బుధవారం 03 మార్చి 2021
Jangaon - Oct 05, 2020 , 06:26:20

బతుకమ్మ చీరలొచ్చాయ్‌...

బతుకమ్మ చీరలొచ్చాయ్‌...

  •  జిల్లాలో లక్షా 99 వేల మంది 
  • మహిళలకు సర్కారు కానుక
  • తెల్లరేషన్‌కార్డులున్న లబ్ధిదారులకు అందజేత  ఈనెల 9 నుంచి చీరల పంపిణీకి ఏర్పాట్లు

జనగామ, అక్టోబర్‌ 4 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలతో రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా సర్కారు పాలన అందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి సంవత్సరం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్‌ కార్డున్న లబ్ధిదారులకు మూడేళ్ల నుంచి వీటిని ఇస్తున్నారు. బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు చీరలు అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఈ సంవత్సరం లక్షా 99 వేల 556 మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.

జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజవర్గాల్లో ఈనెల 9న లాంఛనంగా చీరల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన చీరలు చేరగా వాటిని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గోదాములో భద్రపరిచారు. ఈసారి సిరిసిల్ల నుంచి జరీ సిల్క్‌ అంచున్న పాలిస్టర్‌ చీరలను ఇవ్వనున్నారు. తెల్లరేషన్‌ కార్డుల ఆధారంగా మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు నిరుపేద ముస్లింలు, క్రైస్తవుల కుటుంబాలకు దుస్తులు అందించినట్లుగానే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ చీరను కానుకగా అందించే సరికొత్త సంప్రదాయానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 355 రేషన్‌ షాపులుండగా వీటిలో 1,62,828 తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. తెల్ల రేషన్‌కార్డులో పేరుండి, 18 ఏళ్లు దాటిన యువతుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి మహిళకూ  బతుకమ్మ కానుకగా చీరను అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్‌ కోఆర్డినేటర్‌గా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్‌, మెప్మా, మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 2 లక్షల చీరలు అవసరమని గుర్తించగా ప్రభుత్వం 1.99,556 మందికి చీరలు మంజూరు చేసింది.

ఇప్పటికే మొత్తం చీరలు వచ్చాయి. ఇందుకోసం రెవెన్యూశాఖ సిబ్బంది కూపన్లు పంపిణీ చేసి బతుకమ్మ చీరలను అందజేయనుండగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారులను నియమించారు. పాలకుర్తి నియోజకవర్గానికి డీఆర్‌డీఏ పీడీ గూడూరు రాంరెడ్డి, జనగామ నియోజకవర్గానికి ఆర్డీవో మధుమోహన్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకర్గానికి డీఏవో కిరణ్‌కుమార్‌ పర్యవేక్షించనున్నారు. ఆయా మండలాల్లో ప్రత్యేక అధికారులు, నోడల్‌ అధికారులు చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ, మున్సిపల్‌ వార్డు స్థాయిలోనూ నోడల్‌ అధికారుల పర్యవేక్షణలో మహిళలకు బతుకమ్మ కానుకలను అందించ నున్నారు.

VIDEOS

logo