భారీ వానలతో కుదేలైన రైతులు

- దెబ్బతిన్న పంటలు
- బురదమయంగా మారిన కాలనీలు
- కూలిన ఖిలాషాపురం కోట బురుజు
జనగామ, అక్టోబర్ 15 : ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసిన రైతులపై ప్రకృతి కన్నెర్రజేసింది. చేతికొస్తున్న పంటలు కళ్ల ముందే నీటి పాలవ్వగా.. పొట్టదశలో ఉన్న వరి నీట వాలింది. పత్తి చెట్టుపైనే నీరుగారిపోయింది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దాదాపు జిల్లా అంతటా అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. కరువు గడ్డగా పేరొందిన జనగామ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ వానాకాలంలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరిగాయని సంబరపడితే అకాల వర్షాలు సాగురంగాన్ని అతలాకుతలం చేసింది. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి వ్యవసాయశాఖ అంచనాలకు మించి పంటలు సాగవ్వగా మంచి దిగుబడులు వస్తాయని కలలుగన్న రైతుల ఆశలను వర్షాలు కల్లలు చేశాయి. జూన్ మొదటి నంచి సాధారణానికి వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలు ఎగువు ప్రాంత రైతులు పంటలు సాగు చేసేందుకు ఎంతో దోహదపడ్డాయి. జిల్లాలో సన్న, దొడ్డురకం వరిధాన్యం సహా పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర్లు, కంది వంటి పంటలు సుమారు 3.65లక్షల ఎకరాల్లో సాగుచేయగా దొడ్డు రకం వరిపంటలు కోత దశకు వచ్చాయి. సన్న రకం మరికొద్ది రోజుల్లో చేతికి రానుండగా పంట నేలకొరిగింది. ఇటీవల మూడురోజులు కురిసిన వర్షాలతో అన్ని పంటలు కలుపుకొని 39,240 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అందులో వరి 10,595 ఎకరాలు, పత్తి 20,185 ఎకరాలు, కంది 1,010 ఎకరాలు, ఇతర పంటలు 7,450 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. భారీ వర్షాలకు పలుచోట్ల పూరిల్లు కూలిపోయాయి. గురువారం రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం సర్వాయిపాపన్న కోట బురుజు కొంత భాగం కూలి పక్కనే ఉన్న ఇళ్లపై పడింది. బురుజు గోడ బీటలు వారినట్లు గుర్తించిన గ్రామస్తులు సమీప ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం వాటిల్లలేది.
జిల్లా కేంద్రంలో తగ్గిన వరద ఉధృతి
వాయుగుండం ప్రభావంతో మూడురోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వానలతో జలదిగ్బంధంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరైన జనగామ పట్టణ వాసులు వర్షం తెరిపి ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని కాలనీల్లో నడుము లోతు, మరికొన్ని చోట్ల మోకాలి లోతు వరదనీటి ప్రవాహంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టని జనం గురువారం ఉపశమనం పొందారు. కుర్మవాడ, జ్యోతినగర్, బాలాజీనగర్, శ్రీనగర్‌కాలనీ, సెయింట్‌మేరీస్ స్కూల్ ప్రాంతాల్లో ఇంకా వరదనీరు పారుతుండగా వరద తగ్గిన ప్రాంతం అంతా బురదనీటితో నిండిపోయింది. రంగప్పచెరువు మత్తడి నీటి వరద తగ్గినా ఇంకా దిగువ కాలనీలకు కొనసాగుతున్నది. బురదనీటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న వడ్లకొండ, చీటకోడూరు వాగుల ఉధృతి తగ్గడంతో రాకపోకలు మొదలై జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుంది. చీటకోడూరు దేవాదుల రిజర్వాయర్ గేట్ల నుంచి వరదనీటిని కిందికి వదలుతుండగా గురువారం సాయంత్రం రెండు గేట్లను మూసివేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టం, గండిపడి కొట్టుకుపోయిన పట్టణ రోడ్లు, గ్రామాల రోడ్లు, దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
స్టేషన్ ఘన్పూర్: భారీ వర్షానికి మండలంలో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం అక్కపల్లి గూడం, సముద్రాల, చిల్పూర్ మండలం రాజవరంలో ఏడీఏ ప్రదీప్ కుమార్, ఏవో నాగరాజు, ఏఈవోలు పంట క్షేత్రాలకు వెళ్లి పంటనష్టాన్ని పరిశీలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో వరి 2267 ఎకరాల్లో, పత్తి1095 ఎకరాల్లో, చిల్పూర్ మండలంలో వరి 1908 ఎకరాలు, పత్తి 991 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని స్టేషనఘన్పూర్ మండల వ్యవసాయాధికారి ఏ.నాగరాజు తెలిపారు.
గూడల్లోనే మొలకెత్తిన పత్తి
లింగాలఘనపురం: మండలంలోని రైతులు పత్తిని వేశారు. ఈ పంట 5 నుంచి 6 దశల్లో చేతొకొస్తుంది. మొదటి, రెండో దశలో అంతగా ఉత్పత్తి లేకున్నా రైతులు 3, 4 దశల్లో లభించే పత్తి ఉత్పత్తి పైనే ఆశలు పెట్టుకుంటారు. మొదటి, రెండో విడుతల్లో వానలు కురిశాయి. కొన్ని రోజుల నుంచి వరుసగా వానలు కుస్తుండడంతో పత్తిని ఏరలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పత్తి మొక్కలపై విచ్చుకుని ఉన్న పత్తి గూడల్లోకి నీరు చేరి పత్తి గింజలు మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
దేవరుప్పుల మండలంలో..
దేవరుప్పుల: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి పంటల నష్టం అంచనా వేసేందుకు మండల వ్యవసాయాధికారి రామకృష్ణ గురువారం ఏఈవోలతో పాటు క్షేత్ర సందర్శన చేశారు. ఏవో మాట్లాడుతూ 230 ఎకరాల్లో వరి, 170 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ నష్టం కొంత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. వర్షాలతో పత్తి పంట ఎర్రబారిందని, పత్తి ఆశాజనకంగా లేదన్నారు. ఆయన వెంట ఏఈవో సాగర్ ఉన్నారు.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం