గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 21, 2020 , 02:00:26

తొమ్మిదొద్దుల బతుకమ్మ ఆ ఊరికి అరిష్టమట!

తొమ్మిదొద్దుల బతుకమ్మ ఆ ఊరికి అరిష్టమట!

  • పెదమడూరులో ఏడో రోజే సద్దులు 
  • దశాబ్దాల క్రితం పెద్ద బతుకమ్మ రోజు ఊరు కాలిపోవడమే కారణం
  • ఇక్కడి ఆడబిడ్డలకు రెండు రోజులు సంబురాలు

సాధారణంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మను తొమ్మిదో రోజున జరుపుకోవడం ఆనవాయితీ.. కానీ ఈ ఊరిలో మాత్రం ఏడో రోజే పెద్ద బతుకమ్మ సంబురాలు చేసుకుంటారు. తొమ్మిదో రోజున సద్దులు నిర్వహిస్తే ఇక్కడ అరిష్టమట..! ఆ కథేంటో చదవండి మరి..

దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో దశాబ్దాల క్రితం తొమ్మిదో రోజున ఊరివారంతా సద్దుల బతుకమ్మ సంబురాల్లో మునిగిపోయారు. ఊరంతా తగలబడింది. ఆ సమయంలో లేవలేని పరిస్థితుల్లో మంచాలపై ఉన్న వృద్ధులు, కోళ్లు, గొర్లు, పాడి పశువులు, ఇండ్లలో సామగ్రి, డబ్బు, ధాన్యం, ఇలా ఒక్కటేమిటి సర్వస్వం కాలిబూడిదైంది. కిలోమీటరు దూరాన ఉన్న వాగులో బతుకమ్మ ఆడి ఇంటికి వస్తున్న తరుణంలో అందరికీ ఊరు తగలబడిపోతూ కనిపించింది. వేల మంది ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి. దీంతో అప్పటినుంచి ఆ గ్రామస్తులు తొమ్మిదో రోజు సద్దులంటే అరిష్టంగా భావిస్తున్నారు.

వందల ఏళ్లుగా ఏడో రోజే.. 

ఊరు తగలబడిపోవడంతో తొమ్మిదో రోజు సద్దులను అరిష్టంగా భావించిన గ్రామస్తులు ఏడో రోజే పెద్ద బతుకమ్మ జరుపుకోవాలని తీర్మానించారు. అప్పటినుంచి వందల ఏళ్లుగా ఏడో రోజే సద్దులు ఆడుతూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆనవాయితీ ప్రకారం తిరిగి తొమ్మిదో రోజునే నిర్వహించుకోవాలనే వాదన వినిపించినా ఎవరూ ఏకీభవించలేదు. పెత్రమాస, దసరాను అందరిలానే జరుపుకొంటున్నా.. సద్దులను మాత్రం ఏడో రోజునే నిర్వహించుకుంటున్నారు. 

రెండు సద్దులు మాకే సొంతం

సద్దుల బతుకమ్మ సంబురా లను రెండు రోజులు ఆడుకునే అవకాశం మా ఊరి ఆడోళ్లకే సొంతం. ఏడో రోజున నేను ఇక్కడ మా అత్తగారింట్లో సద్దు లు అయ్యాక, తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మ కోసం మా తల్లిగారింటికి పోత. ఇటు అత్తగారు, అటు తల్లిగారింట్లో పిల్లా పాపలతో బతుక మ్మ ఆడడం చాలా సంతోషంగ అనిపిస్తది.  

 - ముత్యాల నవ్య, పెదమడూరు 

ప్రత్యేక అనుభూతి

నాడు ఏం జరిగిందో గానీ, పెదమడూరులో ఏడు రోజులకే సద్దులు ఆడుతరు. పండుగ వస్తున్నదంటే రెండు, మూడు రోజుల ముందే నేను మా అత్తగారింటి నుంచి తల్లి గారి ఊరైన పెదమడూరుకు వస్త. ఇక్కడ సద్దులు ఆడుకుని తొమ్మిదో రోజు పండుగ కోసం మా అత్తగారింటికి పోత. ఏడాదికి రెండు సార్లు పెద్ద బతుకమ్మ ఆడుకోవడం ప్రత్యేక అనుభూతినిస్తుంది.  

- మడూరు మౌనిక

తాత ముత్తాల నుంచి ఇదే సంప్రదాయం

తాతముత్తాతల నుంచి మా ఊర్లో ఇదే సంప్రదాయం పాటిస్తున్నం. ఏడో రోజే సద్దుల పండుగ రావడంతో ఊరిలో ముందుగానే పండుగ వాతావరణం కనిపిస్తుంది. సద్దుల కోసం పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మా తాతను అడిగినా ఊరు కాలిన ముచ్చటే చెప్పిండు. ఎన్నడు జరిగిందో తెల్వదుగానీ అరిష్టమన్న సెంటిమెంట్‌ గ్రామంలో బలంగా ఉంది.  

-ఆకవరం జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, పెదమడూరు 

వినుడేగానీ, చూసినోళ్లు లేరు

సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఊరంతా కాలిందని, తొమ్మిదో రోజు సద్దులు అరిష్టమని ఎనుకటినుంచి అంటరు. అన్నది వినుడే గానీ చూసి నోళ్లు ఇప్పుడు ఎవ్వరూ లేరు. వందల ఏండ్లు దాటినా అదే సంప్రదాయం కొనసాగుతుంది. సోమిరెడ్డి సర్పంచ్‌ ఉన్న జమానాలో మార్వాలని చూసినా సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నం చేసిన సర్పంచ్‌ పదవీ కాలంలోనే చనిపోయిండు. గ్రామంల సెంటిమెంటు బలంగ ఉన్నది. ఇక ఎప్పటికీ ఇదే పద్ధతి పాటిస్తం. 

-మామిండ్ల చిన సోమయ్య, పెదమడూరు

VIDEOS

logo