మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Sep 28, 2020 , 05:25:00

రూ.55 కోట్లతో పల్లెలకు బీటీ రోడ్లు

రూ.55 కోట్లతో పల్లెలకు బీటీ రోడ్లు

  •  నిధులు మంజూరు చేసిన సర్కారు
  • పాలకుర్తి నియోజకవర్గంలో
  •  మెరుగైన రవాణా సౌకర్యం
  • ప్రతి పల్లె , తండాకు బీటీ రోడ్డు 

బీటీ సౌకర్యం కల్పిస్తా..

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతా. పాలకుర్తి ప్రజల దయ, సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో మంత్రినయ్యా. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి పని చేస్తా. రహదారి పనుల్లో అధికారులు వేగం పెంచాలి. 

- ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి


పాలకుర్తి రూరల్‌, సెప్టెంబర్‌ 27: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ సర్కారు మెటల్‌ రోడ్లను బీటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలో పల్లెలు, తండాలకు బీటీ రోడ్లు వేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలోని పల్లెలకు రూ.55 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు చేశారు. ఇప్పటికే జనగామ-పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌-మొండ్రాయి, జనగామ -దేవరుప్పుల రూట్లలోని రహదారులను డబుల్‌ రోడ్లుగా మార్చారు. మరోవైపు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో బీటీ రోడ్లను మంజూరు చేశారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను నుంచి రఘునాథపల్లి మండలం కంచనపల్లి, కోతులబాద్‌, గబ్బెట వరకు 12.10 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 1043.10 లక్షలు మంజూరు చేయించారు. పాలకుర్తి నుంచి కొడకండ్ల వయా వల్మిడి, ముత్తారం, ఏడునూతుల, నర్సింగపురం వరకు 18.49 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 1309.98 లక్షలు, పాలకుర్తి మండలం గూడూరు నుంచి ధర్మపురం వయా తిరుమలగిరి, ఈరవెన్ను, శాతాపురం, మాధపురం వరకు 20.03 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1497.21 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు దేవరుప్పుల నుంచి విస్నూరు వయా కొత్త కాలనీ, ధర్మపురం, మైలారం 13.15 కిలోమీటర్ల బీటీకి రూ.972.13 లక్షలు మంజూరైనట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

వీటితో పాటు బీటీ రెన్యువల్స్‌కు కూడా మినరల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల నుంచి నిధులు మంజూరు చేశారు. పాలకుర్తి మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి లక్ష్మీనారాయణపురం వరకు రూ.50 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మంచుప్పుల వరకు రూ.20 లక్షలు, కోతులబాద్‌ నుంచి నర్సింగపురం తండా వరకు రూ.64 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గుడికుంట తండా వరకు రూ.56 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం వయా రాఘవపురం వరకు రూ.60 లక్షలు, గూడూరు నుంచి గోపాలపురం వరకు రూ. 60 లక్షలు, బమ్మెర నుంచి తమ్మడపల్లి వయా ఇప్పల కుంట తండా వరకు రూ.77.20 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సిరిసన్నగూడెం వరకు రూ.20 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి తీగారం వరకు రూ.40 లక్షలు, దర్దేపల్లి నుంచి గూడోల్లగూడెం వరకు రూ.20 లక్షలు, వావిలాల నుంచి నారబోయినగూడెం వరకు రూ.17 లక్షలు, కొండపురం నుంచి పూసల తండా వరకు రూ.21 లక్షలు మంజూరు చేశారు. అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఇటీవల మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పంచాతీరాజ్‌ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. 

మంత్రి ఎర్రబెల్లికి రుణపడి ఉంటాం

గ్రామాలాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడమేగాక ప్రతి పల్లె, తండా వరకు బీడీ రోడ్డు మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రుణ పడి ఉంటాం. పాలకుర్తి నియోజకవర్గంలో ఊరూరుకు బీటీ రోడ్డు రానుంది. లక్ష్మీనారాయణపురానికి బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రి ఎర్రబెల్లికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి రుణపడి ఉంటాం.                        -బెల్లి సోమయ్య, ఎంపీటీసీ, లక్ష్మీనారాయణపురం

VIDEOS

logo