బుధవారం 03 మార్చి 2021
Jangaon - Sep 19, 2020 , 06:03:50

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

  • అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్‌ నిఖిల

నెహ్రూపార్క్‌, సెప్టెంబర్‌ 18 : పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణం, తడి పొడి చెత్త షెడ్లు, రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణం, హరితహారం, గ్రామాల్లో పారిశుధ్యం, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.

మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలతో నిఖిల చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులకు గల కారణాలపై ఆమె ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధిపనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని, గ్రామ పంచాయతీలు వీటిపై పర్యవేక్షించడంతోపాటు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి తదితర మండలాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసిన అధికారులను నిఖిల అభినందించారు. గ్రామాల్లో శానిటేషన్‌ పనులను ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, అనంతరం 15 నుంచి 20వ తేదీ వరకు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్‌ హమీద్‌, భాస్కర్‌రావు, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, జడ్పీ సీఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo