మంగళవారం 27 అక్టోబర్ 2020
Jangaon - Sep 27, 2020 , 06:24:42

భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు

భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు

  • మత్తడిపడుతున్న చెరువులు
  • పలు గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంట
  • జలమయమైన జనగామ పట్టణం

జనగామ/దేవరుప్పుల/బచ్చన్నపేట/జనగామరూరల్‌, సెప్టెంబర్‌ 26 : మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కురు స్తున్న భారీ వర్షాలతో జనగామ పట్టణ శివారులోని రంగప్పచెరువు అలుగు పోస్తోంది. మరోవైపు దిగువకు ప్రవహిస్తున్న వరదనీటితో పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, కురుమవాడ సహా జ్యోతినగర్‌లోని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గత ఏడాది డిసెంబర్‌లో పట్టణ శివారులోని రంగప్పచెరువులోకి గోదావరి జలాలను విడుదల చేయించడంతో అప్పట్లో అలుగు పోసింది. అయితే ఈసారి దంచికొడుతున్న వానలతో ఇప్పటికే మూడు, నాలుగుసార్లు చెరువు నిండుకుండలా తయారైంది. ఏ కొద్దిపాటి వర్షం కురిసినా అలుగుపోస్తున్నది.

కొద్దిరోజుల క్రితం కురుసిన భారీ వర్షాలతో చెరువు మత్తడి నీరంతా పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, కుర్మవాడ, సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌, జ్యోతినగర్‌ వంటి పలు కాలనీలలోకి నీరు చేరింది. అంతేకాకుండా ఆయా కాలనీల మీదుగా వరదనీరు హైదరాబాద్‌ ప్రధాన రోడ్డు మీదుగా ప్రవహించడంతో పట్టణంలోని హైవే రోడ్డు చాలాచోట్ల దెబ్బతిన్నది. ఇదే అంశాన్ని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తాజాగా రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగప్పచెరువు మళ్లీ మత్తడి పారడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు శ్రీనగర్‌కాలనీ, కుర్మవాడ, జ్యోతినగర్‌లోని పలు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. దీనిపై అధికారులు పరిశీలించి నీటిని మళ్లించేలా చర్యలు తీసుకోవాల ని స్థానికులు కోరారు. ఇదిలా ఉండగా దేవరుప్పుల మండలం లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో చెరువులు నిండాయి. కోలుకొండలో 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో చౌడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల చెక్‌డ్యామ్‌లు మున్నెన్నడూ లేని రీతిలో అలుగు పోస్తున్నాయి. మరోవైపు చెక్‌డ్యామ్‌ల కింది భాగంలో వందలాది మంది చేపల వేటకు రాగాపెద్ద చేపలు వలలకు చిక్కుతున్నాయి.

మరోవైపు బచ్చన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. బచ్చన్నపేట గుడి చెరువు నిండుకుండలా మారడంతో కరువుతీరినట్లేనని రైతులు చెబుతున్నారు. జనగామ మండలంలోని పెంబర్తి  కంబాలకుంట నిండి కట్టపైకి వస్తుండడంతో కట్టకు ముప్పు పొంచి ఉందనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ డీఈ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌, సర్పంచ్‌ అంబాల ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి శనివారం కట్టను పరిశీలించి మరమ్మతు చేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు వరదలతో పలు గ్రామాల్లోని రహదారుల మీదుగా కల్వర్టుల నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. logo