సోమవారం 01 మార్చి 2021
Jangaon - Sep 21, 2020 , 04:57:40

పిల్లలకూ పోస్టాఫీస్‌ ఖాతా..

పిల్లలకూ పోస్టాఫీస్‌ ఖాతా..

  • తపాలా శాఖ సరికొత్త నిర్ణయం
  • ఇక ప్రతి విద్యార్థికీ బ్యాంకు అకౌంట్‌
  • పదేళ్లు నిండి ఆధార్‌ కార్డు ఉంటే చాలు
  • పొదుపు నేర్పడమే ధ్యేయం
  • ఇందులోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి జమ
  • ప్రతి గ్రామంలో పోస్టాఫీస్‌ పేమెంట్‌ బ్యాంకులు

విద్యార్థులకు డబ్బు ప్రాధాన్యత, పొదుపు చేయడంపై ఆసక్తి కలిగించే దిశలో పోస్టాఫీసులు కార్యాచరణ రూపొందించాయి. 10 ఏళ్లు నిండి ఆధార్‌ కార్డు ఉన్న వారికి ఖాతా ఇచ్చేందుకు తపాలా శాఖ చర్యలు చేపట్టింది. ప్యాకెట్‌ మనీని పొదుపు చేయడం ఒకటైతే, విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి అందే స్కాలర్‌షిప్పులు, ఇతర లబ్ధి ఈ ఖాతాల్లోనే జమవుతుంది.

- దేవరుప్పుల 

దశాబ్దాలుగా లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న పోస్టాఫీసులు మరో అడుగు ముందుకేశాయి. విద్యార్థి దశ నుంచి ఆర్థిక మదుపు చేస్తే డబ్బు విలువ తెలుస్తుందని వారికి ఎలాంటి ఖర్చు లేకుండా జీరో అకౌంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక బ్యాంకులు మండల స్థాయిలో ఒకటి ఉండగా పోస్టాఫీసు ప్రతి గ్రామంలో ఉంటుంది. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులు తమ గ్రామంలో ఖాతా తెరిచి వాడుకోవచ్చు. పోస్టాఫీసులో ఖాతా తెరువాలంటే ఎలాంటి జిరాక్స్‌ డాక్యుమెంట్లు, డిపాజిట్‌ అక్కర లేకుండా జీరో అకౌంట్‌ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు 18 ఏళ్లు నిండితేనే వారికి అకౌంట్‌ ఇస్తున్నాయి. కానీ పోస్టాఫీసులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థి ఆధార్‌ ఉంటే ఫింగర్‌ ప్రింట్‌ తీసుకుని వెంటనే ఐదు నిమిషాల్లో పాసు పుస్తకం పంపే ఏర్పాట్లను ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు చేస్తున్నది.

అందరికీ బ్యాంకింగ్‌ సేవలు


ప్రతి విద్యార్థికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా పోస్టాఫీస్‌ బ్యాంకు ఖాతా తెరుస్తాం. కేవలం ఆధార్‌కార్డు, తమ ఇంట్లో ఉండే మొబైల్‌ నంబర్‌ తీసుకొస్తే చాలు. పిల్లలకు డబ్బు పొదుపు గురించి నేర్పడమే దీని ఉద్దేశం. విద్యార్థులు ఖాతా తెరిచేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. ఫింగర్‌ ప్రింట్‌తో ఈ ఖాతాలను ఎక్కడైనా ఆపరేట్‌ చేసుకోవచ్చు.

- జీ కవిత, బ్రాంచి మేనేజర్‌,ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌, జనగామ జిల్లా

VIDEOS

logo