మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Sep 25, 2020 , 05:37:20

ఉమ్మడి జిల్లాలో నాలుగు దవాఖానలకు కాయకల్ప అవార్డులు

ఉమ్మడి జిల్లాలో నాలుగు దవాఖానలకు కాయకల్ప అవార్డులు

    జనగామ టౌన్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌/ములుగు/చిట్యాల : సర్కారు దవాఖానల పనితీరును పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఏటా అందిస్తున్న కాయకల్ప అవార్డులు ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నాలుగు దవాఖానలకు లభించాయి. గురువారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకా టి కరుణ విడుదల చేసిన జాబితాలో జనగామ జిల్లా దవాఖానకు రెండో స్థానం దక్కిందని ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌ రాజు, సూపరింటెండెంట్‌ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రికి రూ.10 లక్షల అవార్డు వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే,  స్టేషన్‌ఘన్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికీ అవార్డు కింద రూ.లక్ష కేటాయించారు.

ఈ మేరకు వైద్యాధికారి డాక్టర్‌ రామునాయక్‌, డాక్టర్‌ శ్రీవాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల సివిల్‌ దవాఖాన రన్నర్‌గా నిలిచినట్లు సూపరింటెండెంట్‌ జీడీ తిరుపతి తెలిపారు. ఈ మేరకు అవార్డు కింద దవాఖానకు రూ.5లక్షల నజరానా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ములుగు జిల్లా దవాఖానకు కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డును ప్రకటించింది. గతంలో సామాజిక ఆస్పత్రిగా ఉన్న ఈ దవాఖానను ప్రభుత్వం 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి, అధునాతన హంగులు, ప్రత్యేక యంత్రాలను సమకూర్చింది. ఈ క్రమంలో ఇక్కడ లభిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. దవాఖానకు మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రూ.లక్ష నగదుతో పాటు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌కు ప్రశంసాపత్రం అందించనున్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన వైద్యులు, సిబ్బందికి సూపరింటెండెంట్‌ కృతజ్ఞతలు తెలిపారు.

VIDEOS

logo