సోమవారం 08 మార్చి 2021
Jangaon - Oct 07, 2020 , 02:06:01

పార్కుతో పల్లెకు కొత్త కళ..

పార్కుతో పల్లెకు కొత్త కళ..

  • దుగ్గొండి మండలం 
  • చలపర్తిలో పూర్తయిన నిర్మాణం
  • పూలు, పండ్ల మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం 
  • వంద శాతం పల్లె ప్రగతి  పనులతో గ్రామాభివృద్ధి

దుగ్గొండి : పల్లె పార్కుతో చలపర్తి గ్రామానికి కొత్త కళ వచ్చింది. పల్లె ప్రగతిలో భాగంగా పూలు, పండ్ల మొక్కలతో ఏర్పాటైన ఈ పార్కు.. ఇటు పరిశుభ్రతతో పాటు గ్రామ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. అధికారుల సూచనలు, సర్పంచ్‌, పాలకవర్గం ప్రత్యేక కృషితో దుగ్గొండి మండలంలోనే ప్రప్రథమంగా చలపర్తి గ్రామంలో పల్లె పార్క్‌ పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో చలపర్తి గ్రామంలో వంద శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామానికో పార్కు ఏర్పాటుచేయాలనే సర్కారు ఆదేశాలతో గ్రామ సర్పంచ్‌ ముదురుకోల శారద, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాలకవర్గంతో కలిసి నిరంతరం శ్రమించి పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దారు. జీడికల్‌ పరిధిలోని బతుకమ్మ ఆడే ప్రదేశానికి సమీపంలో దీనిని ఏర్పాటుచేశారు. గ్రామంలో పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఆహ్ల్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇందులో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటించారు. 

అంతేగాక పార్కులో నడిచేందుకు వీలుగా దారులు, మొక్కల సంరక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్‌ వేయించారు. దుగ్గొండి మండలకేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో పక్కనే పార్క్‌ ఉండడంతో దారిన వెళ్లే ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక అక్కడ ఏర్పాటుచేసిన బోర్డులు, బతుకమ్మతల్లి విగ్రహాలతో పార్కుకు కొత్తదనం వచ్చింది. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో పల్లె పార్కును చూసేందుకు ప్రజలు వస్తున్నారని సర్పంచ్‌ చెబుతున్నారు. అలాగే గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, గ్రామనర్సరీల నిర్మాణాలను పూర్తిచేసి ఆదర్శంగా నిలిచారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

గ్రామస్తులు, పాలక వర్గం సహకారంతో చలపర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. పల్లెప్రగతిలో వంద శాతం పనులు పూర్తిచేయడం వల్లే జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవా ర్డు దక్కింది. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోనే ఉత్తమ జీపీగా నిలబెట్టేందుకు కృషిచేస్తా.

- ముదురుకోల శారద, సర్పంచ్‌

అందరి సహకారం వల్లే..

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వంద శాతం పూర్తి చేశాం. గ్రామస్తులు, పాలకవర్గం పూర్తిస్థాయిలో సహకరించడం వల్లే అన్నింటా ముందుకు తీసుకెళ్తున్నాం. దుగ్గొండి మండలంలో వంద శాతం పనులను పూర్తి చేసిన గ్రామంగా చలపర్తికి పేరు రావడం సంతోషంగా ఉంది.

- సంతోశ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి

VIDEOS

logo