బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 29, 2020 , 02:03:28

చపాట మిర్చి కేరాఫ్‌ నర్సంపేట

చపాట మిర్చి కేరాఫ్‌ నర్సంపేట

  • రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు
  • రూరల్‌జిల్లాలో 5,250 హెక్టార్లలో సాగు
  • నర్సంపేట డివిజన్‌ చపాట మిర్చికి పెట్టింది పేరు  
  • గ్రామాల్లో జోరందుకున్న సాగు పనులు

చపాట మిర్చి అనగానే అందరికీ గుర్తొచ్చేది నర్సంపేటనే. ఈ దేశవాళీ పంటను సాగుచేయడంలో ఇక్కడి రైతులు ఆరితేరారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో పండించిన మిర్చిని మహారాష్ట్ర, అహ్మదాబాద్‌, తదితర రాష్ట్రాలకే గాక వివిధ దేశాలకూ విక్రయిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ పంటకు మంచి గిట్టుబాటు ధర దక్కుతుండడంతో ఎక్కువ మంది రైతులు చపాటా వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండడంతో దిగుబడి ఎక్కువ తీస్తూ రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌లో మిర్చి రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

- నర్సంపేట రూరల్‌

చపాట మిర్చికి నర్సంపేట డివిజన్‌ కేరాఫ్‌గా మారింది. ఇక్కడ పండించే పంటకు మొదటినుంచి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గతేడాది 6453 హెక్టార్లలో సాగుకాగా ఈసారి పెరిగే అవకాశముంది. చపాటా మిర్చిని మహారాష్ట్ర, ముంబై, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, జలగాం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. అంతేగాక ఈ మిర్చికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర పలుకుతుంది. ఫలితంగా ఎంతోమంది రైతులు ఆర్థికంగా ఎదిగినవారూ ఉన్నారు. ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండడంలో ఆశించిన దిగుబడి వస్తుండడంతో ఎక్కువ మంది రైతులు గంపెడాశతో మిర్చి సాగు చేస్తున్నారు.

రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు..

నర్సంపేటలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. డివిజన్‌లోని నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోనే పెద్ద మొత్తంలో సాగవుతున్నందున వరంగల్‌ రూరల్‌ జిల్లాలోనే రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఇందుకుగాను అశోక్‌నగర్‌తో పాటు అనుకూలమైన ప్రభుత్వ భూములు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని గతేడాది ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత రెండు సార్లు ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించే రీసెర్చ్‌ సెంటర్‌ను నర్సంపేటలోనే నెలకొల్పేలా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే సైతం పలుమార్లు స్థల పరిశీలన చేసి ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. పరిశోధన కేంద్రం ఏర్పాటైతే ఈ ప్రాంత రైతులకు మరింత మేలు జరుగనుంది. 

జోరందుకున్న మిర్చి సాగు..

జిల్లాలోని చాలా గ్రామాల్లో మిర్చి సాగు జోరందుకుంది. ఈ వానకాలం సీజన్‌లో చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరుచేరడంతో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట డివిజన్‌వ్యాప్తంగా నారు విత్తే పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. జిల్లాలో  సాధారణ సాగు విస్తీర్ణం 5,250 హెక్టార్లు కాగా గతేడాది 6,453 హెక్టార్లలో పంట వేశారు. కేవలం నర్సంపేట డివిజన్‌లోనే గతేడాది అత్యధికంగా 2800 హెక్టార్లలో సాగుకాగా ఈసారి మరింత పెరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

మొదట పల్లి, తర్వాత మిర్చి..

ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు మిర్చిని రెండో పంటగా వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తొలుత తొలకరి వానలు మొదలయ్యే జూన్‌ నెలలో వేరుశనగ, మక్కజొన్న వేస్తారు. ఆ పంటలు చేతికొచ్చిన తర్వాత మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా మరో పంటకు అవసరమయ్యే పెట్టుబడికి వినియోగిస్తారు. ఇందుకోసం నెల రోజుల ముందునుంచే మిరుప నారు సిద్ధంచేసుకొని ఏపుగా పెరిగిన తర్వాత భూముల్లో విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇలా కొన్నేళ్ల నుంచి మిర్చి వేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

ఉత్సాహంగా సాగు..

నర్సంపేట మండలం దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, మాధన్నపేట, నాగుర్లపల్లి, ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, లక్నెపల్లి, మహేశ్వరం, భోజ్యనాయక్‌తండా, చక్రంతండా, గురిజాల, ముగ్ధుంపురం, రాజపల్లి, చిన్న గురిజాల, గుర్రాలగండిరాజపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా మిర్చి వేశారు. గత అనుభవాలను, లక్ష్యాలను దృష్ట్యా ఈసారి మండలంలో 2,600 ఎకరాలకు పైగా సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటి ఆశలతో సాగుకు శ్రీకారం చుడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని పలువురు కోరుతున్నారు.

పదేండ్ల నుంచి వేస్తున్నా..

నేను పదేండ్ల నుంచి చపాటా మిర్చి సాగుచేస్తున్నా. అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి కోసం డ్రిప్‌ ఉపయోగిస్తున్నా. ఉద్యానవన శాఖాధికారులు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. మిర్చి పంటపైనే ఆధారపడి ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. మిర్చి సాగుకు ఈ ప్రాంత నేలలు చాలా అనుకూలం.

- భూక్యా వీరన్న, రైతు నర్సింగాపురం

పెట్టుబడికి ఇబ్బంది లేకుండా..

వేరుశనగ సాగు చేయగా వచ్చిన ఆదాయంతో మిర్చి పంట వేశాను. ఏళ్ల తరబడి ఈ విధానాన్నే కొనసాగించడం వల్ల ఆర్థికంగా మేలవుతోంది. ప్రతి సంవత్సరం మొదట వేరుశనగ, ఆ తర్వాత వాణిజ్య పంట అయిన మిర్చి సాగు చేస్తున్నాం. దీని వల్ల పెట్టుబడి కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం లేదు.

- సంకటి గణపతిరెడ్డి, రైతు, దాసరిపల్లి  

VIDEOS

logo