ఆదివారం 29 నవంబర్ 2020
Jangaon - Oct 28, 2020 , 02:24:38

రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి

రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి

  • పాలకుర్తి సీఐ బానోత్‌ రమేశ్‌నాయక్‌
  • పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో  
  • పలు గ్రామాల యువకుల రక్తదానం 

పాలకుర్తి రూరల్‌, అక్టోబర్‌ 27 : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పాలకుర్తి సీఐ బానోత్‌ రమేశ్‌నాయక్‌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వర్థన్నపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎస్సై గండ్రాతి సతీశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇతరులకు సాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో యువత ముందుండాలని కోరారు. ఇదిలా ఉండగా రక్తదాన శిబిరానికి పాలకుర్తి మండలం నుంచి పెద్ద సంఖ్యలో యువకులకు తరలించినందుకు సీఐ బానోత్‌ రమేశ్‌ నాయక్‌, ఎస్సై గండ్రాతి సతీశ్‌ను వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌ అభినందించారు.

దేవరుప్పుల యువకుల రక్తదానం

దేవరుప్పుల : వర్ధన్నపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మండలం నుంచి పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఎస్సై చెన్నమనేని కరుణాకర్‌రావు నేతృత్వంలో కడవెండి, దేవరుప్పల, చినమడూరుకు చెందిన ఆటో డ్రైవర్లు, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు, పలు యువజన సంఘాల సభ్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్‌ రక్తదాన సర్టిఫికెట్లు అందజేసి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రమేశ్‌, సంపత్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాతలకు 

ఏసీపీ రమేశ్‌ అభినందన

జఫర్‌గఢ్‌ : మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు వర్ధన్నపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొనడంతో ఏసీపీ రమేశ్‌ అభినందించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి ఆయన సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్‌, ఎస్సై కిషోర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ఇల్లందుల శ్రీనివాస్‌, గాదెపాక అయోధ్య, టీఆర్‌ఎస్‌ యూత్‌ బాధ్యులు తాటికాయల చేతన్‌, పెంతల రాజ్‌ కుమార్‌, నాగరాజు, మల్లేశ్‌, అశోక్‌, మహేందర్‌, అఖిల్‌, ఉప్పుగల్లు ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు సునిల్‌, రవీందర్‌, నవీన్‌, ప్రవీణ్‌, ప్రదీప్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.