సాగుకు సాయం.. రైతుకు ఊతం..

- అద్దెకు ఆధునిక వ్యవసాయ పరికరాలు
- రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు
- ‘కస్టం హైరింగ్ సెంటర్ల’ ఏర్పాటు
- రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా దేవరుప్పుల మండలం
- సీతారాంపురానికి చేరిన మిషన్లు
- వానకాలం నుంచే అన్నదాతలకు అందుబాటులో
- రూ.27లక్షల గ్రాంట్ మంజూరు
- జనగామ జిల్లాలోని మరో మూడు మండలాల్లో త్వరలోనే కేంద్రాలు
అదునుకు కూలీలు దొరక్క.. యంత్రాలు అందుబాటులో లేక అన్నదాతలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి ఇబ్బందులు తీర్చేందుకు మరో ముందడుగు వేసింది. రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చేందుకు సరికొత్తగా ‘కస్టం హైరింగ్ సెంటర్ల’ను ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో దశల వారీగా ఈ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో దేవరుప్పులను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలంలోని సీతారాంపురం గ్రామానికి పరికరాలను అందించింది. అలాగే కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, నర్మెట మండలాల్లోనూ త్వరలో సెంటర్లు ఓపెన్ చేయనుంది. - దేవరుప్పుల
దేవరుప్పుల : వ్యవసాయం ఒక్క రోజు అదును అంటారు. ఆరుగాలం పంట ఒక్క రోజు వాన పడినా వర్షార్పణమవుతుంది. ఒక్కోసారి వరినాట్ల సమయానికి కూలీలు దొరక్క నారు ముదురుతుంది. చేసేదిలేక కూలీలకు ఎక్కువ కూలి ఇచ్చి తెచ్చుకోవడంతో రైతులకు పెట్టుబడి అధికమవుతుంది. ఇటు పత్తి కట్టె తీయాలన్నా టైమ్‌కు ట్రాక్టర్లు దొరక్క ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకే సారి వరి నాటుకు రావడం, ఉన్న ట్రాక్టర్లకు ఒకేసారి పని ఉండడంతో రైతులు రోజల తరబడి ట్రాక్టర్ల కోసం వేచిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇంకా పాతకాలపు వ్యవసాయ పద్ధతులనే పాటించడం వల్ల పెట్టుబడి అధికమవడమేగాక, దిగుబడి సైతం తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ గుర్తించిన రాష్ట్ర ప్రభు త్వం సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. అన్నదాతల కష్టాలను కడతేర్చే దిశగా మరో అడుగు ముందుకేసింది. రైతులకు అందుబాటులో ఆధునిక వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఉంచేలా ‘కస్టం హైరింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో దశలవారీగా కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రైతులకు కావాల్సిన ఆధునిక వ్యవసాయ పనిముట్లను మహిళా సంఘాల వద్ద అందుబాటులో ఉంచి అవసరమైనవి సరసమైన ధరలో అద్దెకు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. దీంతో చిన్న, సన్నకారు రైతులు, పనిముట్లు లేని రైతులు పెద్దరైతులతో సమానంగా సాగు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది.
జనగామ జిల్లాలోనే నాలుగు సెంటర్లు
జనగామ జిల్లాలో నాలుగు చోట్ల కస్టం హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. దేవరుప్పుల మండలం సీతారాంపురం, కొడకండ్ల మండలం రామవరం, స్టేషన్‌ఘన్‌పూర్ మం డలం ఛాగల్లు, నర్మెట మండలం హన్మంతపూర్ గ్రా మాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించగా ఇప్పటికే వారికి శిక్షణ పూర్తయింది. ఎంపిక చేసిన గ్రామాలతో పరిసర గ్రామాలను అనుసంధానం చేస్తారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా దేవరుప్పుల
రాష్టంలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా దేవరుప్పుల మండలం సీతారాంపురాన్ని తీసుకోగా గ్రామానికి ధర్మగడ్డ తండా, కామారెడ్డిగూడెం, కడవెండి గ్రామాలను అనుసంధానం చేశారు. ఇందుకు గాను ఇప్పటికే రూ.27లక్షల గ్రాంట్ విడుదల కాగా, రూ.13లక్షల విలువైన పరికరాలు సీతారాంపురం చేరాయి. వరి కోసే యంత్రం, గడ్డిని చుట్టచుట్టి మోపులు కట్టే యంత్రం (అగ్రికల్చర్ రౌండ్ బేలర్), పత్తితో పాటు ఎకరం మెట్ట పంటలపై ఒకేసారి పిచికారీ చేసేలా ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలు (ట్రాక్టర్ మౌంటెడ్ భూమ్ స్ప్రేయర్) పత్తి చేను ఎండిపోయిన తర్వాత కట్టె తీసే యంత్రం(ట్రాక్టర్ ఆపరేటెడ్ మొబైల్ షెడ్డర్), పంటలపై మందులు పిచికారీ చేసే ఆధునిక స్ప్రేయర్లు (తైవాన్ స్ప్రేయర్లు) అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ వానకాలం సీజన్‌నుంచే యంత్రాలను రైతులకు అద్దెకిస్తున్నారు. ఆధునిక కొడవళ్లు, వరినాటు యంత్రాలు, పత్తిలో ఎరువులు వేసే యంత్రాలు ఇలా అనేకం మహిళా సంఘాల వద్ద అద్దెకు దొరుకుతాయి. అన్ని గ్రామాలకూ ఈ పథకాన్ని విస్తరిస్తే అదనుకు వ్యవసాయ పనులు సాగుతాయని రైతులు సంతోషపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే కస్టం హైరింగ్ సెంటర్లు రైతులకు వరమని చెప్పొచ్చు. పంటల పెట్టుబడులు తగ్గించి, సకాలంలో పనులు జరిగేందుకు ఇది తోడ్పతుంది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జనగామ జిల్లాలో ఈ పథకం అమలవుతున్నది. మరోవైపు దేవరుప్పుల మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని అమలుచేయడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతోనే దేవరుప్పుల పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది. - నూరొద్దీన్, ఏపీడీ
గ్రామాల్లో ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులో లేక వ్యవసాయ పనులు వెనుకబడుతున్నయ్. అదనుకు కోత మిషన్లు, స్ప్రేయర్లు దొరక్క రైతులు ఆగమైతున్రు. అద్దె పనిముట్ల పథకంతో ఈ కష్టాలు తీరుతయ్. ఇక సంఘం నుంచి తక్కువ ధరకు రైతులకు ఆధునిక పరికరాలు అద్దెకు ఇస్తాం. ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా మహిళా సంఘాలకు ఇవ్వడం మంచి పరిణామం.- గుంటి అనిత, దీప్తి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు
తాజావార్తలు
- సాగర్ టికెట్ ఎవరికి?
- చేసిన ఒక్క మేలు చెప్పండి
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై