శనివారం 31 అక్టోబర్ 2020
Jangaon - Sep 17, 2020 , 07:47:11

బల్దియాకు ‘కొత్త మాస్టర్‌ప్లాన్‌'

బల్దియాకు ‘కొత్త మాస్టర్‌ప్లాన్‌'

  • ఉపగ్రహ చిత్రాల ద్వారా  రూపకల్పనకు సన్నాహాలు
  • ప్రతిపాదనలకు జనగామ మున్సిపల్‌ అధికారుల కసరత్తు

జనగామ, సెప్టెంబర్‌ 16 : జిల్లా కేంద్రమైన జనగామ పట్టణంలో కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు డీటీసీపీ యోచిస్తున్నది. మున్సిపల్‌ పరిధిలోని గృహాలు, పరిశ్రమలు, రోడ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు వంటి భూ వినియోగ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ తయారీకి ఈ పద్ధతి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు ఉన్నాయో

ఉపగ్రహ చిత్రాల ద్వారా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించనున్నారు. ఇరుగ్గా ఉన్న రోడ్లను భవిష్యత్‌ అవసరాల రీత్యా విస్తరించేలా కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయనున్నారు. దశాబ్దాల క్రితం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో పట్టణంలోని గ్రీన్‌సిటీ ఇండస్ట్రియల్‌ ఏరియాగా ఉంది. పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుతం గ్రీన్‌సిటీ మొత్తం గృహ నిర్మాణాలుగా మారాయి. మాస్టర్‌ప్లాన్‌ వాస్తవ భూ వినియోగం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇండస్ట్రియల్‌ ఏరియాగా మాస్టర్‌ప్లాన్‌లో ఉండడంతో ఇళ్ల నిర్మాణాల అనుమతుల జారీకి మున్సిపాలిటీలో అవకాశం లేకుండా పోతున్నది. ఫలితంగా ఆదాయం రావడంలేదు. మాస్టర్‌ప్లాన్‌ సవరణతో కొత్తగా వెలసిన కాలనీలు దీని పరిధిలోకి రానున్నాయి. చాలా వరకు వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారాయి. పట్టా భూముల్లో రోడ్లు తీసి అమ్ముకోవడంతో అందులో వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగింది. పాత మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తుతం కాలనీలుగా మారిన ఇళ్ల మధ్య నుంచే 50 ఫీట్ల రోడ్ల ప్రతిపాదన ఉండగా, కొద్ది నెలల క్రితం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ తయారు చేసిన కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో ఇప్పటికే 40 ఫీట్లుగా ఉన్న రోడ్లను 50 ఫీట్లకు విస్తరిస్తూ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలో ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థలు (డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే జనగామకు కొత్త రూపు వస్తుంది. పట్టణాల్లో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. 

‘జుడా’కు సన్నాహాలుల

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ కష్టాలను దూరం చేసే లక్ష్యంతోపాటు పట్టణం చుట్టూ విస్తరించే దిశగా అవుటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మరోవైపు జనగామ పట్టణాభివృద్ధి సంస్థ (జుడా) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండో పెద్ద పట్టణంగా, సెకండ్‌ గ్రేడ్‌ పురపాలక సంఘంగా ఉన్న జనగామ పట్టణం 17.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 12 వేల కుటుంబాలతో జనాభా 52,409 మందికి చేరింది. దీనికితోడు జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న శామీర్‌పేట, వడ్లకొండ, నెల్లుట్ల, పెంబర్తి, యశ్వంతాపూర్‌, చీటకోడూరు, ఎల్లంల, చిక్కులోనిగూడెం వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణం, కాలనీలు, విల్లాలు, ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు విస్తరిస్తున్నాయి. ప్రస్తుత జనాభాకు తోడు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత అధికారులు, ఉద్యోగులు, వ్యాపారుల కుటుంబాలతో అదనంగా 10 శాతం జనాభా పెరిగిందని అంచనా. దీనికితోడు చుట్టపక్కల  గ్రామాల నుంచేగాక జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజూ పట్టణానికి 20 వేల మంది వస్తుంటారు. 163 జాతీయ రహదారి యాదగిరి-వరంగల్‌ వరకు ఫోర్‌లైన్‌ హైవేగా విస్తరించింది. పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతమున్న రోడ్డుకు ఇరువైపులా 75 ఫీట్లు అంటే మొత్తం 150 ఫీట్ల హైవే, ఊరి బయట ఇరువైపులా 100 ఫీట్లు అంటే 200 ఫీట్లతో నాలుగు లైన్ల హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనగామ జిల్లాగా మారిన నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో హైదరాబాద్‌-వరంగల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ ఉండడంతో భవిష్యత్‌లో జనగామ పట్టణానికి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పెరిగే జనాభాకు తగ్గట్టు రింగ్‌రోడ్డు(డీపీఆర్‌) రూపకల్పనకు మెరుగులు దిద్దుతున్నారు. 

పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పడితే..

హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల తరహాలో కొత్తగా జిల్లా కేంద్రాలుగా ఆవిర్భవించిన చోట పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటయితే జిల్లా కేంద్రంలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగనున్నాయి. దీనికితోడు జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న గ్రామాలు జనగామలో కలిసిపోనున్నాయి. ప్రత్యేక అధికారితోపాటు పాలక మండలి నియమించి సర్కారు నిధులు కేటాయించనుంది. పార్కులు, రోడ్లు, ప్రధాన కూడళ్లు, జంక్షన్ల విస్తరణ, అభివృద్ధి జరుగుతుంది. ప్రతీ జిల్లాకు పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఆచరణ రూపం దాలిస్తే జనగామ జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పట్టణాభివృద్ధి సంస్థకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలను, మున్సిపల్‌కు ఎన్నికైన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. వీరికి అదనంగా పురపాలకశాఖ అధికారి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, ఆర్థిక విభాగం అధికారి తోపాటు ప్రభుత్వం మరో ఇద్దరిని పట్టణాభివృద్ధి సంస్థకు నియమిస్తుంది.