బుధవారం 28 అక్టోబర్ 2020
Jangaon - Sep 24, 2020 , 06:32:10

మహిళలపైకి దూసుకెళ్లిన కారు

మహిళలపైకి దూసుకెళ్లిన కారు

  • ముగ్గురికి తీవ్ర గాయాలు
  • వరంగల్‌-హైదరాబాద్‌ రోడ్డుపై ఘటన

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 23: జిల్లా కేంద్రంలోని హన్మకొండ-హైదరాబాద్‌ రహదారిలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద బుధవారం రాత్రి ఓ కారు అతివేగంగా వచ్చి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలతోపాటు ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రాంతానికి చెందిన ఐదుగురు మహిళలు ఇండస్ట్రియల్‌ ఏరియాలోని డీఆర్డీఏ వెలుగు కార్యాలయానికి పనుల నిమిత్తం వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. గురుద్వార్‌ సమీపంలోని జిరాక్స్‌ సెంటర్‌ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న కారు ముగ్గురు మహిళలతోపాటు పార్కింగ్‌ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ధర్మకంచ ఏరియాకు చెందిన తిప్పారపు జ్యోతి, మచ్చ బాలమణితోపాటు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్న శ్రీరాం నగర్‌ కాలనీకి చెందిన క్రాంతి చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి బాధితులను చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఏరి యా దవాఖానకు తరలించారు.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ జూలూరి మనోజ్‌ది కూడా జనగామలోని బాలాజీనగర్‌ ఏరియా అని తెలిసింది. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కారు డ్రైవర్‌ మనోజ్‌ను, కారును జనగామ అర్బన్‌ పోలీసులు ఆధీనంలోకి తీసుకొని జనగామ పీఎస్‌కు తరలించారు. నిందితుడిపై ఎస్సై సీహెచ్‌ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ విలేకరులకు తెలిపారు.


logo