శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Sep 23, 2020 , 03:19:00

భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు

భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు

లింగాలఘనపురం, సెప్టెంబర్‌ 22 : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఇప్పటికే జనగామ శివారులోని రంగప్ప చెరువు అలుగుపోస్తుండగా, చీటకోడూరు రిజర్వాయర్‌ గేట్లను ఎత్తడంతో కాకతీయుల రాజుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు నిండుతున్నాయి. చీటకోడూరు రిజర్వాయర్‌ నుంచి వస్తున్న వరద యశ్వంతాపూర్‌ వాగులో చేరుతోంది. దీంతో పాలకుర్తి-కుందారం రహదారిపై వరద ఉధృతి పెరిగి మంగళవారం ఉదయం కుందారం, చీటూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్సై సంతోషం రవీందర్‌ యశ్వంతాపూర్‌ వాగు పరిసరాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో లింగాలఘనపురం చెరువులోకి 8 ఫీట్ల వరకు నీరు చేరుకోగా, కల్లెం, నాగారం గ్రామాల్లోని కుంటలు నిండుతున్నాయి. చీటకోడూరు రిజర్వాయర్‌ నుంచి వస్తున్న వరద నెల్లుట్ల చెరువులోకి చేరుతుండడంతో మత్తడి పోస్తోంది. నెల్లుట్ల నుంచి వస్తున్న వరద పటేలుగూడెం చెరువులో చేరడంతో అలుగుపడుతోంది. ఇక్కడి నుంచి వస్తున్న మత్తడి నీరు నవాబుపేట చెప్పన్‌ చెరువులోకి చేరడంతో జలాశయం నిండింది. నవాబుపేట రిర్వాయర్‌ నుంచి గుండాల మండలంలోని పలు చెరువులకు కాల్వ ద్వారా వెళ్తున్న నీటితో కొత్తపెల్లి చెరువు మత్తడి పోస్తోంది. నవాబుపేట మత్తడి నుంచి వస్తున్న వరదతో వడిచర్ల, నేలపోగుల గంగదేవి చెరువు, నాగుల చెరువులు నిండాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈసారి రెం డు పంటలు పండుతాయంటున్నారు. ఇక కరువు తీరినట్లేనని అభిప్రాయపడుతున్నారు.


VIDEOS

logo