ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Sep 30, 2020 , 01:20:55

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 29 : మద్యం షాపుల సిండికేట్‌ దందా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు షాపుల యజమానులు ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 43 మద్యం షాపులుండగా, జిల్లా కేంద్రంలో తొమ్మిది ఉన్నాయి. అత్యధిక షాపుల్లో క్వాటర్‌ బాటిల్‌పై అదనంగా రూ.5, హాఫ్‌ బాటిల్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20, బీరు బాటిల్‌పై రూ.10 వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు చెబుతున్నారు. మద్యం కొనుగోలు చేసినప్పుడు దీనికి సంబంధించిన రసీదు ఇవ్వాలని నిబంధనల్లో ఉన్నా షాపుల యజమానులు పాటించడంలేదు. మద్యం ప్రియుల కోసం వివిధ రకాల బ్రాండ్ల లిస్టును అందుబాటులో ఉంచాల్సి ఉన్నా వీటిని షాపుల యజమానులు ఖాతర్‌ చేయడంలేదు. ఏ బ్రాండ్‌కు ఎంత రేటు ఉందో అని తెలిపే ధరల పట్టికను వైన్స్‌ ముందు ప్రదర్శించకుండా సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. వైన్స్‌ నిర్వాహకులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే లిక్కర్‌ బ్రాండ్లనే అందుబాటులో ఉంచుతున్నారని మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని తొమ్మిది వైన్స్‌ షాపుల పరిధిలో ఒక్కో షాపు కింద పది చొప్పున సుమారు వంద వరకు బెల్ట్‌ షాపులు దళారుల అనుచరులతో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. అక్రమంగా వెలిసిన బెల్ట్‌ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు కాకుం డా, అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురుకాకుండా ఈ సిండికేట్‌ దందా అన్నీ తామై నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎక్సైజ్‌ అధికారులకు మామూళ్లు ఇస్తూ అదనపు ధరలకు మద్యం విక్రయిస్తుండడంపై మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మద్యం షాపుల్లోని ధరల కంటే బెల్ట్‌ షాపుల్లో అదనపు ధరలకు మద్యం విక్రయిస్తున్నారని తెలిసింది. దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈలోపు తమ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుని అధిక లాభాలను గడిచేందుకు మద్యంషాపుల నిర్వాహకులు సిండికేట్‌ దందాకు తెరతీసినట్లు తెలిసింది. ఈ అక్రమ దందాను ఎవ రూ ప్రశ్నించకుండా ఉండేందుకు అధికారులకు, దళారులకు మామూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాలకు చెందిన పలు మద్యం షాపుల తీరుపై ఎక్సైజ్‌ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

మద్యంషాపు యజమానుల సిండికేట్‌ -మంతెన మణి, సేవ్‌ జనగామ ప్రతినిధి

జిల్లా కేంద్రంలోని వైన్‌ షాపు ల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. సిండికేట్‌గా మారిన వ్యాపారులు అక్రమ సంపాదనకు ఎగబడ్డారు. క్వాటర్‌ బాటిల్‌పై రూ.5 రూ, హాఫ్‌పై రూ.10, ఫుల్‌బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఈ నెల 24వ తేదీన జనగామ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులకి సేవ్‌ జనగామ పేరిట ఫిర్యాదు చేశాం. మద్యం షాపులపై చర్య తీసుకోవాలని కోరినా విచారణ పేరిట అధికారులు కాలయాపన చేస్తున్నారు.

ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నాం -సుధీర్‌కుమార్‌, ఎక్సైజ్‌ ఎస్సై, జనగామ

ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకి మద్యం విక్రయిస్తున్నారని సేవ్‌ జనగామ ప్రతినిధులు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం వారి ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాటిపై మాకు ఎవరైనా సరే.. రాతఫూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. అవసరమైతే సెల్‌ నంబర్‌ 9491318338కు లేదా 9440902655 నంబర్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 


VIDEOS

logo