల్లి శివరామయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. అన్ని కోణాల్లో విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలంతోపాటు తగిన సాక్ష్యాధారలతో 487పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేశారు. 

సంజయ్‌ చేతిలో బలైనవారు..

ఎండీ మక్సూద్‌ అలం (50), మక్సూద్‌ భార్య నిషా ఆలం(45),  మక్సూద్‌ కుమార్తె బుస్ర(20), బుస్రా కొడుకు బబ్లూ(3), షాబాద్‌ అలీ(22), సోహైల్‌ అలం(20), బీహార్‌కు చెందిన కార్మికులు శ్యాం కుమార్‌ షా(22), శ్రీరాంకుమార్‌(20), వరంగల్‌ వాసి షకీల్‌తో పాటు అంతకుముందు రఫికతో కలిపి  సంజయ్‌ చేతిలో పదిమంది బలయ్యారు.

కేసు హైలైట్స్‌..

నెల రోజుల్లోనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఐదు నెలల్లోనే తీర్పు వెలువడింది. 

లాక్‌డౌన్‌లోనూ విచారణ వేగవంతంగా జరిగింది. 

ఆర్థిక స్తోమత లేని నిందితుడి తరఫున వాదించేందుకు న్యాయసేవా సంస్థ ద్వారా సీనియర్‌  న్యాయవాది శ్రీధర్‌ నియామకం.

ప్రాసిక్యూషన్‌కు సహకరించడం కోసం రిటైర్డ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌ సర్దార్‌ నియామకం.

హిందీ తప్ప వేరే భాష తెలియని నిందితుడు సంజయ్‌కుమార్‌కు వాదోపవాదాలను తెలియజేయడం కోసం సీనియర్‌ న్యాయవాది మహమ్మద్‌ వలీయొద్దీన్‌ను కోర్టు నియమించింది.

వరుసగా 19 రోజులపాటు 67 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.

ఖైదీ నెంబర్‌ 833

వరంగల్‌ క్రైం: ఐదు నెలల నుంచి యూటీ నంబర్‌ 4414 తో జైలులో ఉంటున్న సంజయ్‌కుమార్‌కు వరంగల్‌ సెం ట్రల్‌ జైలు అధికారులు బుధవారం ఖైదీ నంబర్‌ 833ను కేటాయించినట్లు సమాచారం. హైసెక్యూరిటీ బ్యారక్‌లోని ప్రత్యేకమైన భద్రత మధ్య ఉంచినట్లు జైలు వర్గాలు పేర్కొన్నాయి. 

చాలెంజ్‌గా తీసుకున్నాం

తొమ్మిది మంది హత్య కేసును చాలెంజ్‌గా తీసుకున్నాం. హత్య జరిగిన నెల రోజుల్లోనే సాక్ష్యాలతో పాటు డాక్యుమెంట్లను, మెటీరియల్స్‌ను కోర్టుకు సమర్పించి ప్రాసిక్యూషన్‌ ప్రారంభించేలా చేశాం. సాక్షులను జడ్జి అన్ని కోణాల్లో విచారించి, డాక్యుమెంట్లు, పరిశీలించి నిందితుడికి ఉరిశిక్ష వేశారు. నేరస్తులెవరైనా వరంగల్‌ పోలీసుల నుంచి తప్పించుకోలేరు.

-శ్యాంసుందర్‌, మమునూరు ఏసీపీ

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు గొర్రెకుంట జిన్నింగ్‌ మిల్లులో పనిచేసే  9మంది కార్మికులను  హత్యచేసిన సంజయ్‌కుమార్‌కు సరైన శిక్ష పడింది. కరోనా కారణంగా విచారణ కొంత అలస్యమైనా చట్టప్రకారం కోర్టు శిక్ష విధించింది. సీపీ ఆదేశాలతో కేసులో అన్ని రకాల సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాం. 

- జూపల్లి శివరామయ్య, గీసుగొండ సీఐ 

VIDEOS

logo